మాఫియా కేంద్రంగా విశాఖ… ఎంపీ కుటుంభం సభ్యులే కిడ్నాప్!

Sunday, December 22, 2024

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంను విద్రోహ శక్తుల అడ్డాగా మార్చారని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఆ నగరంలో ఒక బహిరంగసభలో ప్రసంగిస్తూ చెప్పిన వారం రోజుల లోపుగానే అక్కడ అధికార పార్టీకి చెందిన ఎంపీ కుటుంభం సభ్యులనే దుండగులు కిడ్నాప్ చేయడం రాజకీయంగా కలకలం సృష్టించింది.

ప్రశాంతతకు పేరొందిన విశాఖపట్టణంలో వైఎస్ జగన్ పాలనలో దౌర్జన్య శక్తులకు అడ్డాగా మారింది. భూ ఆక్రమణలు, దౌర్జన్యాలు, దోపిడీలు పెట్రేగి పోతున్నాయి. చాలావరకు పోలీసుల దృష్టికి కూడా రావడం లేదు. పోలీసులు సహితం అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ శాంతిభద్రతలను పట్టించుకోవడం లేదు.

స్థానిక వైసిపి ఎంపీ ఎంవివి సత్యనారాయణ భార్య, కుమారుడిని అపహరించి, 48 గంటల సేపు దుండగులు తమ ఆధీనంలో ఉంచుకుంటే  కనీసం ఆ ఎంపీకి కూడా తెలియదు. పోలీసులకు కూడా తెలియదు. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా మారాయో వెల్లడవుతుంది. నేరుగా ఎంపీ ఇంటికే వచ్చి, కుమారుడిని బంధించి, అక్కడి నుండే రెండు రోజుల పాటు తమ దౌర్జన్యాన్ని కొనసాగించారంటే ఎంతగా బరితెగించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారో వెల్లడవుతుంది.

దుండగులకు బందీలుగా ఉండగానే భార్య, కొడుకులతో ఎంపీ మాట్లాడుతున్నా, వారితో పాటు ఉన్న తన స్నేహితుడైన ఆడిటర్ జివితో మాట్లాడుతున్నా పసిగట్టలేక పోయారు. అయితే ఆడిటర్ పొంతనలేని సమాధానాలతో అనుమానం వచ్చి పోలీస్ కమీషనర్ త్రివిక్రమ్ వర్మకు చెబితే అప్పటికి గాని ఏదో జరిగిందనే నిర్ధారణకు రాలేకపోయారు.

పోలీసులకు తెలిసిందని, ఎంపీ కారులోనే వారిని బందీలుగా తీసుకెడుతుండగా, వారు వెంటాడుతున్నారనే అనుమానంతో మధ్యలో భార్య, కొడుకును వదిలివేశారు. ఆడిటర్ ను వారి బందీ నుండి పోలీసులు పట్టుకున్న తర్వాత గాని భార్య, కుమారుడు కూడా కిడ్నప్ కు గురైనట్లు తెలియలేదు. అచ్చం సస్పెన్స్‌, థ్రిల్లర్‌ సినిమాలాగా 48 గంటలపాటు ఇదంతా నాటకీయంగా జరిగింది.

ఒకరు అధికార పార్టీ ఎంపీ కుమారుడు, మరొకరు ఎంపీ సతీమణి, ఇంకొకరు ఎంపీతో కలిసి ముఖ్యమంత్రి వద్దకు నేరుగా వెళ్లగల ప్రముఖ ఆడిటర్‌! అంతటి ప్రముఖులను  విశాఖ ఎంపీ కుమారుడి నివాసంలోనే బందీలుగా పట్టుకున్నారంటే విశాఖపట్టణంలో మాఫియా రాజ్యం నెలకొందని స్పష్టం అవుతుంది.

తన భార్య, కుమారుడు వారి చెర నుండి బయటపడ్డారని ఎంపీ చెప్పేవరకు ఈ విషయం మొత్తం బయటకు తెలియకపోవడం, గురువారం సాయంత్రం వరకు ఈ మొత్తం ఉదంతాన్ని పోలీసులు వెల్లడించక పోవడం గమనిస్తే తెర వెనుక బలమైన కారణాలు యేవో ఉండి ఉంటే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం.

ఇప్పుడు పోలీసులు, ఆ ఎంపీ చెబుతున్నట్లు కేవలం డబ్బు కోసమే ఈ కిడ్నప్ డ్రామా ఆడివుంటే ఆడిటర్ ను ఎందుకు తీసుకొచ్చారనే ప్రశ్న తలెత్తుతుంది. ఎంపీ వస్తే, ఆయనతో తెల్లకాగితాలపై సంతకాలు చేయించుకోవాలి అనుకున్నారని అంటున్నారు. ఎంపీతో పాటు గన్ మెన్ లు ఉంటారు గదా? అంతటి సాహసం చేస్తారా?

ఆడిటర్ తన డ్రైవర్ ద్వారా కొంత నగదు తెప్పించి ఇచ్చారు అంటున్నారు. ఆ సమయంలో డ్రైవర్ కు ఎటువంటి సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేయలేదా? డ్రైవర్ కు కూడా అనుమానం రాలేదా? రెండు రోజుల పాటు తమ ఇంట్లోనే బందీలుగా ఉంటూ ఎంపీ కుటుంభ సభ్యులు వారికి `రాచ మర్యాదలు’ చేశారా? ఈ సమయంలో పనివారు, మరెవ్వరూ ఆ ఇంటికి రాలేదా? అనేక అనుమానాలకు ఆస్కారం కలుగుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles