రాయలసీమ కన్నీళ్లు తుడుస్తానంటూ యువగళం పాదయాత్రలో ఉన్న టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం `మిషన్ రాయలసీమ’ సమావేశంలో చేసిన ప్రకటన టీడీపీ భారీ ఎన్నికల ప్రకటన మాదిరిగా ఉంది. పార్టీ వేడుకలలో చర్చించకుండా, అధికారికంగా పార్టీ ఆమోదం పొందకుండా ఏకపక్షంగా లోకేష్ ఇటువంటి ప్రకటన చేయడం తొందరపాటు చర్యగా ఆ పార్టీ నేతలు పలువురు భావిస్తున్నారు.
రాయలసీమలో టీడీపీకి తక్కువ సీట్లు వచ్చినా తాము మాత్రం తక్కువగా చూడలేదని చెబుతూ మొత్తం రాయలసీమను అభివృద్ధి చేసే లక్ష్యంతో ఉన్నామని ఈ ప్రకటన చేశారు. రాయలసీమలో 118 రోజులుగా 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 1,516 కి.మీ. పాదయాత్ర చేశానని, ఆ సమయంలో వారి కష్టాలు చూశానని లోకేశ్ చెప్పుకొచ్చారు.
అధికారంలోకి వచ్చాక మిషన్ రాయలసీమ ద్వారా వాటన్నింటినీ రూపుమాపుతామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఇప్పటికే రాజమహేంద్రవరంలో మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన `మినీ ఎన్నికల ప్రణాళిక’ మొత్తం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు పరుస్తున్న `బటన్ నొక్కుడు’ కార్యక్రమాలకు కాపీగా ఉండనే వాఖ్యలు టిడిపి శ్రేణుల నుండే వస్తున్నాయి.
ఇప్పుడు లోకేష్ చేసిన ప్రకటనలో సహితం స్పష్టమైన ఫోకస్ అంటూ లేకుండా ఒకేసారి మొత్తం రాయలసీమను అత్యంత అభివృద్ధి చెందిన ప్రాంతంగా చేస్తాను అన్నట్లుగా ఉంది. ఈ సందర్భంగా పార్టీలో తగిన వేదికలపై ఎటువంటి చర్చలు జరపకుండా ఏకపక్షంగా ప్రకటించడం భవిష్యత్లో సమస్యలకు దారితీయవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘకాలం రాయలసీమకు చెందిన వారే ముఖ్యమంత్రులుగా ఉన్నప్పటికీ ఎన్టీ రామారావు తెలుగు గంగ ప్రాజెక్టు తీసుకొచ్చే వరకు ఆ ప్రాంతంలో చెప్పుకోదగిన ప్రధాన అభివృద్ధి పథకం అంటూ లేదు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంత ప్రయత్నం జరిగింది.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు శంకుస్థాపనలతోనే ఎక్కువగా సరిపెట్టారు. రాయలసీమ జిల్లాలను ఆటో మొబైల్, ఎలక్ట్రానిక్స్ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుస్తామని, హార్టికల్చర్ హబ్ గా మారుస్తానని, స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పుతామని అంటూ లోకేష్ చాలా హామీలు ఇచ్చారు. అయితే ఈ హామీలకు స్పష్టమైన అధ్యయనం జరిపిన పూర్వరంగం ఉందా? నిపుణుల బృందాలతో చర్చించి రూపొందించారా?
ఇటువంటి కీలకమైన ప్రకటనలు చేసే ముందు కనీసం పార్టీ పొలిట్ బ్యూరోలో చర్చించడం అవసరం. అదేమీ లేకుండా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ప్రకటించడం గమనిస్తే తనను పార్టీకి మించిన నేతగా ప్రజల ముందు చూపుకోనే ప్రయత్నం జరుగుతున్నట్లు స్పష్టం అవుతుంది.
ఈ ప్రకటన చేయడానికి ముందు రోజు ఒకచోట మాట్లాడుతూ “మీరు సమస్యలపై నా వరకూ రానవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వెళ్లినా పరిష్కరిస్తారు” అంటూ లోకేష్ మాట్లాడటం పలువురికి ఆశ్చర్యం కలిగించింది. ఉద్దేశ్యపూర్వకంగా అన్నారో లేదా ప్రాస పదాలతో ఆ విధంగా వచ్చిందో గాని టీడీపీ చంద్రబాబుకన్నా తానే గొప్ప నాయకుడిని అనే భావన వ్యక్తమైంది.
వచ్చే ఎన్నికల్లో అభివృద్ధికి సింబల్ గా చంద్రబాబును ప్రజల ముందుంచి టీడీపీ గెలిచే ప్రయత్నం చేయాలి గాని, లోకేష్ ను మరో నాయకుడిగా గుర్తించే విధంగా చేసే ప్రయత్నాలు పార్టీకి చేటు తీసుకు రాగలవని ఆ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ పాదయాత్ర ద్వారా పార్టీలో సమాంతర నాయకత్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నం లోకేష్ చేస్తున్నారనే విమర్శలు చెలరేగుతున్నాయి.
లోకేష్ పాదయాత్ర సమయంలో నంద్యాలలో రచ్చ సృష్టించిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ విషయంలో హడావుడిగా త్రిసభ్య కమిటీ వేయడమే గాని ఇప్పటివరకు పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోలేక పోయింది. పైగా ఆమెపై పోలీసు కేసు నమోదు చేసిన సుబ్బారెడ్డిపై దానిని ఉపసంహరించుకోమని వత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేశారు. తన సమక్షంలో జరిగిన వివాదం విషయంలో లోకేష్ మౌనంగా ఉండటం ఆయన నాయకత్వంకే మచ్చగా మిగిలే ప్రమాదం ఉంది.