మరోసారి సోనియాతో రాహుల్ పెళ్లి ముచ్చట్లు

Friday, November 15, 2024

ఏ తల్లికైనా తన పిల్లలు తగిన వయస్సులో పెళ్లి చేసుకొని, సంసారం జీవనం గడపాలని ఉంటుంది. అయితే కుమారుడు రాహుల్ గాంధీ 50 ఏళ్ళ వయస్సు దాటుతున్నా ఒక వంక రాజకీయాలలో పట్టు సాధింపలేక పోతున్నారు, మరో వంక పెళ్లి మాట దాటేస్తున్నారు. దానితో సోనియా గాంధీ చాలాకాలంగా విచారంగానే ఉంటున్నారు. అయితే రాహుల్ ఆ ప్రస్తావనను దాటేస్తున్నారు.

హర్యానాకు చెందిన మహిళా రైతులు గాంధీ కుటుంబాన్ని కలిసేందుకు ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసానికి వచ్చిన్నప్పుడు మరోసారి రాహుల్ పెళ్లి ప్రస్తావన వచ్చింది.  రాహుల్ గాంధీ పెళ్లి గురించి ప్రశ్నించారు. రాహుల్ కు వివాహం చేయరా? అని ఆ మహిళ ప్రశ్నంచగా.. సోనియా గాంధీ నవ్వుతూ.. ‘అమ్మాయిని చూడండి.. చేసేద్దాం’ అని సరదాగా సమాధానమిచ్చారు. అక్కడే ఉన్న రాహుల్ కూడా.. ‘ఐపోతుంది.. ఐపోతుంది’ అంటూ నవ్వేశారు. ‘అది (పెళ్లి) జరుగుతుంది’ అని ఆయన చెప్పారు.

 ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ప్రజలతో మమేకం అయ్యేందుకు కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కుమారుడు రాహుల్‌ గాంధీ, కుమార్తె, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని హర్యానాకు చెందిన కొందరు మహిళా రైతులు శనివారం కలిశారు.  తమ నివాసంలో కలిసిన హరియాణా మహిళా రైతులకు సోనియా గాంధీ కుటుంబం మరిచిపోలేని ఆతిథ్యాన్ని ఇచ్చింది. వారికి అద్భుతమైన విందు ఏర్పాటు చేయడమే కాకుండా, వారితో కలిసి కూర్చుని భోజనం చేశారు. వారితో కలిసి ఆడి పాడారు. వారితో తమ జీవన అనుభవాలను పంచుకున్నారు.

జులై 8న రాహుల్ గాంధీ  హిమాచల్ ప్రదేశ్ వెళ్తూ మార్గమధ్యంలో హరియాణాలోని మదిన గ్రామ శివార్లలో ఆగారు. అక్కడి పోలాల్లో రైతులతో కలిసి నాట్లు వేశారు. ట్రాక్టర్ నడిపారు. ఈ సందర్భంగా అక్కడి మహిళలు ఇంతవరకు ఢిల్లీ చూడలేదని తెలుసుకుని వారిని ఢిల్లీలోని తమ నివాసానికి ఆహ్వానించారు. రెండు రోజుల క్రితం ప్రత్యేక వాహనంలో వారిని ఢిల్లీకి తీసుకు వచ్చారు. ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలను చూపించారు. అనంతరం వారికి తమ నివాసంలో ప్రేమగా ఆతిథ్యం ఇచ్చారు.

మరోవైపు, హర్యానాకు చెందిన మహిళా రైతులు కలిసిన విషయాన్ని రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. కొంతమంది ప్రత్యేక అతిథులు తమను కలిశారని, గుర్తించుకోదగిన రోజని పేర్కొన్నారు. దేశీ నెయ్యి, తీపి లస్సీ, ఇంట్లో తయారు చేసిన పచ్చళ్లు వంటివి తమకు బహుమతిగా ఇచ్చినట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను షేర్‌ చేశారు.

సోనియా గాంధీ గురించి, రాహుల్ గాంధీ గురించి ప్రియాంక గాంధీ పలు విషయాలను ఆ మహిళా రైతులతో పంచుకున్నారు. తమ తల్లి చేసే వంటకాల గురించి వివరించారు. రాజీవ్ తో పెళ్లి తర్వాత ఆమె అన్నీ నేర్చుకున్నారని వెల్లడించారు.  తనకన్నా రాహుల్ గాంధీనే ఎక్కువ అల్లరి చేసేవాడని, కానీ తిట్లు మాత్రం తనకు పడేవని వారికి చెప్పారు. విందు అనంతరం ఆ మహిళలు, వారి కుటుంబ సభ్యులతో కలిసి సోనియాగాంధీ, ప్రియాంక గాంధీ కాసేపు సరదాగా డాన్స్ కూడా చేశారు. ఈ విషయాలను రాహుల్ గాంధీ తన ట్విటర్ పోస్ట్ లో పంచుకున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles