మహారాష్ట్రలో ట్రిపుల్‌ ఇంజిన్‌ సర్కార్‌తో బీజేపీలో ముసలం

Sunday, December 22, 2024

కర్ణాటకలో ఓటమి, పాట్నాలో ప్రతిపక్షాల భేటీతో 2024లో మెజారిటీ రాకపోవచ్చని ఆందోళనతో హడావుడిగా మహారాష్ట్రలోని ప్రధాన ప్రతిపక్షం ఎన్సీపీలో చీలిక తీసుకు వచ్చి, రెండు రోజుల క్రితమే ప్రధాని మోదీ `అవినీతి పరులు’గా పేర్కొన్నవారిని మంత్రివర్గంలో తీసుకోవడంతో ఏదో విజయం సాధించామని సంబరపడిన బీజేపీలో ఇప్పుడు ముసలం తప్పే సూచనలు కనిపిస్తున్నాయి.

అంతకు ముందు రెండు పార్టీలు కలిసి ఏర్పాటు చేసిన ప్రభుత్వం `డబల్ ఇంజిన్ సర్కార్’ అయితే ఇప్పుడు మరో పార్టీ చేరడంతో `ట్రిపుల్ ఇంజిన్ సర్కార్’ అంటూ చెప్పుకున్న బిజెపికి సొంత పార్టీలోనే తిరుగుబాటు తప్పదనే భయం పట్టుకుంది. తొమ్మిది మంది ఎన్సీపీ నేతలను మంత్రివర్గంలో చేర్చుకొని వారం రోజులు కావస్తున్నా ఇప్పటికీ వారికి మంత్రిత్వ శాఖలను కేటాయించలేదు.

వారు డిమాండ్ చేసిన్నట్లు వారికి కీలక మంత్రిత్వ శాఖలు ఇస్తే ముఖ్యమంత్రి ఎకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో పాటు బీజేపీలో కూడా ఎమ్యెల్యేలలో తిరుగుబాటు తధ్యం అనే భయం పట్టుకుంది. అందుకొని షిండేతో కలిసి ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రెండు రోజుల క్రితం అర్ధరాత్రి మంతనాలు జరిపినా ఒక దారి కనుక్కోలేకపోయారు.

‘‘మంత్రివర్గం నిండిపోయింది. ఆశావహులంతా విషాదంలో ఉన్నారు. పదవి వస్తుందన్న ఆలోచనతో ఇప్పటికే కుట్టించుకున్న దుస్తులను ఏం చేయాలో వారికి తెలియడం లేదు’’ అంటూ బిజెపి, షిండే వర్గంలో నెలకొన్న ఆందోళనపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ సభలో మాట్లాడుతూ ఎద్దేవా చేశారు.
మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఎన్సీపీ నేతలు చెప్పిన్నల్టు నడుచుకొంటున్నారని, వారంతా శివసేనను అణచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ గత ఏడాది ఎకనాథ్ షిండే బృందం పార్టీలో తిరుగుబాటు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చింది. అప్పుడు తిరుగుబాటు చేసిన పలువురికి ఇచ్చిన హామీ మేరకు ఇంకా మంత్రిపదవులు పంపకం పూర్తి కాలేదు.

ఈ లోగా ఎన్సీపీ నుండి ఎనిమిది మంది మంత్రి పదవులు చేపట్టడంతో షిండే వర్గం, బిజెపి ఎమ్యెల్యేలకు లభించే మంత్రి పదవుల సంఖ్య తగ్గిపోయింది. మహారాష్ట్ర మంత్రివర్గంలో ప్రస్తుతం 29 మంది ఉన్నారు. మరో 14 మందిని చేర్చుకునే వీలుంది. కానీ, ఎన్సీపీ చేరిక  ఇటు బీజేపీ, అటు ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలోని శివసేన నాయకులను కలవరానికి గురిచేస్తున్నది.

అజిత్‌ వర్గం చేరికను ఇరుపార్టీల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అజిత్‌ వర్గానికి ముఖ్య శాఖలు కేటాయిస్తే తమ పరిస్థితి ఏంటని వారు కలవరపాటుకు గురవుతున్నారు. శివసేనను చీల్చి ప్రభుత్వంలో చేరిన తమ ఉద్దేశం నెరవేరదని వారు లోలోన భయపడుతున్నారు. ఇలాగైతే రానున్న ఎన్నికల్లో తమ వర్గానికి ఓట్లు పడవని, ఒక్క సీటు కూడా గెలవలేమని వారు షిండేకు స్పష్టం చేశారు.  దీంతో హుటాహుటిన ఆయన బీజేపీ నేత, ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్‌తో గురువారం అర్ధరాత్రి భేటీ అయ్యారు.

‘శివసేన పార్టీ చీలికకు సహకరించిన 39 మంది ఎమ్మెల్యేలు తప్పు చేశామని ఇప్పుడు బాధపడుతున్నారు. అజిత్‌ వర్గం రాకతో కొత్త సమస్యలు వస్తాయని వారు భయపడుతున్నారు. ఎన్సీపీ మంత్రి అతిథి తట్కరేను రాయగఢ జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా నియమిస్తే సహించబోమని షిండే వర్గంలోని ఎమ్మెల్యేలు భారత్‌ గోగావలే, మహేంద్ర తోర్వే హెచ్చరించడమే అసంతృప్తికి నిదర్శనం. గతంలోనూ మహావికాస్‌ అఘాడీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అజిత్‌ తమకు నిధుల విషయంలో అన్యాయం చేశారు’ అని  షిండే వర్గానికి మద్దతు తెలిపిన స్వతంత్ర ఎమ్మెల్యే బచ్చు ఖాడు బహిరంగంగానే విమర్శించారు.

మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలపై చాలామంది బీజేపీ నేతలు అసంతృప్తిగా ఉన్నారని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పంకజ ముండే తెలిపారు. ‘బీజేపీకి రాష్ట్రంలో 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో చాలా మంది ప్రస్తుత పరిణామాలపై అసంతృప్తితో ఉన్నారు. బయటికొచ్చి మాట్లాడేందుకు భయపడుతున్నారు. నా సిద్ధాంతాల విషయంలో రాజీ పడాల్సి వచ్చింది. అందుకే రెండు నెలల పాటు సెలవులు తీసుకొని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలనుకుంటున్నా’ అని ఆమె ప్రకటించారు. 

పంకజ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం ఫడ్నవీస్‌ స్పందిస్తూ పార్టీలో అసంతృప్తి ఉన్నట్లు అంగీకరించారు.. ‘జరుగుతున్న పరిణామాలపై పార్టీలో కొంతమంది అసంతృప్తిగా ఉన్నారనేది వాస్తవమే. పార్టీ కార్యకర్తలు, నేతలు చాలా కాలం నుంచి ఎన్సీపీపై పోరాడుతున్నారు. ఎన్సీపీతో పొత్తును పార్టీ నేతలు ఇప్పటికిప్పుడు అంగీకరించకపోవచ్చు’ అని ఆయన పేర్కొన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles