వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వెంటాడుతున్న టిడిపి నేతలలో మాజీ మంత్రి డా. పి నారాయణ ఒకరు. మొదట్లో అమరావతి భూముల సేకరణలో పెద్ద కుంభకోణం జరిగిందని, అందుకు ఆయనే సూత్రధారి అని ఆరోపించి, కేసు నమోదు చేశారు. అయితే హైకోర్టు ఆ కేసును కొట్టేసింది.
ఆ తర్వాత ఆయన స్థాపించిన నారాయణ విద్యాసంస్థలలో 10వ తరగతి ప్రశ్నా పత్రాలు లీక్ అయ్యాయని అంటూ ఆయనను అరెస్ట్ కూడా చేశారు. కానీ 2014 నుండి ఆ విద్యాసంస్థలతో తనకు ఎటువంటి సంబంధం లేదని ఆధారాలు చూపెట్టారు. పైగా అసలు ప్రశ్నాపత్రాలు లీక్ అయిన ప్రభుత్వ విద్యాసంస్థలు, అందుకు బాధ్యులైన ప్రభుత్వ అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా నారాయణ, ఆయన కుటుంభం సభ్యులను వెంటాడుతున్నారు.
ఈ విషయమై విచారణ కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో ఆ దిశలో ఏపీ పోలీసులు సాగుతున్నారు. తాజాగా నారాయణ, ఆయన కుమార్తెల ఇళ్లల్లో ఏపీ సిఐడి అధికారులు సోదాలు జరిపి, విచారణకు అంటూ ఈ నెల 6, 7 తేదీలలో హాజరు కమ్మనమని నోటీసులు పంపారు.
అయితే గతంలోనే ఇచ్చిన ఆదేశాల ప్రకారం నారాయణను ఆయన ఇంట్లోనే విచారణ జరిపించాలని హైకోర్టు స్పష్టం చేసింది. అదేవిధంగా ఆయన భార్య, కుమార్తెలను సహితం మహిళలను ఇంటి వద్దనే విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించాలని తెలిపింది.
అమరావతి రాజధాని నగరానికి అసలు నిర్మాణమే జరుగని తూర్పు వైపు మరో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో మార్పులు చేసి, నారాయణకు సంబంధించిన వారు భూముల కార్య, విక్రయాలలో భారీగా లాభం పొందారని సిఐడి ఆరోపిస్తున్నాయి. అందుకు నిర్దుష్టమైన సాక్ష్యాధారాలను సహితం సేకరించమని చెబుతున్నారు.
ఏదోవిధంగా నారాయణను అరెస్ట్ చేసి, వచ్చే ఎన్నికల సమయంకు బైట లేకుండా చేయాలన్నదే జగన్ ప్రభుత్వ పన్నాగంగా స్పష్టం అవుతుంది. ఎందుకంటె, 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత రాజకీయంగా నారాయణ క్రియాశీలకంగా లేకపోయినప్పటికీ, రోజువారీ టిడిపి కార్యక్రమాలలో ఎక్కడా కనిపించక పోయినప్పటికీ తెరవెనుక పార్టీ వ్యూహాలతో కీలక పాత్ర వహిస్తున్నారు.
2014 ఎన్నికల ముందు కూడా నారాయణ ఎప్పుడూ క్రియాశీల రాజకీయాలలో కనిపించలేదు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఎన్నికల వ్యూహాలకు సంబంధించి అవసరమైన క్షేత్రస్థాయి పరిస్థితుల గురించిన సమాచారాన్ని అందించడంలో, వ్యూహాలు రూపొందించడంలో కీలక పాత్ర వహించేవారు. నియోజకవర్గాల వారీగా వివిధ పార్టీల బలాబలాలు, అభ్యర్థుల బలాబలాలను మదింపు చేసి, సమగ్ర నివేదికలను చంద్రబాబుకు అందించేవారు.
ఇప్పుడు కూడా సుమారు మూడోవంతు నియోజకవర్గాలకు సంబంధించిన తెరవెనుక హోమ్ వర్క్ ఆయనే చేస్తున్నట్లు తెలుస్తున్నది. అందుకనే ఆయనను అరెస్టు చేసి, జైలుకు పంపితే చంద్రబాబుకు ఒక భుజం లేకుండా చేసినట్లు కాగలదని సీఎం జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.