మరోసారి కేంద్రం మొండిచేయి… జగన్ నిస్సహాయత 

Sunday, November 17, 2024

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి ప్రత్యేక హోదా కల్పించడం, తెలుగు ప్రజలకు జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయడం కీలక అంశాలుగా ఉంటూ వచ్చాయి. విభజన బిల్లు సందర్భంగా రాజ్యసభలో పోరాడి `ప్రత్యేక హోదా’ అందులో చేర్చేటట్లు చేసింది తానే అంటూ అప్పటి బిజెపి నేత ఎం వెంకయ్య నాయుడుకు రాష్ట్ర వ్యాప్తంగా అప్పట్లో సన్మానాలు చేశారు. 

2014 ఎన్నికలలో బిజెపితో పొత్తు ఏర్పర్చుకోవడానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటె ప్రత్యేక హోదా, పోలవరంలు కార్యరూపం దాల్చేటట్లు చేసుకోవచ్చనే చెప్పారు. ఆ తర్వాత బిజెపితో పొత్తు తెంచుకోవడానికి కూడా ఈ రెండు విషయాలలో నరేంద్ర మోదీ ప్రభుత్వం `నమ్మక ద్రోహం’ చేయడమే కారణంగా చెప్పుకొచ్చారు. 

2019 ఎన్నికలలో  తనకు 25 ఎంపీ సీట్లు ఇస్తే సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తానని, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాగ్దానం చేశారు. అయితే 23 మంది ఎంపిలను ఇచ్చారు. ఈ విషయాలపై కేంద్రంకు విజ్ఞప్తి పత్రాలు ఇవ్వడం తప్పా, కేంద్రాన్ని నిలదీసే ప్రయత్నం చేయలేక పోతున్నారు. పోలవరం నిర్మాణపు పనులు దాదాపు ఆగిపోయాయి. 

తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ రెండింటిపై ఇప్పట్లో సాధ్యం కాదని మరోసారి తేల్చి చెప్పింది. రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్ర బోస్‌ అడిగిన ప్రశ్నకు సోమవారం కేంద్ర మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం మరోసారి తేల్చిచెప్పింది.

ఇక, నిర్ణీత గడువులోగా పోలవరం పూర్తి కావడం కష్టమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ఖర్చు, జాప్యంపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు సమాధానం ఇచ్చారు. పోలవరం నిర్మాణంలో జాప్యం జరుగుతోందా అని వైసీపీ ఎంపీ ప్రశ్నించగా.. షెడ్యూల్‌ ప్రకారం 2024 మార్చి నాటికి పూర్తి కావాల్సి ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. 

కానీ, వివిధ కారణాల దృష్ట్యా ఈ గడువులోగా ప్రాజెక్టు పూర్తి కావడం కష్టమని స్పష్టం చేశారు. 2013-14 అంచనాల ప్రకారం పోలవరం నిర్మాణ వ్యయం రూ. 29,027.95 కోట్లు కాగా, 2017-18 అంచనాల ప్రకారం రూ. 47,725.74 కోట్లకు పెరిగిందని చెబుతూనే అదనపు వ్యయాన్ని కేంద్రం భరించే విషయమై మాటదాటవేస్తున్నారు. 

ఏది ఏమైనా ఈ రెండింటి విషయంలో మోదీ ప్రభుత్వం మొదటి నుండి నిరాసక్త ప్రదర్శిస్తూ వస్తున్నా వై  ఎస్ జగన్ ప్రభుత్వం నిలదీయలేక పోతున్నారు. పైగా, మోదీ ప్రభుత్వంతో తమ అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది అంటూ ఇటీవల విశాఖపట్నం బహిరంగసభలో జగన్ చెప్పుకు రావడం గమనార్హం. 

అంతటి ప్రత్యేక అనుబంధం ఉంటె, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో  కేంద్రం మోకాలడ్డుతున్నా నోరుమెదిపే సాహసం చేయడం లేదు. కేవలం వ్యక్తిగత సీబీఐ కేసులలో దర్యాప్తులు ముందుకు సాగకుండా రక్షణ  పొందేందుకు మాత్రమే కేంద్రంలో అనుబంధాన్ని ఉపయోగించుకొంటున్నట్లు స్పష్టం అవుతుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles