బీజేపీ మాయలో చిక్కుకున్న పవన్ … ముఖ్యమంత్రి పదవి జపం!

Wednesday, January 22, 2025

“టిడిపితో పొత్తు లేకుండా దూరంగా ఉంటే హాంగ్ అసెంబ్లీ ఏర్పడుతుంది.. అప్పుడు నీవే ముఖ్యమంత్రి అవుతావు”.. ఇది బీజేపీ నేతలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను `వైసిపి ముక్త ఏపీ’ నినాదం నుండి దారి మళ్లించేందుకు కొంతకాలంగా `బ్రెయిన్ వాషింగ్’ కోసం ఉపయోగిస్తున్న అస్త్రం.

మొదట్లో క్షేత్రస్థాయి వాస్తవాలు గ్రహించి బిజెపి మాయమాటలకు దూరంగా ఉన్నట్లే కనిపించారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీచేస్తేనే వైఎస్ జగన్ ను ఓడిస్తామని చెబుతూ వస్తున్నారు. కానీ, `వారాహి విజయ యాత్ర’ మొదటి రోజు నుండి ఆయన మాట వరుస మారింది.

వైసీపీకి వ్యతిరేక ఓట్లు చీల్చకుండా చూస్తానని మాట ఇప్పుడు అనడం లేదు. “ముఖ్యమంత్రి పదవికి నేను సిద్ధంగా ఉన్నాను” అని ప్రతి ప్రసంగంలో స్పష్టం చేస్తున్నారు. యాత్రలో పాల్గొనే మద్దతుదారులు సహితం “కాబోయే ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్” అంటూ నినాదాలు ఇస్తున్నారు.

గతంలో అటువంటి నినాదాలు ఇస్తుంటే కొంత అసహనం వ్యక్తం చేస్తుండేవారు. కానీ ఇప్పుడు ఆనందిస్తున్నారు. తాను సిఎం కావడానికి సిద్ధంగా ఉన్నానని, ముఖ్యమంత్రి స్థానం ఇవ్వగలిగితే ఎపిని దేశంలోనే ఉన్నత స్థానానికి తీసుకువెళతానని శుక్రవారం రాత్రి పిఠాపురం ఉప్పాడ బస్టాండ్‌ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ అభ్యర్ధించారు. తనకు అధికారం ఇవ్వాలని అభ్యర్థించారు.

రాష్ట్ర బాధ్యతను తీసుకోవడానికి, ప్రజల తరుఫున పోరాటానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొంటూ వచ్చే ఎన్నికలలో అధికారం చేపట్టడమే తన లక్ష్యం అంటూ స్పష్టం చేస్తున్నారు. మొదట్లో ఎమ్యెల్యేగా గెలుపొంది, అసెంబ్లీలో ప్రవేశించడమే లక్ష్యం అన్న జననేత స్వరంలో పూర్తిగా మార్పు కనిపిస్తుంది. కనీసం 20 సీట్లు గెల్చుకున్నా, హాంగ్ అసెంబ్లీ ఏర్పడితే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పోటీపడి తనను ముఖ్యమంత్రి చేస్తారనే బీజేపీ భరోసా ఆయనలో నూతన విశ్వాసం కలిగిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.

ఎటువంటి అధికారం లేకుండా, ఎమ్యెల్యేలు లేకపోయినా గత పదేళ్లుగా జనసేన పార్టీ మనుగడ కొనసాగేటట్లు చేయడమే తాను సాధించిన గొప్ప విజయంగా చెప్పుకొస్తున్నారు. పరోక్షంగా తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ కి అప్పచెప్పడాన్ని ప్రస్తావిస్తున్నట్లున్నారు. పిఠాపురంలో అడుగు పెట్టిన వెంటనే విగ్రహాల ధ్వంసం సంఘటన గుర్తుకు వచ్చిందని పేర్కొంటూ  తనకు సనాతన ధర్మం అంటే గౌరవం ఉందని తెలిపారు.

పిఠాపురాన్ని ఆధ్యాత్మిక రాజధానిగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ఒక విధంగా బిజెపి అజెండాను మోసేందుకు సిద్ధంగా ఉన్నాననే సంకేతం ఇస్తూనే, ఎందుకైనా మంచిదని తనకు మత పిచ్చి మాత్రం లేదని చెబుతున్నారు. జగన్ ప్రభుత్వంపై దండయాత్ర చేస్తూ రాష్ట్రం క్రిమినల్స్‌కు అడ్డాగా మారిందని మండిపడ్డారు. 2024లో జనసేన అధికారంలోకొస్తే రాష్ట్రంలో గుండాయిజం లేకుండా చేస్తానని భరోసా ఇస్తున్నారు. ఒక్కొక్క గూండానూ బట్టలు ఊడదీసి కొడతానని అంటూ సినీఫక్కీలో హెచ్చరించారు.

విశాఖ ఎంపి కుటుంబం కిడ్నాప్‌ ఘటనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ  ఒక ఎంపి కుటుంబానికే దిక్కులేదని, ఇక సామాన్యుల పరిస్థితేంటని ప్రశ్నించారు. యువతను మత్తుకు బానిసలను చేస్తున్నారని విమర్శించారు. ‘కాకినాడ ఎంఎల్‌ఎ దగ్గరున్న ఓ గూండా తుపాకీతో బెదిరిస్తున్నాడట. అక్కడికే వెళ్లి తేలుస్తాను’ అని పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. ఆంధ్ర నేలపై నిలబడి ఉంటానని, ఏ గూండా వస్తారో రండి అని సవాల్‌ విసిరారు. తాను ప్రజల కోసం పోరాడతానని, ఎంతవరకైనా తెగిస్తానని పేర్కొన్నారు. అప్పులు తెచ్చి, ట్యాక్స్‌లు పెంచి అభివృద్ధి అంటే ఎట్లా అని ప్రశ్నించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles