మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ కోసం  కాంగ్రెస్, బిజెపి కుస్తీ!

Wednesday, January 22, 2025

బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకునేందుకు ఒక వంక బిజెపి నేతలు, మరోవంక కాంగ్రెస్ అగ్రనాయకులు భారీ కసరత్తు చేస్తున్నారు. పదవిలో లేకపోయినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలమైన అనుచరవర్గాన్ని ఏర్పాటు చేసుకోగలగడంతో ఆయన ప్రభావం మొత్తం 10 నియోజకవర్గాలలో కూడా ఉంటుందని భావిస్తుండటమే అందుకు కారణం.

అటు బీజేపీలో రాష్త్ర నాయకులతో పాటు నేరుగా కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఫోన్ లో సంప్రదించి, పార్టీలో చేరమని ఆహ్వానించారని ఇదివరకే కధనాలు వచ్చాయి. పైగా, ఈ నెల 23న హైదరాబాద్ కు వస్తున్న అమిత్ షా చేవెళ్లలో ప్రసంగించే బహిరంగసభలో ఆయనను పార్టీలో చేరేటట్లు చేయడం కోసం బిజెపి నాయకులు ముమ్ముర ప్రయత్నాలు చేస్తున్నారు.

మరోవంక కాంగ్రెస్ లో నేరుగా అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణాలో కాంగ్రెస్ పునర్జీవంకోసం నేరుగా ప్రయత్నాలు చేస్తున్న రాహుల్ గాంధీ బృందం నేరుగా పొంగులేటిని కలిసి ఈ విషయమై సుదీర్ఘంగా సంప్రదింపులు జరిగినట్లు చెబుతున్నారు.

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ, అధినేత కేసీఆర్‌ పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ, ఆత్మీయ సమ్మేళనాల పేరుతో తన బలగాన్ని విస్తరించుకునే ప్రయత్నం చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాలలో బిఆర్ఎస్ అభ్యర్థులు ఎవ్వరు గెలవకుండా చేయడమే తన లక్ష్యంగా బహిరంగంగా ప్రకటిస్తున్నారు.

వైఎస్ కుటుంబంతో గల సాన్నిహిత్యంను ఆసరా చేసుకొని వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సహితం ఆయనను తన పార్టీలో చేర్చుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకోసం రాహుల్ ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక బృందం సభ్యులు ఆదివారం రాత్రి పొంగులేటితో సుమారు 6 గంటలపాటు చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే పొంగులేటి ఇప్పటికిప్పుడు దీనిపై ఏ నిర్ణయం తీసుకోడానికి సుముఖంగా లేరని తెలియవచ్చింది.

వాళ్లు పొంగులేటితో చర్చలు జరిపిన క్రమంలో ఒక్క మధిర మినహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీట్లు అన్ని తన అనుచరులకు ఇవ్వాలని ఆయన షరతు విధించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాదు హైదరాబాద్ నగరంలోని కంటోన్మెంట్ సీటును కూడా తన అనుచరుడికి ఇవ్వాలని ఆయన రాహుల్ గాంధీ టీమ్ ముందు ప్రతిపాదన ఉంచారు.

కాంగ్రెస్ లో ఇప్పుడే సీనియర్ నాయకులు అనేకమంది ఉన్నారు. ఆ పార్టీకి బలమున్న కొద్దీ జిల్లాల్లో ఒకటైన ఖమ్మంలో కీలక స్థానాలను అన్ని పొంగులేటి ఇచ్చేందుకు ఆ పార్టీ నాయకత్వం సిద్ధంగా లేదు. అయితే ఆ మాట వెంటనే తేల్చకుండా, కర్ణాటక ఎన్నికల వరకు సాగదీయాలని చూస్తున్నారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఉన్నాయని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది. అదే జరిగితే ఆ ప్రభావం దాని ప్రభావం తెలంగాణ ఎన్నికలపై ఉంటుందని, బిఆర్ఎస్, బిజెపి లలోని పలువురు అసంతృత్తిగా ఉన్నవారు కాంగ్రెస్ లో చేరతారని అంచనా వేస్తున్నారు. అప్పటి వరకు బలమైన నేతలు బిజెపి వైపు వెళ్లకుండా కాలయాపన చేస్తుండే ఎత్తుగడ అనుసరిస్తున్నారు.

మూడొంతుల నియోజకవర్గాలలో పోటీ చేసేందుకు బలమైన అభ్యర్థులు లేని బిజెపి పొంగులేటి కోరిన 10 సీట్లు ఇచ్చేందుకు సిద్ధమైనా, ఆయన మద్దతుదారులు క్షేత్ర స్థాయిలో ఏమాత్రం మద్దతు లేని పార్టీలో చేరితే గెలుపొందడం కష్టమని బీజేపీలో చేరేందుకు విముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని వత్తిడుల కారణంగా ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమైనా ఆయన అనుచరులు పలువురు ఆయనతో రాకపోవచ్చని, కాంగ్రెస్ లోకి వెళ్లవచ్చని భావిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles