మాజీ మంత్రి గంటాను టిడిపి మోయవలసిందేనా!

Sunday, December 22, 2024

ఒకొక్క ఎన్నికలో ఒకొక్క సీట్ లో పోటీ చేస్తూ, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియకుండా రాజకీయాలు నడుపుతూ, ఇప్పటి వరకు ఓటమి ఎరుగకుండా నెట్టుకు వస్తున్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తిరిగి టిడిపిలో క్రియాశీలం అవుతున్నట్లు స్వర్గీయ ఎన్టీ రామారావు వర్ధంతి రోజున ఆయనకు నివాళులు అర్పిస్తూ ప్రకటించారు. నారా లోకేష్ పాదయాత్రలో చేరబోతున్నట్లు వెల్లడించారు. 

2019 ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఒక విధంగా అధికార వైసిపిలో చేరేందుకు రంగం కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే అక్కడ సానుకూల సంకేతాలు లభించకపోవడంతో మౌనంగా ఉంటూ వస్తున్నారు.

పార్టీ సమావేశాలకు గైర్హాజరు కావడమే కాకుండా, చివరకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశాఖపట్నం వచ్చినప్పుడు సహితం ఎప్పుడు కలిసి, పలకరించిన దాఖలాలు లేవు. టీడీపీ శ్రేణులు సహితం ఆయన వైసిపిలో చేరుతున్నట్లే నిర్ధారణకు వచ్చి, పట్టించుకోవడం మానివేశారు.

అయితే కరోనా కారణంగా, ఆ తర్వాత వ్యక్తిగత సమస్యల కారణంగా పార్టీకి దూరంగా ఉన్నానే గాని, పార్టీని వదలలేదని అంటూ ఇప్పుడు వివరణ ఇస్తున్నారు. తిరిగి ఇక నుండి క్రియాశీలకంగా ఉంటానని అంటూ వచ్చే ఎన్నికలలో పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనే నిర్ణయాన్ని పరోక్షంగా ప్రకటించారు.

తన సామాజిక వర్గ కార్యక్రమాలకు, ఇతరత్రా కార్యక్రమాలకు మాత్రం హాజరవుతూనే ఉన్నారు. కానీ టిడిపి కార్యక్రమాలకు హాజరు కావడానికి మాత్రమే కరోనా అడ్డు వచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వం పార్టీ నాయకులపై అన్యాయంగా కేసులు నమోదు చేస్తూ, అరెస్టులు చేస్తున్నా, చిత్రహింసలకు గురిచేస్తున్న ఎన్నడూ నోరెత్తి ప్రశ్నించిన పాపాన పోలేదు.

ఇటువంటి అవకాశవాద రాజకీయవేత్తలు టిడిపి ఇంకెతకాలం మోయాలి? అని టిడిపి శ్రేణులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇటు తెలుగు ప్రభుత్వంలో కూడా కీలకమైన మంత్రిత్వ్ర శాఖలు నిర్వహించిన ఘనుడు గంటా. అయితే, వైఎస్ జగన్ మంత్రివర్గంలో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

గంటా రాజకీయాలు మొదటినుండి గాలివాటుగానే ఉంటున్నాయి. 1999లో ఒంగోలు నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసేందుకు ప్రయత్నంచేస్తుంటే సాధ్యం కాలేదు. ఈలోగా అనకాపల్లి నుండి అయ్యన్నపాత్రుడును లోక్ సభకు పోటీచేయమని చంద్రబాబు ఒత్తిడి చేస్తుంటే, తప్పించుకొనే అసెంబ్లీకి వెళ్లడం కోసం చివరి నిముషంలో గంటాను తీసుకొచ్చి, నిలబెట్టి ఎంపీగా చేశారు.

2004లో టిడిపి ఓటమితో కాంగ్రెస్ లో చేరారు. 2009లో ప్రజారాజ్యంలో చేరి తిరిగి ఎమ్యెల్యే అయి, ఆ పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో మంత్రి అయ్యారు. అయితే 2014లో ఏపీలో కాంగ్రెస్ ఉనికి ప్రశ్నర్థకం కావడంతో టిడిపిలో తిరిగి చేరి మంత్రి అయ్యారు. 2019లో టిడిపి ఓటమి చెందడంతో `రాజకీయ సన్యాసం’ చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles