ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ఒక అతిపెద్ద కామెడీ ఎపిసోడ్ ను నడిపించారు. మంత్రులతో కేబినెట్ భేటీ అయిన తర్వాత.. వారందరితో కాసేపు ఇతర విషయాలు సంభాషించిన జగన్.. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో మంత్రులందరూ చురుగ్గా పనిచేయాలని వారికి కర్తవ్యోపదేశం చేశారు. పనిలోపనిగా, కొంతమంది గుండెల్లో డైనమైట్లు పేల్చారు. మంత్రివర్గంలో మార్పులు తప్పవని ఆయన హెచ్చరించారు. మీ అందరి పనితీరును నేను గమనిస్తున్నానంటూ.. తన నిఘా లక్షణాలను ఆయన నివేదించారు. మంత్రులుగా పనితీరులో సమర్థతను నిరూపించుకోలేని వాళ్లను తొలగించడం గ్యారంటీ అని హెచ్చరించారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రులను కొందరిని తొలగించాలని ఆల్రెడీ డిసైడ్ అయి ఉండొచ్చు గాక.. కానీ తాను తొలగించదలచుకున్న వారి కోసం పనితీరు, సమర్థత లాంటి పెద్దపెద్ద పదాలు వాడడమే కామెడీగా ఉంది. మంత్రులుగా సంతకాలు పెట్టడానికే తప్ప.. ఆలోచించగల, నిర్ణయాలు తీసుకోగల స్థాయి నాయకులు ఆ కేబినెట్లో ఎవరు ఉన్నారన్నది అందరికీ ఆశ్చర్యం కలిగిస్తున్న సంగతి. జగన్ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలన్నీ ఎవరో తీసుకుంటారు. చిన్న చిన్న మంత్రిత్వ శాఖలనుంచి కీలకమైన హోం తదితర శాఖల వరకు మంత్రులందరూ జూనియర్లు , సీనియర్లు అనే హోదాలతో నిమిత్తం లేకుండా కేవలం పప్పెట్ లుగా మారిపోయారనే అపప్రధ చాలా కాలంగా ఉంది.
అందరూ ప్రభువు మనసెరిగి నడుచుకునే వారే. ప్రభు ప్రీత్యర్థం నిర్ణయాలు తీసుకునే వారే. వారిలో అసలు సమర్థత గురించి గానీ, అసమర్థత గురించి గానే ప్రస్తావనే ఉండదు. అలాంటిది.. ఇప్పుడు జగన్ పనితీరు గమనిస్తున్నా, కేబినెట్ నుంచి తొలగిస్తా అనడమే కామెడీ. వారు అమసర్థులని గుర్తించి ఉంటే.. అసలు ఇన్నాళ్లూ ఎందుకు కొనసాగించినట్టు. గత కేబినెట్ నుంచి రెండోసారి కొనసాగింపు పొందిన వాళ్లందరూ నూరుశాతం సమర్థులేనా? రేపు ఆయన చేయబోయే తొలగింపుల్లో వారు ఉండరా? అనేది ప్రశ్న.
నిజానికి జగన్ కేబినెట్ లో కులాల ప్రకారం కొన్ని మార్పులు చేయదలచుకున్నారు. ఆ కులాల లెక్క ప్రకారమే ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చారు. వారిలో కొందరిని మంత్రుల్ని చేసి.. కులాలను తృప్తి పరచే ఎన్నికల ప్రసంగాలను ఆయన సిద్ధం చేసుకోవాల్సి ఉంది. ఆ క్రమంలో కొందరికి పదవులు పోవడం గ్యారంటీ. కాకపోతే.. తొలగింపునకు ఆయన అసమర్థత అనే ముసుగు తొడుగుతున్నారని పార్టీలోనే వినిపిస్తోంది. ‘‘కుక్కను చంపదలచుకుంటే గనుక.. ముందు అది పిచ్చిది అని ముద్ర వేయి..’’ అని అర్థం వచ్చే ఇంగ్లిషు సామెతలాగా జగన్ వ్యవహారం ఉన్నదని పలువురు అంటున్నారు.
మంత్రుల సమర్థత.. అతిపెద్ద కామెడీ కాదా?
Sunday, January 19, 2025