ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. తన బర్త్ డే కానుకగా విద్యార్థులకు సరికొత్త వరం ప్రకటించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి 6వ క్లాసునుంచే డిజిటల్ బోధన ఉంటుందని, దీనికి అనుగుణంగా పాఠశాలలు పునః ప్రారంభం అయ్యేలోగా డిజిటల్ క్లాస్ రూంల ఏర్పాటు జరుగుతుందని జగన్ ప్రకటించారు. డిజిటల్ క్లాస్ రూములను ఏర్పాటుచేస్తారు. అంతా వీడియోల్లోనే పిల్లలకు చెప్పేస్తారు. ట్యాబ్ లలో ఆకాశ్ వారి ట్యూషన్లుంటాయి. ఇక టీచర్లు ఎందుకు?
ఈ ప్రశ్న చాలా సహజంగా ఉత్పన్నం అవుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. టీచర్ల వ్యవస్థ తన పాలన పట్ల వ్యతిరేకంగా ఉన్నదనే భయంతో, ఏకంగా టీచర్ల సిస్టమ్ నే పరిమార్చాలని నిర్ణయించే దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. ఎంతగానో చదువుకున్న సుశిక్షితులైన టీచర్లు వేలమంది రాష్ట్రంలో సేవలందిస్తుండగా.. ‘బైజూస్ వారి వీడియోల్లో అద్భుతమైన పాఠాలు’ అనే అవమానకరమైన పదజాలంతో జగన్ ఈ కొత్త వ్యవస్థను విద్యారంగంలోకి చొరబెట్టారు.
అసలే ఉద్యోగుల్ని కూడా తొలగిస్తూ దివాలా బాటలో ఉన్న బైజూస్ వారి వీడియోలో ఉన్నది అత్యద్భుతమైన పాఠాలే అయితే.. మరి పాఠశాలల్లో టీచర్లు చెబుతున్నది ఏమిటి? ఈ చిన్న లాజికల్ ఆలోచన ముఖ్యమంత్రి వంటి దార్శనికుడికి రాకపోవడం శోచనీయం.
బడుల్లో టీచర్లు చెబుతున్నదంతా చెత్త అని ముఖ్యమంత్రి తీర్మానించుకున్నారో ఏమో తెలియదు. ఆ టీచర్ల వ్యవస్థనే అవమానించేలా.. బైజూస్ ను తెచ్చి పిల్లలమీద రుద్దుతున్నారు.. అదే అద్భుతం అని కీర్తిస్తున్నారు.
టీచర్ల వ్యవస్థ ఉన్నది ఎందుకు? ఈ వ్యవస్థకు డిజిటల్, బైజూస్ పాఠాలు ఎప్పటికైనా పూర్తి ప్రత్యామ్నాయం కాగలవని ముఖ్యమంత్రి నమ్ముతున్నారా? లేదా? అనేది ఆయన ఒకసారి తన మనోగతం చెప్పాలి. ఎందుకంటే.. బైజూస్ పాఠాలను సభారంజకత్వం కోసం అదేపనిగా కీర్తించడం అనేది.. బడిలోపాఠాలు చెప్పే టీచర్ల ఆత్మవిశ్వాసాన్ని, స్థైర్యాన్ని నాశనం చేసేస్తుంది. పిల్లలందరినీ ఇంట్లోనే కూర్చోబెట్టి ట్యాబ్ లలో బైజూస్ పాఠాలు చెప్పేసి, ఏడాదికోసారి పరీక్షలు పెట్టేసి ప్రమోట్ చేస్తే సరిపోతుంది కదా.. అనే వెటకారాలు కూడా వస్తున్నాయి.
అసలు టీచర్ల వ్యవస్థ ఉన్నది ఎందుకు? బడిలో పిల్లలు అందరూ సమానమైన గ్రహణ శక్తిని కలిగిఉండరు. వీడియోను ఒకసారి చూపిస్తే పాఠాన్ని అర్థం చేసుకునే వారు కొందరుంటే.. పదిసార్లు వ్యక్తిగతంగా చెవినిల్లు కట్టుకుని చెప్పినా అర్థం చేసుకోలేని వారు కొందరుంటారు. అందరూ సమానంగా చదువుకుని బాగుపడాలంటే.. టీచర్లు ఉండాల్సిందే. టీచర్లు కూడా తమ బోధన పద్ధతులను మార్చుకుంటూ.. తరగతిలో ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకంగా, విడివిడిగా శ్రద్ధ పెట్టే అలవాటు చేసుకుంటేనే డిజిటల్ పాఠాలకు ప్రత్యమ్నాయంగా వ్యవస్థని కాపాడుకోగలుగుతారు.
డిజిటల్ పాఠాల వల్ల కొన్ని ఎడ్వాంటేజీలు ఉంటాయి. సైన్సు ప్రయోగాలు వంటివి పిల్లలకు చాలా చక్కగా విపులంగా చూపించి.. ఒక్కసారి చూస్తే చాలు.. వారికి పాఠం మొత్తం అర్థమైపోయేలా చేయవచ్చు. అలా డిజిటల్ ను కూడా సక్రమంగా వాడుకుంటూ.. బోధన వ్యవస్థను నాశనం చేయకుండా ప్రభుత్వం ముందడుగు వేస్తే బాగుంటుంది.
‘బోధన’ను నాశనం చేయకుంటే ‘డిజిటల్’ మంచిదే
Monday, December 23, 2024