వలంటీర్ల వ్యవస్థపై `అనుచిత వాఖ్యలు’ చేసారంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కోర్టులో పరువునష్టం కేసు నమోదు చేయాలని జిఓ జారీచేసిన ఏపీ ప్రభుత్వం, సోమావారం విజయవాడ సివిల్ కోర్టులో ఓ మహిళా వాలంటీర్ పవన్ కల్యాణ్‌పై పరువునష్టం పిటిషన్ దాఖలైంది. వాలంటీర్ ఇచ్చిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారణకు స్వీకరించారు.
తమపై పవన్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మానసిక వేదనకు గురై న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయిస్తున్నట్లు ఆ మహిళా వాలంటీర్ అందులో పేర్కొన్నారు. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద పిటిషన్ దాఖలు చేశారు వాలంటీర్ తరపు న్యాయవాదులు. బాధితురాలు పవన్ వ్యాఖ్యల పట్ల మనోవేదనకు గురయ్యారని తెలిపారు.
కాగా, కోర్టును ఆశ్రయించిన తర్వాత కచ్చితంగా విచారణ జరుగుతుందని, బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత పవన్ కల్యాణ్‌కు కోర్టు నోటీసులు ఇస్తుందని, ఈ కేసులో పవన్ కల్యాణ్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని బాధితురాలి తరపున న్యాయవాదులు తెలిపారు. పవన్ వ్యాఖ్యలు కుట్ర పూరితంగా ఉన్నాయని ఆరోపించారు.
ఉమెన్ ట్రాఫికింగ్ కు సంబంధించి కేంద్ర నిఘా వర్గాలు పవన్ కు చెప్పి ఉంటే ఆ ఆధారాలను కోర్టుకు వెల్లడించాలని అందులో కోరారు. ప్రభుత్వానికి సహాయకులుగా ఉన్న వాలంటీర్లపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికాదంటూ పవన్ వ్యాఖ్యల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ సందర్భంగా పవన్ వెనుక ఎవరున్నారో స్పష్టం చేయాలని ఆ పిటీషన్ లో కోరారు.
వదంతులతో ప్రజలను రెచ్చగొట్టి వాలంటీర్లపై తిరగబడేలా వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్‌పై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తిని కోరినట్టు బాధితురాలి న్యాయవాదులు వెల్లడించారు.
ప్రతి గ్రామంలో ఎవరెవరు ఏ పని చేస్తున్నారు? కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? ఆడపిల్లలు ఎవరినైనా ప్రేమిస్తున్నారా? లేదా, వితంతువులున్నారా? అనే వివరాలను వాలంటీర్లు సేకరించి సంఘ విద్రోహ శక్తులకు చేరవేయడమే కాకుండా వాళ్లను ట్రాప్ చేసి హ్యూమన్ ట్రాఫికింగ్‌కు పాల్పడుతున్నారంటూ పవన్ ఆప్పించడం తెలిసిందే.
ఇలా ఉండగా, ఈ వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా రద్దు చేయడం కంటే కొన్ని ప్రతిపాదనలతో పునర్నిర్మించుకుంటే మంచిదని కాపు సంక్షేమ సేన వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి హరిరామ జోగయ్య సూచించారు. పవన్ కళ్యాణ్ కు వ్రాసిన లేఖలో వాలంటీర్ వ్యవస్థలో ఉన్న లక్షలాది మంది మహిళలకు వాలంటీర్ ఉద్యోగాలు కల్పించాలని, వాలంటీర్లకు కనీసం 10వ తరగతి విద్యార్హత ఉండాలని, వారికి కనీస వేతనం రూ.10 వేలు ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. అలాగే, జనాభా నిష్పత్తిలో కులాలకు ప్రాధాన్యత కల్పించాలని స్పష్టం చేశారు.
ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో సంవత్సరానికి రూ. 8 లక్షల ఆదాయం మించని కుటుంబాలకే ఉద్యోగం అందాలని, జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన నియామక కమిటీలను ఏర్పాటు చేసి, అర్హులైన వారికే ఉద్యోగ లబ్ధి కలిగించాలని సూచించారు. ఇక, రా జకీయ పార్టీలకు చెందిన వారిని వాలంటీర్లుగా నియమించకూడదని డిమాండ్ చేశారు. అలాగే 21 ఏళ్ల నుంచి 30 సంవత్సరాల లోపు వయసున్న వారే ఉద్యోగానికి అర్హులుగా నిర్ణయించాలని చెప్పారు.