ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్యెల్సీ కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇండో స్పిరిట్ ఎండీ సమీర్ మహేంద్రుపై దాఖలు చేసిన చార్జ్‌షీట్ గమనిస్తే త్వరలో ఆమెకు, ఆమె భర్త అనిల్ కు నోటీసులు జారీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
చార్జ్‌షీట్‌లో ఈడీ ప్రస్తావించిన బలమైన ఆధారాలతో కవితకు నోటీసులు ఇచ్చేందుకు ఈడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తున్నది.
అందులో ఎమ్మెల్సీ కవిత పేరును అనేక సార్లు ప్రస్తావించడంతో సమీర్ మహేంద్రు, దినేశ్ అరోరా స్టేట్‌మెంట్ల ఆధారంగా ఆమెను ఈ కేసులో నిందితురాలిగా చేసేందుకు పకడ్బందీ వ్యూహం రూపొందిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. స్కామ్‌కు సంబంధించిన డిజిటల్ సాక్ష్యాలను ఇప్పటికే సమీకరించారు.
సమీర్ మహేంద్రు సహా 4 లిక్కర్ కంపెనీలపై అభియోగాలను ఈడీ మోపింది. సౌత్ గ్రూప్‌లో కీలకంగా కవిత వ్యవహరించారని పేర్కొంటూ ఇందుకు సంబంధించి సమావేశాల వివరాలను సహితం ఈడీ వెల్లడించింది. కవిత, సమీర్ మహేంద్రు కాంటాక్ట్ అయిన ‘ఫేస్ టైమ్’ యాప్ డేటాను రికవరీ చేసింది.
హవాలా రూపంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరిన డబ్బు వివరాలను రాబట్టింది. బంజారాహిల్స్‌లోని కవిత ఇంట్లో జరిగిన సమావేశాలలో కవిత భర్త అనిల్ కూడా పాల్గొన్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి ఎల్1, ఎల్7 లైసెన్స్‌ల ద్వారా 32 జోన్స్‌ను సౌత్ గ్రూప్ సంపాదించిందని, ఈ జోన్స్ అలాట్‌మెంట్ అయిన తర్వాత ఎమ్మెల్సీ కవితతో సమీర్ మహేంద్రు ఫేస్ టైమ్ యాప్ ద్వారా మాట్లాడినట్లు ఈడీ పేర్కొంది.
‘‘లైసెన్స్‌లు సక్సెస్ కావడంతో సమీర్ మహేంద్రుకు కవిత కంగ్రాట్స్ చెప్పారు. ఈ క్రమంలోనే సమీర్ మహేంద్రు కొన్ని రోజుల తర్వాత మళ్లీ కవితతో మాట్లాడాడు. ఇండో స్పిరిట్ లిమిటెడ్ సంస్థ బ్లాక్ లిస్ట్‌లో ఉన్నందున ఎల్1 లైసెన్స్ అప్లికేషన్స్‌లో సమస్యలు తలెత్తాయని చెప్పాడు” అని అందులో తెలిపారు.
పైగా, “సమస్యలు పరిష్కరించుకునేందుకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా అరుణ్ రామచంద్ర పిళ్లై ద్వారా తాను చేస్తానని అతడితో కవిత తెలిపారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో మీటింగ్స్ నిర్వహించారు” అని ఈడీ తన చార్జ్‌షీట్‌లో ప్రముఖంగా ప్రస్తావించింది.
సౌత్ గ్రూప్ లీడ్ చేస్తున్న అరుణ్ రామచంద్ర పిళ్లైని సమీర్ మహేంద్రు కలిశాడని, ఈ క్రమంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు కూతురుగా కవిత పేరును పిళ్లై ప్రస్తావించాడని ఈడీ తన చార్జ్‌షీట్‌లో పేర్కొంది. కవిత తరఫున ప్రతినిధిగా మీటింగ్‌లో పాల్గొంటున్నట్లు సమీర్‌తో పిళ్లై అన్నట్లు వెల్లడిచింది.
బంజారాహిల్స్‌లోని కవిత ఇంట్లో సమీర్ మహేంద్రు, అరుణ్ రామచంద్ర పిళ్లై, శరత్ చంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్‌పల్లి మీటింగ్ నిర్వహించారని, ఈ మీటింగ్‌లో కవిత భర్త అనిల్ కూడా పాల్గొన్నారని చార్జ్‌షీట్‌లో ఈడీ పేర్కొంది.
‘‘మీటింగ్ డిస్కషన్‌లో రామచంద్ర పిళ్లైని తమ ఫ్యామిలీ మెంబర్‌గా కవిత చెప్పుకొచ్చారు. తనకు సంబంధించిన వ్యాపారాలను రామచంద్ర నిర్వహిస్తారని సమీర్తోఆమె అన్నారు. అన్ని రాష్ట్రాల్లో తమ వ్యాపారాలు ఉన్నట్లు చెప్పారు. ఇంకా వ్యాపారాలను విస్తరిస్తున్నామని వెల్లడించారు. ఇండో స్పిరిట్స్ కు వచ్చిన ఎల్1 లైసెన్స్ ద్వారా లిక్కర్ ఆపరేషన్స్ ప్రారంభిస్తామని వివరించారు” అని ఈడీ తెలిపింది.