మరో ఏడాదిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో రాజమండ్రిలో శనివారం నుండి రెండు రోజుల పాటు జరగనున్న టీడీపీ మహానాడు ఆ పార్టీకి జీవన్మరణ సమస్యగా మారింది. నాలుగు దశాబ్దాల టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోరంగా 2019 ఎన్నికల్లో ఓటమి చెందింది. ఆ తర్వాత కరోనా కారణంగా గత ఏడాది ఒంగోలులో మినహా ప్రతి ఏటా జరిగే మహానాడులు జరగలేదు.
పైగా, ఈ సారి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా జరుగుతూ ఉండడంతో ఒక విధంగా 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేసేందుకు, రాష్ట్ర ప్రజలకు స్పష్టమైన సందేశం ఇచ్చేందుకు ఈ మహానాడు వేదిక కావాల్సి ఉంది. వచ్చే ఎన్నికలలో కూడా ఓటమి చెందితో టిడిపి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకంగా మారే ప్రమాదముందని చాలామంది అంచనా వేస్తున్నారు.
ఒక విధంగా టిడిపి ఇప్పుడు నాయకత్వ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. 2019 ఎన్నికలలో ఓటమి తర్వాత నిజాయతీతో లోతైన సమీక్ష ఎక్కడ జరిగినట్టు లేదు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చుట్టూ బృందాలుగా పార్టీ నేతలు చేరి, తమ ఉనికి కోసం ప్రయత్నించడమే గాని క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు చేస్తున్న కృషి కూడా కనిపించడం లేదు.
టిడిపి చేపట్టే ప్రజా ఉద్యమాల నుండి కన్నా ఉన్నత న్యాయస్థానాలు, టిడిపికి అనుకూలంగా ఉండే మీడియా నుండే వైఎస్ జగన్ ప్రభుత్వం ఎక్కువ సవాళ్ళను ఎదుర్కొంటు వస్తున్నది. 2019 ఎన్నికలలో టీడీపీ – వైసిపిల మధ్య 10 శాతం ఓట్ల తేడా ఉంది. అంత తేడాను పూర్తి చేసుకొనేందుకు పార్టీ పరంగా అనుసరిస్తున్న వ్యూహాలు పెద్దగా కనిపించడం లేదు.
ముఖ్యంగా టిడిపిని వేధిస్తున్న ప్రశ్న పార్టీని నమ్ముకొని, త్యాగాలకు సిద్దపడి దశాబ్దాలుగా పనిచేస్తున్న వారిని విస్మరించి పదవులను, ఎన్నికలలో సీట్లను డబ్బు సంచులు కురిపించిన వారికి ఇచ్చారనే అసంతృప్తి. ఇప్పుడు కూడా వైసిపి ప్రభుత్వపు వేధింపులకు తట్టుకొని క్షేత్రస్థాయిలో నిత్యం పోరాటాలు చేస్తూ, పార్టీని బతికిస్తున్న నేతలను కాకుండా సంపన్నులైన అభ్యర్థుల కోసం చూస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
మరోవంక జగన్ ను, ఆయన ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా నిందిస్తూ కాలం గడపడమే గాని ఏపీ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి నిర్దుష్టమైన ప్రతిపాదనలను ప్రజల ముందుంచే ప్రయత్నం చేయడం లేదు. వైసీపీ వైఫల్యాలే, ఆ ప్రభుత్వం పట్ల ప్రజలలో పేరుకుపోతున్న అసంతృప్తియే తమకు ఓట్లుగా మారతాయని నమ్మకంతో టిడిపి నాయకత్వం ఉన్నట్లు స్పష్టం అవుతుంది.
పలు నియోజకవర్గాల్లో నాయకుల మధ్య నెలకొన్న విబేధాలను పరిష్కరించే ప్రయత్నాలు జరగడం లేదు. పలు నియోజకవర్గాల్లో సంవత్సరాల తరబడి ఇన్ ఛార్జ్ లు లేకుండానే కాలం గడిపేస్తున్నారు. తరచూ చంద్రబాబు నాయుడు నియోజకవర్గాల వారి సమీక్షలు జరుపుతున్నప్పటికీ సత్వరం అవసరమైన నిర్ణయాలు తీసుకోవడం లేదనే విమర్శలు చెలరేగుతున్నాయి.
ఇదివరలో మాదిరిగా నామినేషన్లకు గడువు ముగిసే సమయం వరకు తాత్సారం చేయకుండానే ముందుగానే ఎన్నికల ప్రణాలికను ప్రకటిస్తామని, అభ్యర్థులను కూడా చాలా ముందుగానే ప్రకటిస్తామని చెబుతున్నప్పటికీ నాయకత్వ స్థాయిలో రావలసిన మార్పులు రావడం లేదు. ఇప్పటికే సగంకు పైగా లోక్ సభ నియోజకవర్గాలతో పాటు పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో బలమైన అభ్యర్థులు కనిపించకపోవడం ఆ పార్టీ నాయకత్వాన్ని వేధిస్తున్నది.
ముఖ్యంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొండంత అండగా ఉంటుండగా, ఆ పార్టీతో సయోధ్య కోసం వెంపర్లాడే పరిస్థితి టీడీపీని పార్టీ శ్రేణులలోనే చులకన కావిస్తున్నది. పలు అంశాలపై స్పష్టమైన విధానాలను వ్యక్తపరచలేక పోతున్నారు.