మరోసారి తెరపైకి భారత్ కు రెండో రాజధానిగా హైదరాబాద్!

Sunday, January 19, 2025

మరో కొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, హైదరాబాద్ ను భారత్ కు రెండో రాజధానిగా చేయాలనే వాదనని మరోసారి సీనియర్ బీజేపీ నేత, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తెరపైకి తేవడం కలకలం రేపుతోంది. ప్రభుత్వ పనితీరు, విధానాలను బట్టి కాకుండా ప్రజల భావోద్వేగాలతో రాజకీయాలు చేయడంలో నేడు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు పోటీ పడుతున్న సమయంలో ఇది కూడా అటువంటి ప్రయత్నంగా కనిపిస్తుంది.

క్రవారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని అంబేద్కర్ ఏనాడో రాశాడని గుర్తు చేస్తూ, తన వ్యక్తిగత అభిప్రాయం కూడా అదేనని తెలిపారు. రెండో రాజధానికి కావల్సిన అర్హతలన్ని హైదరాబాద్ నగరానికి ఉన్నాయని, మౌళిక వసతులు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు.

బంగారు తెలంగాణ ఆకాంక్ష నెరవేరేందుకు కూడా రెండో రాజధాని ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. పైగా, రెండో రాజధానిగా చేసేందుకై ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగానో లేదా కేంద్ర పాలిత ప్రాంతంగానో చేయవచ్చనే ఆలోచనలు కూడా ఉన్నాయి. అక్కడే ఈ ప్రతిపాదన పట్ల ఎవ్వరూ పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదు.

హైద‌రాబాద్ దేశానికి రెండో రాజధాని అవుతుందనే నమ్మకం త‌న‌కు ఉంద‌ని చెబుతూ ఈ అంశంపై అన్ని పార్టీలు కలిసి రావాల‌ని, పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంద‌ని విద్యాసాగ‌ర్‌రావు సూచించారు. అయితే ఈ విషయమై తానే అందరితో సంప్రదింపులు జరుపుతానని మాత్రం చెప్పకపోవడం గమనార్హం. కనీసం బిజెపి నాయకత్వాన్ని ఒప్పిస్తానని కూడా చెప్పలేదు. 

ఇటీవల సచివాలయం వద్ద అంబేద్కర్ విగ్రవిష్కరణకు వచ్చిన డా. బి ఆర్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ సహితం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయాలనే ప్రతిపాదనను గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా కూడా పలువురు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. అయితే, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు గాని, తెలంగాణలోని ప్రధాన మైన రాజకీయ పక్షాలు గాని హైదరాబాద్ ను రెండో రాజధానిగా చేయడం పట్ల ఎప్పుడూ సుముఖత వ్యక్తం చేయలేదు.

మొత్తం తెలంగాణ రాష్త్రానికి హైదరాబాద్ నగరం గుండెకాయ వంటిది. ఇక్కడి ఆదాయం నుండే మొత్తం రాష్ట్రంలో ప్రభుత్వ పాలనా సాధ్యం అవుతుంది. రెండో రాజధానిగా చేస్తే హైదరాబాద్ నగరంపై కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ పెరుగుతుంది. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో మాదిరిగా పోలీసులు, భూములు వంటి కీలక విభాగాలను కేంద్రం తన పరిధిలోకి తీసుకొంటే తెలంగాణ ప్రభుత్వం ఉత్సవ విగ్రహంగా మారుతుంది.

అందుకనే కేసీఆర్ మాత్రమే కాదు, తెలంగాణలోని కాంగ్రెస్, బిజెపి సహితం అధికారికంగా ఎప్పుడూ ఇటువంటి ప్రతిపాదనకు మద్దతు పలకలేదు. ఇప్పుడు విద్యాసాగరరావు ఈ ప్రతిపాదనను ప్రస్తావించడం అంటే తన రాజకీయ ఉనికిని చాటుకునేందుకు కావచ్చు. లేదా రాష్త్ర ప్రజలను ఆకట్టుకునేందుకు బీజేపీకి మరో ప్రచార అస్త్రంను అందించే ఎత్తుగడ కావచ్చని పరిశీలకులు భావిస్తున్నారు.

మహారాష్ట్ర గవర్నర్ పదవి కాలం ముగిసిన తర్వాత బీజేపీలో ఏ స్థాయిలో అయినా లేదా కేంద్ర ప్రభుత్వంలో అయినా ఏదో ఒక పాత్ర ఇస్తారని విద్యాసాగరరావు ఎదురు చూసారు. అయితే, 2020 నుండి ఆయనను బిజెపి కేంద్ర పెద్దలు గాని, రాష్ట్రంలోని నాయకులు గాని పట్టించుకోవడం లేదు. అందుకనే తన రాజకీయ ఉనికి చాటుకునేందుకు ఈ నినాదం తీసుకున్నారా? అనే అభిప్రాయం కలుగుతుంది.

ఈ వాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తూ దేశానికి రెండో రాజధానిగా హైద్రాబాద్‌ను చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమైనవా? బిజెపి పార్టీకి సంబంధించినవా? అని మాజీ ఎంపి, కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.

హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధానిగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్న విద్యాసాగర్ రావు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎందుకు లేఖ రాయడం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు విద్యాసాగర్‌రావు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నికల స్టంట్ గా కన్పిస్తున్నాయని కొట్టిపారేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles