బుచ్చిబాబు అప్రూవర్ గా మారడంతో కవితకు సంకటం!

Sunday, January 19, 2025

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త మలుపులు తిరుగుతూ ఉండడంతో బీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సంకట పరిస్థితులు పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఈ కేసులో అరెస్ట్ చేసిన దర్యాప్తు సంస్థలు కవితపై సహితం తిరుగులేని సాక్ష్యాధారాలు సంపాదించి, ఆమెను కూడా అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు వారి కదలికలు స్పష్టం చేస్తున్నాయి.

తాజాగా ఆమె మాజీ ఆడిటర్‌‌ గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్‌‌గా మారడం,  కేసులో  దర్యాప్తు సంస్థల విచారణకు సహకరిస్తానని చెప్పడంతో కవిత కీలక పాత్ర వహించినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్న ఏపీ,తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సౌత్‌గ్రూప్‌ లిక్కర్ సిండికేట్‌ చిట్టా బైటపడి అవకాశం ఏర్పడింది.

ఈ కేసులో ఇప్పటికే అరుణ్‌ రామచంద్రపిళ్లై, విజయ్‌నాయర్‌‌, దినేష్‌అరోరాలు అరెస్ట్ అయ్యారు. మరోవంక, మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ విడుదల చేస్తున్న కవితతో జరిపిన వాట్స్ అప్ వివరాలు ఆమెను ఈ కేసులో ఇరికించేందుకు దోహదపడే విధంగా ఉంటున్నాయి.

ఈ క్రమంలోనే సౌత్‌గ్రూప్‌ ఆడిటర్‌‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్‌‌గా మారడంతో సీబీఐ, ఈడీ దర్యాప్తుకు లైన్ మరింత క్లియర్ అయిన్నట్లు అయింది. లిక్కర్ పాలసీ స్కామ్‌లో సౌత్‌గ్రూప్‌ నుంచి అరుణ్‌ రామచంద్రపిళ్లై, బుచ్చిబాబు కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు మాగుంట రాఘవ్‌, అరబిందో ఫార్మా డైరెక్టర్‌ శరత్‌ చంద్రారెడ్డి నేతృత్వంలోని సౌత్‌ గ్రూపు తరఫున సమీర్‌ మహేంద్రుకు చెందిన ఇండోస్పిరిట్స్‌ కంపెనీకి అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబు ప్రాతినిధ్యం వహించారని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి.

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో తొలుత కేసు నమోదు చేసిన సీబీఐ బుచ్చిబాబును అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మనీలాండరింగ్‌ కోణంపై దృష్టిసారించిన ఈడీ కూడా పలుమార్లు బుచ్చిబాబును ప్రశ్నించింది. ఆయన ఫోన్‌లో ఎమ్మెల్సీ కవిత పేరును ‘మేడం’ అని సేవ్‌ చేసుకున్నట్లు.. ఆమెతో పలుమార్లు చాటింగ్‌ చేసినట్లు నిర్ధారించింది.

లిక్కర్ స్కామ్ లో  గతేడాది ఆగస్ట్‌17న సీబీఐ కేసు నమోదు చేసింది. అప్పటి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి  మనీష్ సిసోడియా, ఎక్సైజ్‌ అధికారులతో పాటు మొత్తం 16 మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన అరుణ్‌ రామచంద్రపిళ్లైని 14వ నిందితుడిగా చేర్చారు.

సెప్టెంబర్‌‌లో హైదరాబాద్‌లో సీబీఐ సోదాలు నిర్వహించింది. పిళ్లైని అదుపులోకి తీసుకుని విచారించారు. లిక్కర్‌‌ స్కామ్‌లో ఆధారాలు బలంగా ఉండడంతో అరుణ్‌ పిళ్లై అప్రూవర్‌‌గా మారినట్లు తెలిసింది. రూ.100 కోట్లకు పైగా ముడుపులు చేతులు మారినట్లు ఆధారాలు సేకరించింది.

సౌత్‌గ్రూప్‌ నుంచి బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రతినిధిగా అరుణ్‌ రామచంద్ర పిళ్లై వ్యవహరించిన్నట్లు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సీబీఐ,ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్లలో పలుమార్లు కవిత పేరును ప్రస్తావించారు. అరుణ్‌ రామచంద్రపిళ్లై ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌, ఆధారాలను కోర్టుకు సమర్పించారు.

ఇటువంటి సమయంలో కవిత మాజీ ఆడిటర్, సౌత్‌గ్రూప్ ఆడిటర్‌‌గా పనిచేసిన గోరంట్ల బుచ్చిబాబు అప్రూవర్‌‌గా మారడంతో కేసు విచారణ కీలక దశకు చేరుకున్నట్లు అయింది.  బుచ్చిబాబు వెల్లడించే వివరాల ఆధారంగా  సౌత్‌గ్రూప్‌లో మరికొంత మందిని దర్యాప్తు సంస్థలు విచారించే అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన షెల్ కంపెనీలు, బినామీల అకౌంట్స్‌ నుంచి జరిగిన హవాలా లెక్కలు బయటపడనున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles