బెడ్ రూమ్ తలుపులు పగలగొట్టి తెలుగు మహిళా నేత అరెస్ట్!

Wednesday, January 22, 2025

రాజకీయ ప్రత్యర్థులపై వైఎస్ జగన్ ప్రభుత్వ పైశాశిక ధోరణులు శృతి మించుతున్నాయి. మహిళానాయకురాళ్ళపై కూడా పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు.  గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసానికి నిరసనగా ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులపై పోలీసులు దాఖలు చేసిన కేసులో తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మూల్పూరి కల్యాణిని ఆమె బెడ్ రూమ్ తలుపులు పగలగొట్టి, బట్టలు మార్చుకొనే అవకాశం కూడా ఇవ్వకుండా అరెస్టు చేశారు.

హనుమాన్‌ జంక్షన్‌లోని కల్యాణి నివాసానికి సోమవారం తెల్లవారుజామున పోలీసులు చేరుకున్నారు. ఇంట్లోకి ప్రవేశించి ఆమె బెడ్‌రూమ్‌ తలుపులను పగలగొట్టారు. లోపలకి చొరబడి మంచంపై నిద్రిస్తున్న కల్యాణిని నిర్బంధించారు. కనీసం దుస్తులు మార్చుకునే అవకాశం కూడా ఆమెకు ఇవ్వలేదు.

కరుడుగట్టిన నేరస్థుల విషయంలో వ్యవహరిస్తున్నట్టు అత్యంత దౌర్జన్యకర పద్ధతుల్లో ఆమెను అరెస్టుచేసి పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఈ దారుణంపై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం ప్రకటించారు. తప్పుడు కేసులు పెట్టడమేగాక బెడ్‌ రూంలోకి చొరబడి ఆమెను ఏదో ఉగ్రవాదిలా అరెస్టు చేయడం దారుణమని చంద్రబాబు ట్విట్‌ చేశారు. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన మహిళపై హత్యాయత్నం కింద కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటని విమర్శించారు.

గత ఫిబ్రవరి 20న గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని వైసీపీ శ్రేణులు, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపైనే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులోభాగంగా కల్యాణిపై కూడా కేసులు నమోదయ్యాయి. అప్పటినుంచి పోలీసుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. తట్టుకోలేక ఆమె నాటి నుంచి అజ్ఞాతంలోనే ఉంటున్నారు.

ఢిల్లీ జిందాల్‌ యూనివర్సిటీలో చదువుతున్న కుమారుడు సాయిశోభన్‌ ఇంటికి రావడం, ఆమె తల్లిదండ్రులు అనారోగ్యానికి గురవడంతో పరామర్శించేందుకు కల్యాణి ఆదివారం ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెను నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు.

కల్యాణి పట్ల మహిళా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. బెడ్రూమ్‌ నుంచి బయటకు వెళితే బట్టలు మార్చుకుంటానని కల్యాణి కోరినా ససేమిరా అన్నారు. తమ ముందే బట్టలు మార్చుకోవాలని గద్దించారు. ఎస్సై కిషోర్‌ బెడ్‌రూం తలుపులు వేయొద్దని ఆదేశించి, వీడియో తీయించారని కల్యాణి కుటుంబసభ్యులు ఆరోపించారు. కల్యాణి బావ అరుణ్‌కుమార్‌ అడ్డుపడబోగా ఆయన్ను తోసివేశారు.

 పోలీసులు చేస్తున్న హడావుడికి అనారోగ్యంతో ఇంటిలో నిద్రిస్తున్న కల్యాణి తల్లి భీతిల్లారు. అక్కడే కూలబడిపోయారు.  కల్యాణి అరెస్టు జగన్‌ పైశాచిక పాలనకు, సైకోయిజానికి పరాకాష్ఠ అని తెలుగు మహిళా రాష్త్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను, అసమర్థ, అవినీతి చర్యలను ఎత్తిచూపుతున్నందుకే కళ్యాణిపై కక్షగట్టి అరెస్ట్ చేశారని ఆమె ఆరోపించారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి పీతల సుజాత విమర్శించారు. మహిళా కానిస్టేబుళ్లు మానవత్వం లేకుండా వ్యావహారించారని అంటూ మహిళలను పోలీస్ స్టేషన్ కు లాక్కొని రావాలని ఎక్కడా చట్టంలో లేదని ఆమె చెప్పారు. పోలీస్ స్టేషన్ కు రావడానికి సహకరిస్తానని కళ్యాణి చెప్పినా వినకుండా అధికార మదంతో సైకో పనులు చేస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

చివరికి కల్యాణిని అరెస్టు చేసి గన్నవరం ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజులు ఆమెకు రిమాండ్‌ విధించారు. విజయవాడలోని సబ్‌ జైలుకు ఆమెను తరలించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles