బీజేపీ నుండి ఏపీని కాపాడండి… విజయవాడలో పిలుపు

Saturday, January 18, 2025

ఏపీలో బీజేపీకి ఎటువంటి బలం లేకపోయినా, ఇక్కడున్న మూడు ప్రధాన రాజకీయ పార్టీలను తన చెప్పుచేతలలో ఆడించుకుంటూ, బిజెపి అధికార, ప్రతిపక్ష పార్టీల అండతో బలపడేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి కుట్రలను తిప్పికొట్టి, రాస్త్రాన్ని కాపాడాలని విజయవాడలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన పిలుపు ఇచ్చారు.

`బిజెపిని ఒంటరి చేసి రాష్ట్రాన్ని కాపాడండి.. రాష్ట్ర పౌరులకు వివిధ రంగాలకు ప్రముఖల విజ్ఞప్తి’ పేరుతో రచయితలు, వైద్యులు, ప్రొఫెసర్లు, వేర్వేరు హక్కుల వేదికలు, అభ్యుదయవాదులు సుమారు 500 మంది సంతకాలు చేసిన విజ్ఞాపన పత్రాన్ని వారు విడుదల చేశారు.

ఈ సందర్భంగా ప్రముఖ రైతు నాయకులు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశాన్ని అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. విభజన సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదని, అటువంటి బిజెపి ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న వైసీపీ, టిడిపి, జనసేన ఎందుకు మద్దతు తెలుపుతున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రజల్లో బలం లేని బిజెపికి రాష్ట్రపతి ఎన్నికల్లో బిజెపి పాలిత రాష్ట్రాల్లో కూడా రానన్ని ఓట్లు ఏపీలో వచ్చాయని గుర్తు చేస్తూ ఇంతకంటే దిగజారుడుతనం మరొకటి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో పెట్టే ప్రజావ్యతిరేక బిల్లులు ముఖ్యంగా వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ సంస్కరణల బిల్లులకు వైసిపి, టిడిపి సంపూర్ణ మద్దతు ఇచ్చాయని విమర్శించారు.

ప్రధాని మోదీకి ప్రజాస్వామ్యం అన్నా, ఫెడరల్‌ వ్యవస్థ అన్నా గౌరవం లేదని మతం పేరుతో బిజెపి పాలిత రాష్ట్రాల్లో నరమేధం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపా చట్టాన్ని దుర్వినియోగం చేస్తోందని, వారి దోపిడీకి అడ్డు వచ్చిన వారందరిపై ఉపా చట్టాన్ని పెట్టి జైల్లోనే చనిపోయేలా చేస్తోందని విమర్శించారు. మణిపూర్‌లో గిరిజన ప్రాంతాల్లో దోపిడీ కోసం తెగల మధ్య ఘర్షణ రెచ్చగొట్టిందని పేర్కొన్నారు.

కేంద్ర మాజీ మంత్రి ప్రఖ్యాత ఇంజనీరు డాక్టర్‌ కె.ఎల్‌.రావు కుమారుడు కె.విజయరావు మాట్లాడుతూ దేశంలో ఘర్షణలు పెంచుతూ బిజెపి తన దోపిడీని కొనసాగిస్తోందని తెలిపారు. సామాజిక వ్యవస్థను దెబ్బతీస్తున్నారని, గుజరాత్‌లో చిన్న ఘటన జరిగితే వెళ్లే ప్రధానికి మణిపూర్‌లో అంత ఘర్షణలు జరుగుతున్నా పట్టడం లేదని ఆరోపించారు. 

ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని పేర్కొంటూ పిఎంకేర్‌, ఎలక్టోరల్‌ బాండ్స్‌ పేరుతో పచ్చి దోపిడీ జరుగుతోందని ధ్వజమెత్తారు. దేశంలో ప్రశాంతత లేదని, ఇక అభివృద్ధి ఎక్కడ నుండి వస్తుందని ప్రశ్నించారు. దేశం అభివృద్ధి చెందాలంటే బిజెపి పోవాలని స్పష్టం చేశారు.

ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవమైన విశాఖస్టీలును అమ్మేస్తుంటే వైసిపి, టిడిపి, జనసేన నోరెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇస్తానన్న హోదాను ఇవ్వలేదని, రామయపట్నం పోర్టును రాష్ట్రంపై వదిలేశారని విమర్శించారు.

ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ దేశంలో అరాచకం జరుగుతోందని, ఒక్కరికీ కూడా న్యాయం జరిగిందన్న మాట లేదని తెలిపారు. రాష్ట్రంలో ఒక్క సీటు కూడా లేకపోయినా పార్లమెంటులో బిజెపికి పూర్తి మెజార్టీ వచ్చే రాష్ట్రాల్లో ఎపి తొలిస్థానంలో ఉందని, అన్నిసార్లు గెలిచిన గుజరాత్‌లోనూ బిజెపికి పూర్తి మెజార్టీ లేదని తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles