బెయిల్‌పై ఉన్న నేరస్తుడు కావడమే.. అర్హతా?

Wednesday, January 22, 2025

తాను మోనార్క్ అని ఎవరు ఏమనుకుంటున్నా సరే తాను చేయదలుచుకున్నది చేసి తీరుతానని, అయినవారిని అందలాలు ఎక్కించడంలో తనను ఎలాంటి నైతిక విలువలు, ఎవరి అభ్యంతరాలు అడ్డుకోజాలవని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుల్లో ఒకరైన పెనక శరత్ చంద్ర రెడ్డికి దేశంలోని ఎంతో గౌరవప్రదమైన నామినేటెడ్ పోస్టులుగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండల సభ్యత్వాన్ని కట్టబెట్టారు. తద్వారా విమర్శలకు ఆస్కారం కల్పించారు.

బెయిలుపై ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. బెయిలుపై ఉండే నేరగాళ్లకు మాత్రమే కీలకపదవులు కట్టబెట్టాలనే విధాన నిర్ణయం తీసుకున్నారా? అనే విమర్శ ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి వినవస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణ కు చెందిన ఎమ్మెల్సీ కవితతో పాటు, భారీ స్థాయి కుట్ర, అవినీతి అక్రమాలకు పాల్పడినట్టుగా పెనక శరత్ చంద్రారెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. ఆయనను అరెస్టు చేశారు కూడా. ఇటీవలే ఆయన బెయిలుపై బయటకు రావడం జరిగింది.

ఆధ్యాత్మిక చిందన, దేవునికి, భక్తులకు సేవ చేసుకోవాలనే తలపు ఉన్న వారికి సాధారణంగా దేవాలయాల ట్రస్టు బోర్డు పదవులు కేటాయించడం జరుగుతూ ఉంటుంది. రాజకీయ ప్రాధాన్యాలు పెరిగిన తర్వాత కూడా.. పార్టీకి సేవ చేసిన వారిలో.. ఈ లక్షణాలను చూసుకుని వారికి ఈ పదవులు కేటాయిస్తుంటారు. అయితే పెనక శరత్ చంద్రారెడ్డికి టీటీడీ బోర్డు సభ్యత్వం ఇవ్వడానికి, కేవలం ఆయన ఆర్థిక నేరగాడుగా ముద్రపడి, బెయిలుపై బయట ఉండడం మాత్రమే కారణమా అనే వెటకారపు చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

టీటీడీ బోర్డు కూర్పులో ప్రతిసారీ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి తప్పుడు వ్యక్తులుగా నిందలు ఎదుర్కొంటున్న వారిని.. ఎంపిక చేస్తూనే ఉన్నారు. గత బోర్డులో బూదాటి లక్ష్మీనారాయణ ను నియమించారు. ఆ తర్వాత ఆయన రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో ప్రజలను తొమ్మిది వందల కోట్ల రూపాయల మేర మోసం చేసిన వ్యవహారంలో అరెస్టు అయ్యారు. ఆ తర్వాత ఆయనతో బోర్డు పదవికి రాజీనామా చేయించారు. అలాగే సినీ నటుడు పృథ్వీని ఎస్వీబీసీ ఛానెల్ కు సారథిగా నియమిస్తే, ఆయన సంస్థ ఉద్యోగులను లైంగికంగా వేధిస్తూ ‘రికార్డెడ్’గా దొరికిపోయి ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. జగన్మోహన్  రెడ్డి తన ఆశ్రితులకు పదవులు ఇవ్వాలని అనుకున్నప్పటికీ.. అందులో ఇలాంటి నేరగాళ్లను, తప్పుడు వ్యక్తులను తప్ప మరొకరిని ఎంచుకోలేరా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles