బీజేపీ ఎంపీ అరవింద్ కు కవిత 24 గంటల అల్టిమేటం

Saturday, January 18, 2025

తనపై, తన కుటుంబ సభ్యులపై తరచూ అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ ఎంపీ డి అరవింద్ కు బిఆర్ఎస్ ఎమ్యెల్సీ కవిత 24 గంటల అల్టిమేటం ఇచ్చారు. ఆలోగా ఆ ఆరోపణలను రుజువు చెయ్యకపోతే పులాంగ్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని ఆమె సవాల్ చేశారు.

2019 లోక్ సభ ఎన్నికలలో నిజామాబాద్ లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కవితను ఓడించినప్పటి నుండి తరచూ పరస్పరం ఆరోపణలు చేసుకొంటున్నారు. ఇటీవల కాలంలో కుటుంభం సభ్యులపై ఆరోపణలు చేస్తుండటం, త్వరలో తాను జైలుకు వెళ్లడం ఖాయం అంటూ ఆరోపణలు చేస్తుండటంతో ఆమె తీవ్రంగా స్పందించారు. వచ్చే ఎన్నికలలో అరవింద్ ఎక్కడి నుండి పోటీ చేసిన ఆయనపై బిఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టి ఓడిస్తానేంటి ఆమె ఈ సందర్భంగా శపథం చేశారు.

“అరవింద్ కు 24 గంటల సమయం ఇస్తున్న. నాకు ఎవరు ఒక రూపాయి ఇచ్చారో రుజువు చేయాలి. కాగితం పట్టుకురా… లేకపోతే పులాంగ్ చౌరస్తాలో ముక్కునేలకు రాసి క్షమాపణలు చెప్పాలి.” అని ఆమె సవాల్ విసిరారు. తాము రాజకీయాలలో ఉన్నాం కాబట్టి తన తండ్రిని, అన్నాను ఏమన్నా పట్టించుకోవడం లేదని ఆమె తెలిపారు. కానీ ఇప్పుడు తన భర్తను కూడా విమర్శిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.  రాజకీయాల్లో లేని తన భర్త పేరును ఎందుకు తీస్తున్నారని అర్వింద్ ను ఆమె నిలదీశారు.

ఎవరూ ఊరుకోరని, మజాక్ చేస్తే బాగుండదని కవిత తీవ్రంగా హెచ్చరించారు. చౌకాబారు రాజకీయాలు మానుకోవాలని ఆమె హితవు చెప్పారు. అరవింద్ ఎక్కడ పోటీ చేసినా అక్కడికి వెళ్లి ఆయనను ఓడించి తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తానని తేల్చిచెప్పారు.  అర్థంలేని ఆరోపణలు చేస్తే బాగుండదని హెచ్చరించారు.

కాగా, మణిపూర్ అల్లర్లపై, నిరుద్యోగంపై బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడడం లేదని అంటూ కవిత ఎదురు దాడి చేశారు. రైతు బంధు పథకానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఎస్ఆర్ఎస్పీ పునరుద్ధరణ ప్రాజెక్టులో బీజేపీది ఒక్క రూపాయి కంట్రిబ్యూషన్ లేదని ఆమె తేల్చి చెప్పారు. 

జాతీయ రహదారులపై గుంతలు ఉంటాయా ఎక్కడైనా ? ఏం చేస్తున్నాడు గడ్డిపీకుతున్నాడా? అని అర్వింద్ ను ఆమె ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో అన్ని విషయాలపై నిలదీస్తామని చెబుతూ కేంద్రం నుంచి అర్వింద్ ఏం తెచ్చారని ఆమె నిలదీశారు. అబద్ధాల మీద సమాజం నడవదని కవిత స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా అక్కడికి వెళ్లి తప్పుడు హామీలు ఇచ్చి ఓట్లు దండుకోవడమే బీజేపీ ఎజెండా అంటూ ఆమె ధ్వజమెత్తారు.

బీఆర్ఎస్, బీజేపీకి డీఎన్ఏ మ్యాచ్ కాదని కవిత తేల్చి చెప్పారు. ఎన్డీఏ, ఇండియా కూటములకు సమాన దూరంలో ఉంటామని ఆమె స్పష్టం చేశారు. తమకు కాంగ్రెస్ తోనే పోటీ అని, కానీ ఆ పోటీ కూడా బీఆర్ఎస్ కు కాంగ్రెస్ దూర స్థానంలో ఉంటుందని స్పష్టం చేశారు. గతం కంటే భారీ మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలవబోతున్నారని అనేక సర్వేలు తేల్చాయని ఆమె గుర్తు చేశారు.

తాను ఎంపీగా ఉన్నప్పుడు తెచ్చిన వాటిని ఇప్పుడు అర్వింద్ తన ఖాతాలో వేసుకుంటున్నారని కవిత ఆరోపించారు. రెండు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను, స్పైస్ బోర్డును తాను ఎంపీగా ఉన్నప్పుడు తీసుకు వచ్చానని ఆమె స్పష్టం చేశారు. పైసలు ఉన్న వారి పక్షాన మాత్రమే కాంగ్రెస్, బీజేపీ పార్టీలు నిలబడుతాయని, బీఆర్ఎస్ ఎప్పడూ పేదల పక్షాన నిలబడుతుందని ఆమె స్పష్టం చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles