తమలపాకుతో నువ్వొకటంటే.. తలుపు చెక్కతో నే రెండంటా.. అనే తరహా రియాక్షన్లు దూకుడైన రాజకీయాలలో సర్వసాధారణం. ఒకరు వెటకారాన్ని మేళవించి తమ రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శలు కురిపిస్తే.. అంతకు రెట్టింపు వెటకారంతో ప్రతివిమర్శలు చేయడానికి వారు కూడా ప్రయత్నిస్తారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ విషయంలో కూడా అదే జరగబోతోంది. ఎందుకంటే, 2024 సంవత్సరం సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీలు అంతర్ధానం అయిపోతాయని బొత్స సత్యనారాయణ జోస్యం చెప్పారు. ప్రజలకు సేవ చేయడం పట్ల చిత్తశుద్ధి లేని ఆ పార్టీలు ఇక ఉండవని చెప్పారు. అలా జరగకపోతే గనుక తాను గుండు కొట్టించుకుంటానని కూడా బొత్స సత్యనారాయణ ప్రతిజ్ఞ చేశారు.
ఈ కామెంట్ మీద ఆ రెండు పార్టీలు కూడా సీరియస్ గానే స్పందిస్తున్నాయి. ‘బొత్సగారూ.. తమరు గుండు కొట్టించుకోక తప్పదు. అందుకు సిద్ధంగా ఉండండి’ అంటూ తెదేపా సోషల్ మీడియా కార్యకర్తలు, జనసైనికులు ప్రతివిమర్శలతో హోరెత్తిస్తున్నారు. తిరుమల వెళ్లి తలనీలాలు సమర్పిస్తారా? మీ ఇంటివద్దనే క్షవరం చేయించుకుంటారా? అని ప్రశ్నిస్తున్నారు.
బొత్స సత్యనారాయణ గుండుతో ఉన్న ఫోటోలను తయారు చేసే ట్రోల్ చేస్తున్నారు. దానికి తోడు మరింతగా ఆయన పరువు తీయడం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి బ్లేడ్లను కానుకగా పంపాలని ఈ రెండు పార్టీలు ఒక ఉద్యమంగా తీసుకున్నాయి. ‘బొత్స గారూ.. తమరు గుండు కొట్టుకోక తప్పదు. అందుకు డబ్బులు లేకపోతే చెప్పండి, బ్లేడు కూడా మేమే పంపిస్తాం’ అంటూ ఆయనకు పోస్టు మరియు కొరియర్ ద్వారా బ్లేడులు కానుకగా పంపాలని కార్యకర్తలు డిసైడ్ అయ్యారు.
సాధారణంగా ప్రభుత్వాల పట్ల తమ నిరసనను తెలియజేయడానికి తమ సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడానికి పోస్ట్ కార్డు ఉద్యమాలు లాంటివి ఆందోళనకారులు, ఉద్యమకారులు, సమస్యలపై పోరాడేవాళ్లు నిర్వహిస్తుంటారు. నాయకులు అందుబాటులో లేనప్పుడు వారు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయడం, కనిపించడం లేదనే పోస్టర్లు వేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే, సరిగా పనిచేయనప్పుడు వారికి పసుపు కుంకుమ గాజులు కానుకగా పంపి హేళన చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో తాను గుండు కొట్టుకుంటానని ప్రతిజ్ఞ చేసినందుకు, ఈ రెండు పార్టీల కార్యకర్తలు.. బొత్సకు బ్లేడులు కానుక పంపి హేళన చేసి కార్యక్రమం చేపట్టడం చర్చనీయాంశంగా మారుతోంది.