రాష్ట్ర హైకోర్టులో కేసు ఇంకా విచారణ పూర్తి కానే లేదు, తీర్పు రాలేదు. ప్రభుత్వ నిర్ణయంపై మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఈలోగా సమాధానం చెప్పమని అడిగారు. అంతలోనే సర్కారు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులనూ కొట్టేయాల్సిందిగా అభ్యర్థించింది. మరో నాలుగైదు రోజులు ఆగితే.. అసలు హైకోర్టు తీర్పు ఏమిటో తేలిపోయే సమయంలో.. అంత అర్జంటుగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అని ఎవరికైనా అనిపిస్తుంది. కానీ ఏపీ ప్రభుత్వం మాత్రం సుప్రీంను ఆశ్రయించింది. ఎదురుదెబ్బ తప్పలేదు.
జీవో నెం.1 విషయంలో దానిని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకు వెళ్లిన రాష్ట్రప్రభుత్వానికి ఆశాభంగమే ఎదురైంది. ఈ సమయంలో ఈ కేసు విషయంలో జోక్యం చేసుకోలేం అని.. హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం చెప్పింది. హైకోర్టు సీజే విచారించేలా చూడగలమని పేర్కొంది. నెగ్గే అవకాశం ఇసుమంతైనా లేదని తెలిసి తెలిసీ సుప్రీంను ఆశ్రయించిన ఏపీ సర్కారు తమ పరాభవాల స్కోరును మరికాస్త పెంచుకుంది.
జీవో నెం.1 ద్వారా ప్రతిపక్షాల పీక నొక్కడానికి సర్కరు ప్రయత్నిస్తున్నదనే ఆరోపణలు సర్వత్రా వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇది వారికి మరీ నష్టదాయకమైన తీర్పు. తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు ప్రజాసంఘాలు కూడా కలిసి జీవో నెం.1 కు వ్యతిరేకంగా ఐక్యపోరాటాలు చేసే బాటలో ఉన్నాయి. మరోవైపు ప్రతిపక్షాలు తలపెట్టే ఏ కార్యక్రమానికీ అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వం దూకుడు ప్రదర్శించింది. చివరికి ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేకహోదా కోసం బస్సు యాత్ర తలపెట్టినా కూడా అనుమతులు నిరాకరించింది. ఇలాంటి నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయించిన సీపీఐ రామకృష్ణ పిటిషన్ ఫలితంగా జీవో నెం.1 పై సస్పెన్షన్ పడింది.
ప్రభుత్వం తమ వాదన ఏమిటో హైకోర్టులోనే వినిపించి ఉండవచ్చు. మధ్యంతర ఉత్తర్వుల మీదనే సుప్రీం కోర్టుకు వెళ్లింది. అక్కడ నెగ్గలేకపోయింది. జగన్ ప్రభుత్వం అన్నీ న్యాయపరంగా నిలవలేని ఆలోచనలే చేస్తుంటుందని, నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుందని ప్రతిపక్షాలు మరోసారి విమర్శించడానికి ఇది కారణమైంది. ప్రతిపక్షాలు ఐక్యపోరాటానికి దిగినప్పుడు.. ప్రభుత్వానికి తగిలిన ఎదురుదెబ్బ కూడా వారికి మరో అస్త్రమే అవుతుంది. ప్రభుత్వం తనంత తానే.. ప్రతిపక్షాలకు అస్త్రాలు సమకూరుస్తున్నట్టుగా ఈ వ్యవహారం తయారైంది.
మరో మొట్టికాయ్ : పరువు గురించి చింత లేదా?
Wednesday, November 13, 2024