మహారాష్ట్ర నుండి తెలంగాణ బిజెపికి కేసీఆర్ సవాల్!

Tuesday, January 7, 2025

బిఆర్ఎస్ పేరుతో ఇతర రాష్ట్రాలలో పార్టీ వ్యాప్తికోసం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్ దృష్టి మాత్రం తెలంగాణాలో ఈ సంవత్సరం ఆఖరుకు జరిగే ఎన్నికల మీదని ఉంటున్నది. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా లోహాలో బిఆర్ఎస్ ఆదివారం జరిపిన బహిరంగ సభలో మాట్లాడుతూ అక్కడి ఉపముఖ్యమంత్రి, బిజెపి నేత దేవేంద్ర ఫడ్నవిస్ కు సవాల్ విసరడం గమనిస్తే నిత్యం తన పాలనపై విమర్శలు కురిపిస్తున్న తెలంగాణ బీజేపీ నేతలను ప్రశ్నించిన్నట్లు స్పష్టం అవుతుంది .

కేంద్రం నిధులు ఇస్తున్న పధకాలను అమలు పరచడం తప్ప కేసీఆర్ ప్రభుత్వం సొంతంగా ఎటువంటి పధకాలు అమలు పరచడంలేదంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ల నుండి బిజెపి కేంద్ర నాయకులు సహితం విమర్శలు గుప్పిస్తున్నారు.

“తెలంగాణ మోడల్ లాగా రైతుకు ప్రతి ఎకరాకు 10 వేలు ఇవ్వాలి, రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి, రైతుభీమా ద్వారా తెలంగాణ రైతులకు రూ.5 లక్షలు ఇస్తున్నాం. తెలంగాణలో దళితుల కోసం దళిత బంధు పథకం తెచ్చాం”  అని చెబుతూ దేశంలోనే అద్భుతమైన ఈ ఐదు పధకాలను మహారాష్ట్రలో కూడా అమలు చేస్తామని ఫడ్నవిస్ హామీ ఇస్తే ఇక తాను మహారాష్ట్రలో తన పార్టీ ప్రచారం కోసం రాబోమని కేసీఆర్ స్పష్టం చేశారు.

ఈ మాటలు చెప్పడం ద్వారా తన ప్రభుత్వంతో పోల్చుకొంటే కేంద్రంలో మోదీ ప్రభుత్వం గాని, పలు రాష్ట్రాలలో బిజెపి ప్రభుత్వాలు గాని రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూర్చడం లేదంటూ కేసీఆర్ చెప్పకనే చెప్పారు. తెలంగాణాలో వచ్చే ఎన్నికలలో వారు కోరుకొంటున్నల్టు బిజెపిని ఎన్నుకొంటే ఇక్కడి రైతులు సహితం భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందనే హెచ్చరికలను కూడా ఈ సందర్భంగా పరోక్షంగా పంపారు.

కేసీఆర్‌కు మ‌హారాష్ట్ర‌లో ఏం ప‌ని అని దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ప్రశ్నించడాన్ని ప్రస్తావిస్తూ `మ‌హారాష్ట్ర‌లో రైతుల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించండి.. మ‌రోసారి నేను రాను’ అంటూ సున్నితంగా చురకలు అంటించారు. పైగా, దేశంలో త్వరలో రైతుల తుపాన్ రాబోతోందని, దాన్నెవరూ ఆపలేరని అంటూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్నే హెచ్చరించారు.  కేంద్రంలో రైతు రాజ్యం తీసుకురావడమే బిఆర్ఎస్ లక్ష్యంగా కేసీఆర్ చెబుతూ ఉండటం గమనార్హం.

మహారాష్ట్రలో  రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటిస్తూ ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగుర వేయాలని కేసీఆర్ పిలుపిచ్చారు.  గతంలో మహారాష్ట్ర కంటే తెలంగాణ దారుణంగా ఉండేదని, అయితే, తొమ్మిదేళ్లలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. రైతులు ఐక్యంగా ఉండి పిడికిలి బిగిస్తే న్యాయం జరుగుతుందని పేర్కొంటూ ఒక్క ఝలక్‌ ఇవ్వండి.. మొత్తం మారిపోతుందని అంటూ మహారాష్ట్ర రైతులకు పిలుపిచ్చారు. 

మహారాష్ట్రలో బిఆర్ఎస్ ఎంతగా బలం పుంజుకొంటే అధికారంలో ఉన్న బిజెపికి అంతగా బలం చేకూర్చే అవకాశం ఉంది. ఎందుకంటె ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను ఎంతగా చీలిస్తే అధికార పక్షంకు అంతగా ప్రయోజనం చేకూరుస్తుంది. అందుకనే మహారాష్ట్రలో బిఆర్ఎస్ ను విస్తరింపచేయడం కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం అంతా తెలంగాణాలో బిజెపి తలెత్తుకోలేకుండా చేసి తిరిగి మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు మార్గం ఏర్పాటు చేసుకోవడంగానే వెల్లడి అవుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles