బొత్స డైలాగులు ముందస్తు సంకేతాలే?

Wednesday, January 22, 2025

సాధారణంగా నాయకులు కొన్ని విషయాలలో తెలిసీ తెలియకుండా, కొన్ని రహస్యాలను నోరు జారి మాట్లాడేస్తుంటారు. మరికొన్ని విషయాలలో ఉద్దేశపూర్వకంగా కొన్ని లీకులు ఇస్తారు. జనంలోకి సమాచారాన్ని లీక్ చేసిన తర్వాత వారిలో స్పందన ఎలా ఉన్నది అనేదాన్ని బట్టి ఆ తర్వాత ప్రభుత్వం తుదినిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అదే మాదిరిగా భవిష్య పరిణామాలకు సంబంధించి లీకులు ఇస్తున్నారా? నోరుజారి మాట్లాడారా? అనే అనుమానం పలువురికి కలుగుతోంది. ఈ ఏడాది చివరికల్లా ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా అని ప్రజలు అనుకుంటున్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ శ్రీకాకుళం లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కొన్ని ముఖ్యమైన మాటలు వెల్లడించారు. కొత్త అమావాస్య నాటికి అంటే శ్రీకాకుళం వారి పరిభాషలో వచ్చే సంక్రాంతి తరువాత, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండూ అస్తిత్వంలోనే ఉండవని ఆయన తేల్చి చెప్పారు. ఆ పార్టీలు మిగిలి ఉంటే తాను గుండు కొట్టించుకుంటానని కూడా ప్రతిజ్ఞ చేశారు. తానేదో ఈ మాటలు గొప్ప కోసం చెప్పడం లేదని, తనకున్న అనుభవంతో చెబుతున్నానని బొత్స సత్యనారాయణ వివరించారు.

‘ఈ రెండు పార్టీలూ ఉండవు’ అని చెప్పడం వెనుక అంతరార్ధాన్ని కూడా బొత్స పేర్కొన్నారు. ఎందుకంటే- చిత్తశుద్ధి, ప్రజలకు మేలు చేయాలనే సంకల్పం ఉన్న పార్టీలు మాత్రమే మనుగడలో ఉంటాయట. అది లేని పార్టీలు ఉండలేవట. ఎంతసేపు జగన్ ను తిట్టడం తప్ప వేరే పని లేని ఈ పార్టీలు సంక్రాంతి తర్వాత మాయమైపోతాయనిది బొత్స సత్యనారాయణ జోస్యం.

అంతా బాగానే ఉంది కానీ సంక్రాంతి తర్వాత పార్టీలు ఎందుకు మాయమైపోతాయి? సాధారణంగా ఎన్నికల తర్వాత ఆ పార్టీలు కనిపించవు- అని ప్రత్యర్థులు విమర్శించడం కద్దు! ఎన్నికల్లో ఆ పార్టీలను దారుణంగా ఓడిస్తామని, తర్వాత వాటి అస్తిత్వం మిగలదని అలాంటి మాటల ద్వారా వాళ్లు హెచ్చరిస్తూ ఉంటారు. జనవరిలో వచ్చే సంక్రాంతి పండగ తర్వాత ఈ రెండు పార్టీలు ఉండవు అని బొత్స సత్యనారాయణ చెబుతున్నారంటే.. ఆలోగానే అసెంబ్లీ ఎన్నికలు పూర్తవుతాయని ఆయన అనుకుంటున్నారా? అనే అనుమానం కలుగుతోంది. అసలే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేక ఆర్థిక వనరులను సమీకరించలేక ముందస్తు ఎన్నికలకు వెళ్తారనే ప్రచారం ప్రతిపక్షాలు కొంతకాలంగా ముమ్మరంగా సాగిస్తున్నాయి. వారి వాదనకు మరింత బలం చేకూర్చే విధంగా బొత్స సత్యనారాయణ ప్రకటన ఉన్నదని పలువురు అంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles