మహిళా రేజర్వేషన్లపై బీజేపిని ఆత్మరక్షణలో పడేసిన కవిత

Friday, December 27, 2024

మ‌హిళా రిజర్వేష‌న్ బిల్లు కోసం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత ఢిల్లీ వేదికగా  చేప‌ట్టిన నిరాహార దీక్ష  ఈ విషయమై బిజెపిని ఆత్మరక్షణలో పడవేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇదే సమయంలో ఈడీ కవితకు నోటీసులు ఇవ్వడం, ఆమెను అరెస్ట్ చేయబోతున్నారని కధనాలు రావడం నడుమ ఆమె ఈ విషయమై జాతీయస్థాయిలో గొంతు విప్పడంతో బిజేపికి నోటమాటరాని పరిస్థితి ఏర్పడింది.

2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోలలో ఈ విషయమై హామీలు గుప్పించిన బిజెపి తొమ్మిదేళ్లుగా అధికారంలో ఉంటూ ఆ దిశలో ఎటువంటి ప్రయత్నం చేయకపోవడం, కనీసం ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు సంప్రదింపులు కూడా జరపగా పోవడంతో మహిళా రేజర్వేషన్లకు బిజెపి వ్యతిరేకమని సందేశం ఇచ్చే ప్రయత్నం కవిత చేశారు.

అందుకనే సున్నితమైన ఈ అంశం గురించి బిజెపి జాతీయ నేతలు ఎవ్వరూ మాట్లాడే ధైర్యం చేయలేక పోయారు. కనీసం కేంద్రంలోని ఎనిమిది మంది మహిళా మంత్రులు కూడా నోరువిప్పలేదు. తెలంగాణ బిజెపి నేతలు విమర్శలు గుప్పిస్తున్న విధంగా ఢిల్లీ మద్యం కుంభకోణం నుండి ప్రజల దృష్టి మళ్లించడంకోసం కవిత దీక్ష చేస్తున్నారని విమర్శించే ప్రయత్నం కూడా చేయలేదు. ఏమి మాట్లాడినా దేశంలో మహిళలతో బిజెపి పట్ల వ్యతిరేకత ఏర్పడుతుందని భయపడినట్లు స్పష్టం అవుతుంది.

క‌విత దీక్ష‌లో ఆప్ నేత‌లు సంజ‌య్ సింగ్, చిత్ర స‌ర్వార‌, న‌రేష్ గుజ్రాల్ (అకాలీద‌ళ్‌) శివ‌సేన ప్ర‌తినిధులు, అంజుమ్ జావేద్ మిర్జా (పీడీపీ), ష‌మీ ఫిర్దౌజ్ (నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్స్‌), సుస్మితా దేవ్ (టీఎంసీ), కేసీ త్యాగి (జేడీయూ), సీమా మాలిక్ (ఎన్‌సీపీ), కే.నారాయ‌ణ (సీపీఐ), సీతారాం ఏచూరి (సీపీఎం), పూజ శుక్లా (ఎస్‌పీ), శ్యామ్ రాజ‌క్ (ఆర్ఎల్‌డీ), క‌పిల్ సిబ‌ల్‌, ప్ర‌శాంత్ భూష‌ణ్ స‌హా ప‌లు విప‌క్ష పార్టీల నేత‌లు, ప్ర‌తినిధులు పాల్గొని సంఘీభావం తెలపడం గమనార్హం.

ఒక విధంగా బిఆర్ఎస్ ఏర్పాటైన తర్వాత ఆ పార్టీ కార్యక్రమంలో ఇన్ని రాజకీయ పార్టీలు పాల్గొనడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ తొలుత ఢిల్లీలోనే పోటీ దీక్ష జరుపుతున్నట్లు ప్రకటించి, ఆ తర్వాత ఆ ఆవిధంగా జరపడం దేశంలో మహిళలకు ప్రతికూల సంకేతాలు ఇచ్చిన్నట్లు కాగలదని, పార్టీకి తీరని నష్టం కలిగించగలదని జాతీయ నాయకత్వం భావించడంతో తోకముడిచ్చిన్నట్లు కనిపిస్తున్నది.

చివరకు మొక్కుబడిగా హైదరాబాద్ లోని పార్టీ కార్యాలయంలో దీక్ష జరిపిన బీజేపీ నాయకులు ఎంతసేపటికి కేసీఆర్ మంత్రివర్గంలో మొదటి ఐదేళ్లు మహిళలు లేరని చెప్పడం, కవితను అరెస్ట్ చేయబోతుండడంతో ప్రజల దృష్టి మళ్లించడం కోసమే ఈ దీక్ష అంటూ విమర్శించడం మినహా మహిళా రిజర్వేషన్ పట్ల బిజెపి విధానం ఏమిటో ఒక నేత కూడా చెప్పే సాహసం చేయకపోవడం గమనార్హం.

మహిళా రిజర్వేషన్‌ బిల్లు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నదని, 1996లో నాటి ప్రధాని దేవేగౌడ హయాంలో బిల్లు పెట్టినా ఇంకా చట్టం కాలేదని కవిత గుర్తు చేశారు. ప్రస్తుతం పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ ఉండడంతో బిల్లు పెడితే అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయని ఆమె సూచించారు. మహిళా బిల్లు ఓ చారిత్రక అవసరమని, సాధించి తీరాలని కవిత స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్‌ సాధించే వరకూ విశ్రమించేది లేదని పేర్కొంటూ దేశంలోని మహిళలందరిని కలుపుకొని పోరాడుతామని ప్రకటించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles