పల్నాడు జిల్లాలో ఆరోగ్య మంత్రి విడదల రజని సారధ్యంలో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి వచ్చిన ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సొంత పార్టీ నేతలే మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో చేదు అనుభవం ఎదురైంది. రజని మొదటి నుండి ఏకపక్షంగా, సొంత అజెండాతో వ్యవహరిస్తున్నారని, పార్టీ సహచరులను, తోటి ప్రజా ప్రజాప్రతినిధులను లెక్క చేయడంలేదని విమర్శలు వస్తున్నా సీఎం జగన్ పట్టించుకోవడం లేదు.
అయితే, ఇప్పుడు స్వయంగా నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు సీఎం సమక్షంలోనే ఆమె వ్యవహారంపై బరస్ట్ కావడంతో జగన్ తో సహా, అక్కడున్న అందరూ అవాక్కయ్యారు. ఎవ్వరి నోటమాట రాలేదు. జగన్ యెదుటనే ఆవేశంతో ఆమెపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడంతో కలకలం చెలరేగింది. సర్దుకు పోవాలని జగన్ చేసిన సూచనను నిర్ద్వందంగా వేదిక మీదనే అందరి ముందూ తోసిపుచ్చారు. కుదరదని అందరి ముందే తేల్చిచెప్పేశారు.
ఎంపీ లావు ఆగ్రహంతో సీఎం జగన్ నిచ్చేష్టులయ్యారు. కొద్దిసేపు ఏమీ చేయాలో తెలియక తికమకపడ్డారు. ఎంపీని దాటుకుని ముందున్న వారిని పలకరిస్తూ నాలుగడుగులు ముందుక వేసి, మళ్ళీ వెనక్కి వచ్చిచేయి పట్టుకుని తనతో పాటు వేదికపైకి తీసుకువెళ్లారు.ఎమ్యెల్యే, ఎంపీ వర్గాలకు అక్కడ చాలాకాలంగా పొసగటం లేదు. బహిరంగంగానే ఎవ్వరికీ వారుగా బలప్రదర్శనకు దిగుతూ వస్తున్నారు.
ఇప్పుడు ప్రోటోకాల్ వివాదం పార్టీ, ప్రభుత్వం పరువును మంటగరిపింది. ముఖ్యమంత్రి ఎదుటే అసహనాన్ని వెళ్లగక్కే వరకు వెళ్లింది. అధికారిక కార్యక్రమాలకూ ఆహ్వానం ఉండటం లేదంటూ చాలాకాలంగా లావు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ తో పాటు సజ్జల దృష్టికి ఎంపీ లావు గతంలో తీసుకెళ్లినా వారు మంత్రి విడదల రజనీ మాటలకే ఎక్కువే ప్రాధాన్యంఇస్తూ వస్తున్నారు.
చివరకు ముఖ్యమంత్రి సభకు కూడా జిల్లా అధికారుల నుండి కాకుండా, సీఎంఓ నుండి చివరి నిమిషంలో ఆహ్వానం రావడంతో లావు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ఈ పరిణామాలతో రగిలిపోయిన ఎంపీ లావు సీఎం జగన్ పలకరించడంతో నే ఒక్క సారిగా మండిపోయారు. ముఖ్యమంత్రి సర్దుకు పోవాలనే సూచనను నిర్ద్వందంగా తోసిపుచ్చారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రిని కలవడానికి 20 మంది సర్పంచులు, పార్టీ పెద్దల పేర్లను ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు కలెక్టర్‌కు పంపారు. సెక్యూరిటీ జాబితాలో వాటిల్లో ఒక్క పేరు కూడా పెట్టలేదు. కనీసం వారికి ఎంపీ నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమానికి ఆహ్వానం కూడా పంపలేదు. ఎంపీకి మాత్రం సీఎంఓ కార్యాలయ అధికారులు ఫోన్ చేయడంతో సభకు వచ్చారు.
ఇదే విషయాన్ని లావు సిఎం దృష్టికి తీసుకొచ్చారు. స్థానిక ఎంపీనీ, ప్రోటోకాల్ ఉండాలి కదా? అని అధికారులను సీఎం ముందే నిలదీశారు. జిల్లా ఇంఛార్జి మంత్రి, జిల్లా అధ్యక్షుల ఫోటోలు కూడా బ్యానర్లలో వేసుకోలేదని, స్థానికంగా వేరే వాళ్ళని ఫ్లెక్స్ లు వేయనివ్వలేదని లావు ఆగ్రహంతో ఊగిపోయారు.