తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో, 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు, ఒకవేళ ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వస్తే రాయలసీమతో కలిపి తెలంగాణ ఏర్పాటు చేయాలని సీమ ప్రాంతానికి చెందిన పలువురు నాయకులు అప్పట్లో డిమాండ్ చేశారు.
వారితో పాటు తెలంగాణ నుండి మజ్లీస్ నేతలు కూడా ఇదే డిమాండ్ చేశారు. అయితే ఏపీ నుంచి తెలంగాణను విడగొట్టి జూన్ 12, 2014న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాయల తెలంగాణ నినాదం తెరమరుగైంది. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడు ఈ నినాదం మరోసారి తెరపైకి వచ్చింది.
రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత జేసీ దివాకర్ రెడ్డి రాయల తెలంగాణపై కీలక వాఖ్యలు చేశారు. రాయలసీమను తెలంగాణలో కలపాలని ఆయన కోరారు. అపుడే సీమలో సాగునీటి సమస్య తీరుతుందని జేసీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాయలసీమను కలుపుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదని, తన వంతుగా ప్రజలను కూడగడతానని చెప్పారు.
అయితే సాగునీటి ప్రోజెక్టుల అమలులో రాయలసీమకు విభజిత ఆంధ్ర ప్రదేశ్ లో అన్యాయం జరుగుతోందని ఆయన ఈ నినాదం లేవనెత్తుతున్నారా? లేదా తన రాజకీయ ఉనికికోసం ఆరాట పడుతున్నారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2019 ఎన్నికల నుండి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. తన రాజకీయ వారసుడిగా కుమారుడు పవన్ కుమార్ రెడ్డిని ప్రకటించారు.
2019 ఎన్నికలలో తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపూర్ లోక్ సభ స్థానంలో కుమారుడు పవన్ కుమార్ రెడ్డి పోటీచేసి రాజకీయ రంగ ప్రవేశం చేసినా, గెలుపొందలేకపోయారు. తిరిగి 2024 ఎన్నికలలో టిడిపి ఆయనే అభ్యర్థిగా ఎంపికచేసి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే, ఇప్పుడు దివాకర్ రెడ్డి దృష్టి అనంతపూర్ అసెంబ్లీ నియోజకవర్గంపై పడింది. అక్కడి నుండి కుమారుడిని నిలబెట్టాలని చూస్తున్నారు.
ఈ విషయాన్నీ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వద్ద ప్రస్తావిస్తే, అందుకు ఆయన సుముఖంగా లేరని వెల్లడైంది. సుదీర్ఘకాలంగా అక్కడ టిడిపికి అండగా ఉంటూ, ఎన్నికలలో పోటీచేస్తున్న ప్రభాకర్ చౌదరిని కాదని సీట్ ఏవిధంగా ఇస్తామని ప్రశ్నించారట. పైగా, దివాకర్ రెడ్డి కుటుంబానికి, ప్రభాకర్ చౌదరికి అసలు పడదు. అగ్గివేస్తే భగ్గుమంటుంది. దానితో దివాకరరెడ్డి కొంత అసంతృప్తిగా ఉన్నట్లు చెబుతున్నారు.
అందుకనే, రాష్ట్రాలు విడగొట్టడం, కొత్తగా ఏర్పాటు చేయడం కష్టం కానీ కలపడం సులభమేనని అంటూ దివాకర్ రెడ్డి `రాయల్ తెలంగాణ’ ఏమాత్రం కష్టంకాదంటూ చెప్పుకొచ్చారు. రాయలసీమను తెలంగాణలో కలుపుకోవాల్సిన అవసరం సీఎం కేసీఆర్‌కు కూడా ఉందని చెప్పారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన కొందరు నేతలు ‘ప్రత్యేక రాయలసీమ’ అంటున్నారని, ఒకవేళ ప్రత్యేక రాయలసీమ వచ్చినా మంచిదేనని తెలిపారు. అప్పర్ భద్ర ప్రాజెక్టు ఆపాల్సిన అవసరం లేదని కూడా చెప్పారు.
రాయల తెలంగాణపై జేసీ దివాకర్ రెడ్డి గతంలోనూ కీలక వాఖ్యలు చేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2017లో అసెంబ్లీ ఆవరణలో ప్రత్యత్రమైన జేసీ రాష్ట్ర శాసనసభ్యులతో ముచ్చటించారు. మీ దారి మీరు చూసుకున్నారని.., రాయలసీమకు నీరు అందటం లేదని తెలంగాణ నేతలతో ఈ సందర్భంగా వాపోయారు. అదే రాయల తెలంగాణ ఏర్పడి ఉంటే ఇన్ని ఇబ్బందులు వచ్చేవి కాదని పేర్కొన్నారు. రాయల తెలంగాణ ఏర్పాటుకు తెలంగాణకు చెందిన కొందరు రెడ్డి లీడర్లు అడ్డొచ్చారని విమర్శించారు.