ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వరుసగా ప్రశంసలు కురిపిస్తుంటే తెలంగాణ బీజేపీలో తానే మోనార్క్ అన్నట్లుగా వ్యవహరిస్తూ, తనను రాష్ట్ర అధ్యక్షునిగా చేయడానికి కారకులైన వారినే శంకరగిరి మాన్యాలు పట్టిస్తూ వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు పార్టీలో తాజా పరిణామాలు కలవరం కలిగిస్తున్నాయి.
తన నాయకత్వంలో పార్టీ ఎన్నికలకు వెళ్లడం ఆత్మహత్య సాదృశ్యం అన్నట్లుగా పార్టీ అధిష్టానమే భావిస్తున్నట్లు సంకేతాలు వెలువడటం, తనని కట్టడి చేసేందుకు భారీ కసరత్తు జరుగుతున్నట్లు లీక్ లు వస్తుండడంతో తట్టుకోలేక పోతున్నారు. ఇప్పటివరకు పార్టీలో కొద్దో, గొప్పో క్షేత్రస్థాయిలో ప్రాబల్యం గల నేతలు అందరిని పక్కకు నెత్తుతూ వచ్చారు. కేవలం భజన పరులను వెంటవేసుకొంటూ, రోజూ మీడియాలో కనిపించడమే పార్టీ కార్యక్రమంగా భావిస్తూ వస్తున్నాడు.
కనీసం నియోజకవర్గాలలో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం గురించి కూడా పట్టించుకోవడం లేదు. బలమైన నాయకులు ఎవ్వరూ పార్టీలో ఉండకూడదనే విధంగా వ్యవహరిస్తున్నారు.ఇతర పార్టీల నుండి వచ్చిన సీనియర్ నాయకుల పట్ల అవమానకరంగా వ్యవహరిస్తూ, వారిలో రాజకీయంగా ఏమాత్రం ప్రాబల్యం లేని నేతలను మాత్రమే వెంట తిప్పుకొంటూ కాలం గడుపుతూ వస్తున్నారు.
పార్టీ పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రాష్త్ర బీజేపీలో వాస్తవ పరిస్థితులను పసిగట్టి కేంద్రానికి నివేదిక ఇవ్వడంతో వాస్తవాలు ఢిల్లీ పెద్దలకు అర్థంకావడం ప్రారంభమైనది. దానితో మాటలు తడబడుతున్నాయి. ఏమి మాట్లాడుతున్నామో తెలియన్నట్లు మాటలు జారుతున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ నియోజకవర్గ బీజేపీ సీనియర్ కార్యకర్తల సమావేశంలో మాజీ కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌తో పాటు బండి సంజయ్ పాల్గొంటూ అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ రెండు పార్టీల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఢిల్లీలో లేదు.. ఇక్కడ గల్లీలో లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతవటం ఖాయమన్నారు.
అంతవరకు బాగానే ఉంది. అదే ఫ్లోలో పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా కరువైన పార్టీ భారతీయ జనతా పార్టీ.. అంటూ ఉన్నట్టుండి నోరు జారారు. వెంటనే తప్పు తెలుసుకుని.. నాలుక కరుచుకున్నారు. మిస్టేక్‌లో మాట జారిపోయిందని.. తర్వాత వివరణ కూడా ఇచ్చారనుకోండి.
ఏదేమైనా వాస్తవాన్ని మాట్లాడాడులే అంటూ సహచర బిజెపి నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. మొన్న కూడా అంతే.. ఓ మీటింగ్‌లో ఏకంగా బీజేపీని తెలంగాణకు విలన్ అంటూ సంబోధించారు బండి సంజయ్. హీరో అనబోయి విలన్ అన్నారని జనాలే సర్ధిచెప్పుకున్నారు.