తన రాజకీయ జీవితంలో మొదటిసారిగా టిడిపికి పెద్దగా బలంలేని మంగళగిరి నుండి 2019లో పోటీ చేసి ఓటమి చెందిన టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వచ్చే ఎన్నికలలో ఏదేమైనా గెలిచి తీరాలని పట్టుదలతో, పార్టీ అధికారమలో లేకపోయినా మంగళగిరిపై దృష్టి కేంద్రీకరించి ప్రయత్నాలు చేస్తున్నారు. గత నాలుగేళ్ల కాలంలో మంగళగిరిలో టిడిపిని బలోపేతం చేయడంలో విజయం సాధించారు.
వచ్చే ఎన్నికలలో ఏదేమైనా గెలిచి తీరుతానని ధీమాతో ఉన్నారు. అందుకు తగ్గట్టు వైసిపి నుండి పలువురు కీలక నాయకులు వరుసగా టిడిపిలో చేరుతూ, లోకేష్ కు మద్దతు పలుకుతున్నారు. మరోవంక, వరుసగా ఇక్కడి నుండి రెండుసార్లు గెలుపొందిన, సీఎం వైఎస్ జగన్ కు సన్నిహితుడిగా పేరొందిన వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇటీవల కాలంలో అంత చురుకుగా కనిపించడం లేదు.
వైసిపి నాయకత్వంపైననే అసమ్మతితో ఉన్నారనే కధనాలు వెలువడుతున్నాయి. రెండుసార్లు ఎమ్యెల్యేగా గెలుపొందడంతో సహజంగానే కొంతమేరకు వ్యతిరేకతను మూటగట్టుకొంటున్నారు. దానితో అసలు అభ్యర్థినే మార్చే ఆలోచనలో జగన్ ఉన్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. ఏదేమైనా ఈ పరిణామాలతో అధికారపక్షం కొంత గందరగోళంలో చిక్కుకున్నట్లు స్పష్టం అవుతుంది.
ఏదేమైనా లోకేష్ ను గెలవకుండా చేయడం కోసం వైఎస్ జగన్ పట్టుదలతో వ్యూహరచన చేస్తున్నట్లు చెబుతున్నారు. రెండేళ్లుగా న్యాయం కోసం ఆందోళన జరుపుతున్న అమరావతి రైతులను అణచివేసే ప్రయత్నం చేస్తున్న జగన్, రాజధానికోసం వారు ఉదారంగా ఇచ్చిన భూములలో ఇతర ప్రాంతాలకు చెందినవారికి ఇళ్లస్థలాలకోసం భూములు ఇచ్చే ప్రయత్నం చేస్తుండటం కేవలం లోకేష్ గెలుపొందకుండా చేయడం కోసమే అనే ప్రచారం జరుగుతుంది.
రైతుల అభ్యంతరాలను ఖాతరు చేయకుండా అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే హైకోర్టులో పోరాటం చేసి విజయం సాధించింది. దీనిపై సుప్రీంకోర్టులోనూ పోరాడి ఎలాగైనా పేదలకు ఇక్కడ ఇళ్లస్ధలాలు ఇవ్వాలని భావిస్తోంది. ఇదంతా మంగళగిరిలో లోకేష్ ను మరోసారి ఓడించేందుకేనని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు.
రాష్ట్ర హైకోర్టులో అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలను వినిపించిన రాష్ట్ర ప్రభుత్వం, కోర్టును మభ్యపెట్టిందని ఈ సందర్భంగా రఘురామరాజు తీవ్ర ఆరోపణలు చేశారు. రైతులకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం కోర్టు తప్పు కాదని, అది రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పని ఆయన విమర్శించారు.
ప్రస్తుతమున్న పరిస్థితులలో రానున్న ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని స్పష్టం కావడంతో వైసిపి నాయకత్వం ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందుకే మంగళగిరి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామనే సాకుతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకువచ్చి ఓటర్లుగా చేర్పించాలని నిర్ణయించుకున్నారని రఘురామరాజు ఆరోపించారు.
అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించాలని గత ప్రభుత్వం భావిస్తే, అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం విస్మయం కలిగిస్తుంది. పైగా,గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకే రాజధాని అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి తన వాదనలను వినిపించడం కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇలా ఉండగా, ఆర్- 5 జోన్‌పై అమరావతి రైతులు వేసిన పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో రైతులు మరోసారి సుప్రీంకోర్టు మెట్లెక్కారు. ఆర్-5 జోన్‌లో వేరే ప్రాంతాల వారికి ఇళ్ల స్థలాల కేటాయింపుపై ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించాలని, రాష్ట్ర ప్రభుత్వ జీవోలను రద్దు చేయాలని కోరుతూ రైతులు సుప్రీంను ఆశ్రయించారు.
అమరావతి మాస్టర్ ప్లాన్‌కు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చిందని రైతులు వాపోయారు. సోమవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ధర్మాసన ముందు అమరావతి రైతుల తరపు న్యాయవాదులు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది.