భూకబ్జా ఆరోపణలలో సోము వీర్రాజు

Wednesday, January 22, 2025

ఏపీ బీజేపీ అధ్యక్షునిగా వైసీపీ ప్రభుత్వం పట్ల తన `స్వామి భక్తి’ని ప్రదర్శించుకోవడంకోసం నిత్యం తాపత్రయపడుతూ ఉండే సోము వీర్రాజును వివాదాలు మాత్రం వదలటం లేదు. నిత్యం ఏదోఒక వివాదంలో చిక్కుకొంటున్నారు. సొంతపార్టీ వారే పలుచోట్ల ఆయనపై తీవ్ర ఆరోపణలు చేశారు. కన్నా లక్ష్మినారాయణ వంటి సీనియర్ నాయకులు ఆయన కారణంగా పార్టీని వీడుతున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు.

తాజాగా, ఆయనపై భూకబ్జా ఆరోపణలు తలెత్తాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో దళితుడికి చెందిన ఖరీదైన భూమిని కాజేసేందుకు వీర్రాజు  ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తూ విజయవాడకు చెందిన దళిత అధికారి ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేసేందుకు విఫలయత్నం చేసిన బాధితులు తాజాగా మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంగళగిరి హైవేపై రూ.15 కోట్లు ఖరీదు చేసే భూమిని తక్కువ ధరకు స్వాధీనం చేసుకునేందుకు సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. ఈ వ్యవహారంపై పోలీసులు కూడా పట్టించుకోవట్లేదని బాధితుడు ఆరోపిస్తున్నాడు. చర్చల పేరుతో పిలిచి తుపాకీతో భయపెట్టారని, కేసులు పెట్టిస్తామని, ఈడీతో దాడులు చేయిస్తామని హెచ్చరిస్తున్నారని ఆరోపించడం కలకలం రేపింది.

తన స్థలంలో 2 సార్లు ప్రహరీ కూలగొట్టి, రాళ్లు పీకేశారని బాధితుడు చెబుతున్నాడు. ఖరీదైన తన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూసోము వీర్రాజు సహా పలువురిపై ఓ దళిత అధికారి ఒకరు గుంటూరు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదుచేశారు.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీపతి రాజా తనకు తుపాకీని చూపించి ఎన్‌కౌంటరు చేయిస్తానని హెచ్చరించాడని ఆరోపించారు. గుంటూరు జిల్లాలోని జాతీయ రహదారిపై ఎన్నారై కళాశాల సమీపంలో రూ.కోట్ల ఖరీదు చేసే స్థలాన్ని కబ్జా చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ ఫిర్యాదు చేశారు.

బాధితుడి కథనం ప్రకారం, విజయవాడ గుణదలకు చెందిన గొల్ల వరప్రసాద్‌ ఎల్‌ఐసీలో డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌‌గా పనిచేస్తున్నారు. గతంలో ఎన్నారై కళాశాల సమీపంలో 3.20 ఎకరాలను ఇతరుల నుంచి కొనుగోలు చేశారు. 2014 మే 19న 2202 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసి మంగళగిరి సబ్‌ రిజిస్ట్రర్‌ కార్యాలయంలో తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.

అదే సర్వే నంబర్‌లోని మరో 2202 చదరపు గజాల స్థలాన్ని 2014 జూన్‌ 11న కొనుగోలు చేసి భార్య పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆ భూమికి పక్కనే ఉన్న మరో రెండు ఎకరాల 30 సెంట్ల స్థలాన్ని గతంలోనే కొనుగోలు చేసి తన పేరుతో అగ్రిమెంట్‌ రాయించుకున్నారు. ఈ భూముల మొత్తం విలువ రూ. 15కోట్ల వరకు ఉందని, గత ఏడాది అక్టోబరు 22న కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు తన స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి కబ్జాకు ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు.

ప్రహరీ పగులగొట్టిన విషయం తెలిసి స్థలం వద్దకు గొల్ల వరప్రసాద్‌ వెళ్లడంతో కొంతమంది దౌర్జన్యం చేశారని ఆరోపించారు. కూల్చివేతను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో కులం పేరిట దూషిస్తూ, దాడి చేశారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్ లో అట్రాసిటీ కేసు నమోదైంది.

తర్వాత గత ఏడాది నవంబరు 13న బద్రిరెడ్డి వెంకట్‌ రెడ్డి అనే వ్యక్తి సెటిల్‌ చేసుకుందాం రమ్మంటూ విజయవాడ రూరల్‌ మండలం నున్నలో ఉన్న మామిడి తోటకు పిలిపించారని, అప్పటికే సోము వీర్రాజు, బీజేపీ నేత లక్ష్మీపతిరాజా, మరికొందరు ఉన్నారని తెలిపారు. తన స్థలాన్ని తీసుకుంటున్నామని, దానికి ఐదు కోట్లు ఇస్తామని మర్యాదగా తప్పుకోమని బెదిరించారని తెలిపారు.

భూమిని విక్రయించడం తనకు ఇష్టం లేదని చెప్పడంతో తనను తీవ్ర స్థాయిలో బెదిరించారని బాధితుడు ఆరోపించాడు. తాము కేంద్రంలో అధికారంలో ఉన్నామని కేసుల్లో ఇరికించి, ఎన్‌కౌంటర్‌ చేయిస్తామని, ఇచ్చిన చెక్కు తీసుకొని కాగితాలపై సంతకం పెట్టి వెళ్లాలని ఒత్తిడి చేశారని, వల్లభనేని శ్రీనివాసరావు తనను మెడపై కొట్టాడని, లక్ష్మీపతిరాజా తుపాకి తీసి… కాల్చేస్తానంటూ బెదిరించాడని ఆరోపించారు.

ఈ క్రమంలో ఈ నెల 11న మరోసారి వరప్రసాద్‌ స్థలంలోకి 20మంది ప్రవేశించి ప్రహరీ గోడను కూల్చి అందులో ఉన్న హద్దురాళ్లను పీకేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదుచేసినా ఇంతవరకు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles