మంత్రి పదవి నుండి మల్లారెడ్డిని తొలగించాలి.. ఎమ్యెల్యేల కోరస్!

Sunday, December 22, 2024

ఇప్పటికే ఐటి దాడులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తాజాగా సొంత పార్టీకి చెందిన ఎమ్యెల్యేల తిరుగుబాటుతో ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లయింది. ఆయనను మంత్రి పదవి నుండి తొలగించాలని పట్టుబట్టే వరకు వెడుతున్నది.  మేడ్చల్ జిల్లాలో మంత్రి మల్లారెడ్డి తన అనుయాయులకు మాత్రమే పదవులను కట్టబెడుతుండడంతో  బీఆర్ఎస్‌కు చెందిన గ్రేటర్ ఎమ్మెల్యేలు రహస్య మంతనాలు జరపడం అధికార పార్టీలో కలకలం రేపుతున్నది. 

ఎమ్మెల్యేలు సుభాష్ రెడ్డి, కృష్ణారావు, వివేకానంద, అరికెపూడి గాంధీ మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంట్లో సమావేశమయ్యారు. అయితే ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. కానీ, ఈ భేటీ తాము మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగానే ఏర్పాటు చేశారని తర్వాత వారి మాటలే స్పష్టం చేస్తున్నాయి. 

ఆదివారం నాడు ఓ వివాహ వేడుకలో మైనంపల్లి, మల్లారెడ్డి మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఇతర ఎమ్మెల్యేల పనులు చేయొద్దని కలెక్టర్‌కు మంత్రి మల్లారెడ్డి ఇచ్చిన ఆదేశాలివ్వడంతో ఎమ్మెల్యే మైనంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే కేసీఆర్, కేటీఆర్ ల దృష్టికి తమ అసమ్మతిని వారు తీసుకెళ్లినట్లు తెలిసింది. 

మంత్రి ప్రొటోకాల్‌ పాటించడం లేదని, రాత్రికి రాత్రే మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ను మార్చారని మైనంపల్లి తాజాగా వాపోయారు. తమ కార్యకర్తలకు ఏం చేయలేకపోతున్నామని, కార్పొరేషన్‌ ఎన్నికల్లో అందరికి అవకాశం ఇవ్వలేకపోయామని.. ఒక్క నియోజకవర్గానికే పదవులు ఇస్తే ఎలా అని మైనంపల్లి మంత్రి మల్లారెడ్డి వైఖరిని ప్రశ్నించారు. 

ఎమ్మెల్యేలంతా ఒకే మాట మీద ఉన్నామని, తమది రహస్య సమావేశం కాదని ఎమ్మెల్యే వివేక్‌ స్పష్టం చేశారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవి అంశాన్ని మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లామని, కానీ తొందరపడి జీవో ఇచ్చారని ఎమ్మెల్యే వివేక్‌ మంత్రి మల్లారెడ్డిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

మంత్రి మల్లారెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పదవులు అన్ని ఒకే నియెజకవర్గానికి వెళ్తున్నాయని  మరో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆరోపించారు.  జిల్లా పదవులన్నీ కూడా మంత్రి తీసుకెళ్లి పోతున్నారని ఎమ్మెల్యే కృష్ణారావు ఆరోపించారు. నామినేటెడ్‌ పదవులు తమ కార్యకర్తలకు ఇవ్వడం లేదని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ చెప్పుకొచ్చారు. మొత్తంగా చూసుకుంటే.. మంత్రి మల్లారెడ్డి వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఈ ఎమ్మెల్యేలంతా సమావేశమైనట్లు స్పష్టం అవుతుంది. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles