పార్టీ అధిష్ఠానం తనను ఎక్కడ పనిచేయమంటే అక్కడ పనిచేస్తానని ఆయన చెబుతుండవచ్చు గాక.. ఆయన సేవలను ఎక్కడైనా సరే వాడుకోవడానికి సిద్ధపడేంత ధైర్యం ఆ పార్టీకి ఉన్నదా అనే అనుమానం ఇప్పుడు ప్రజలకు కలుగుతోంది. ఈ వ్యవహారం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించినది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చిట్టచివరి ముఖ్యమంత్రిగా చరిత్ర పుటల్లో మిగిలిపోయిన ఈ నాయకుడు, సుదీర్ఘ కాలం రాజకీయం అప్రకటిత సన్యాసం తరువాత.. ఇటీవల కమలతీర్థం పుచ్చుకున్నారు. తనకున్న అనుభవంతో పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, పార్టీ ఎక్కడ కోరితే అక్కడ పనిచేస్తానని అంటున్నారు.
నిజానికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీని బలోపేతం చేయగల స్థాయిలో అసలు ఏం అనుభవం ఉన్నది? అనేది అందరికీ కలుగుతున్న సందేహం. అప్పట్లో ఏదో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రాపకంలో ఉంటూ, తమది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం గనుక.. తను స్పీకరుగాను ఆ తర్వాత సీఎంగాను చెలామణీ అయ్యారు. అంతే తప్ప.. పార్టీ బలోపేతానికి కనీసం ఒక్క నియోజకవర్గంలోనైనా తను స్వయంగా కృషిచేసిన అనుభవం ఆయనకు ఉన్నదా? అనేది పలువురి సందేహం.
నల్లారి కిరణ్- తన పుట్టుక చదువు సమస్తం హైదరాబాదే గనుక తాను హైదరాబాదీని అని చెప్పుకుంటూ.. తన స్వంతప్రాంతం చిత్తూరు జిల్లా గనుక అక్కడినుంచి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయ్యానని అంటుంటారు. అలాంటి మాటల ద్వారా ఆయనకు రెండు రాష్ట్రాల్లో అస్తిత్వం ఉండవచ్చు గాక.. కానీ, రాజకీయ బలం అసలు ఏ ప్రాంతంలో ఉంది.
రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా.. రెండు ముక్కలను తిరిగి ఒక్కటి చేయడమే లక్ష్యం అని చెప్పుకుంటూ సొంత పార్టీ ప్రారంభించి.. కూలిన బెర్లిన్ గోడ ఇటుకను విలేకర్లకు చూపించి.. ఇదే రీతిగా రెండు రాష్ట్రాలను తిరిగి కలుపుతానని ప్రతిజ్ఞ చేసిన ఈ కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణలో బాధ్యతలు అప్పగిస్తే అసలు బిజెపి మనుగడ అక్కడ సాధ్యమవుతుందా? అదే జరిగితే.. కిరణ్ మీద కేసీఆర్ నిప్పుల్లాంటి మాటలతో విరుచుకుపడతారనేది ఎవ్వరైనా ఊహించగలిగిన సంగతి. ఆయనకు హైదరాబాదు రాజకీయం మీదనే మోజు ఉండవచ్చు గానీ.. కోరి కోరి ఆయనను తెలంగాణ రాజకీయాల్లోకి తీసుకుని తమ గొయ్యి తాము తవ్వుకునే తెగువ పార్టీకి ఉండదు. అలాగని ఆయన ఏపీ రాజకీయాల్లో పార్టీకి ఉపయోగపడేంత సమర్థుడేమీ కాదు.
పార్టీలో చేరగానే.. ఆయనకు కర్ణాటక ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. అక్కడ పార్టీకి ఘోరపరాభవమే దక్కింది. అలాంటి మట్టి గుర్రం వంటి నాయకుడిని నమ్ముకుని బిజెపి గోదారి ఈదాలని అనుకుంటున్నదా? అది సాధ్యమేనా? అనే సందేహం ఇప్పుడు ప్రజల్లో కలుగుతోంది!