గతంలో పలువురు కేంద్ర మంత్రులు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గాని, ఆయన మంత్రులు గాని పట్టించుకోలేదు. కనీసం స్పందించలేదు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ విజయవాడ వచ్చినప్పుడు `లిక్కర్ కింగ్’ అంటూ సీఎం జగన్ ను పేర్కొన్నా మాట్లాడలేదు.
అయితే, బిజెపి అగ్రనేతలు జెపి నడ్డా, అమిత్ షా వరుసగా రెండు రోజులపాటు తన ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలంతో నిందించడంతో ఒక విధంగా సీఎం జగన్ ఆత్మరక్షణలో పడినట్లయింది. అత్యంత అవినీతి ప్రభుత్వం, విశాఖను విద్రోహ శక్తుల అడ్డాగా మార్చారు, పలు మాఫియాలు రాజ్యమేలుతున్నారు, రైతు ఆత్మహత్యలలో మూడో స్థానం.. అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు.
మౌనంగా ఉంటె ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తుంది అనుకున్నారేమో మొదటిసారిగా బిజెపి పేరుతో వైఎస్ జగన్ స్పందించారు. కొందరు మంత్రులు కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే, వారెవ్వరూ నేరుగా అమిత్ షా, నడ్డా లకు బదులు చెప్పకుండా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును, ఆయన పార్టీని దుమ్మెత్తిపోసే ప్రయత్నం చేయడం గమనార్హం.
పల్నాడు జిల్లా క్రోసూరులో నాలుగో విడత ‘జగనన్న విద్యాకానుక’ కిట్ల పంపిణీ కార్యక్రమంలో సోమవారం మాట్లాడుతూ బీజేపీ అగ్రనాయకత్వం టీడీపీ ట్రాప్‌లో పడిందని, పసుపు కండువా మార్చి కాషాయ చొక్కాలు వేసుకున్న వాళ్లు చెప్పిన మాటలను అమిత్ షా పలకడం దారుణమని వాపోయారు. చిత్తశుద్ధితో నడుస్తున్న ప్రభుత్వంపై అమిత్ షా నిందలు వేశారని జగన్ నిట్టూర్పు విడిచారు.
జగనన్నకు బిజెపి అండగా ఉండకపోవచ్చని… అయినా పర్వాలేదని, తాను ప్రజలనే నమ్ముకున్నానని, ఈ కురుక్షేత్ర యుద్ధంలో ప్రజలే తన బలం అని చెప్పారు. అయితే తన ప్రసంగంలో అమిత్ షా, నడ్డాల పేర్లను జగన్ నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం.స్వయంగా తన సారధ్యంలోని ప్రభుత్వంపై అవినీతి విమర్శలు చేసినా నేరుగా ఖండించే ధైర్యం జగన్ చేయలేదని స్పష్టం అవుతుంది.
నేరుగా విమర్శలు గుప్పిస్తే వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు, జగన్ పై సిబిఐ, ఈడీ కేసుల దర్యాప్తు వంటి అంశాలలో ఇబ్బందులు ఎదురుకావచ్చనే భయం కావచ్చనే అభిప్రాయం సర్వత్రా నెలకొంది. సీఎం జగన్‌కు ఇంతకాలం ఏ కష్టమొచ్చినా కేంద్రంలోని బీజేపీ సర్కార్ అండగా నిలుస్తూ వచ్చింది. విచ్చల విడిగా రుణాల మంజూరు నుంచి కేసుల వ్యవహారాల వరకు వైసీపీ ప్రభుత్వాన్ని మోదీ సర్కారు కాపాడుతోందనే భావన సర్వత్రా నెలకొంది. ఇటీవల జరిగిన అనేక పరిణామాలు కూడా ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.
అయితే, ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో బిజెపి – వైసిపి తమ వ్యూహాలు మార్చి, తామిద్దరం ఒకటి కాదనే సందేశం ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నల్టు కనిపిస్తున్నది. అందుకనే నడ్డా, అమిత్ షా ఇంత తీవ్రంగా జగన్ ప్రభుత్వంపై విమర్శలు కురిపించినా టీడీపీ, జనసేన స్పందించక పోవడం గమనార్హం.
కేవలం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో అవినీతి పరిపాలన జరుగుతుంటే కేంద్రంలో హోంమంత్రి స్థానంలో ఉండి గత 4 ఏళ్లుగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయలేని దద్దమ్మగా సీబీఐ వ్యవహరించడం వెనుక అమిత్ షా పాత్ర లేదా అని నిలదీశారు. సీబీఐ అమిత్ షా కనుసన్నల్లో నడుస్తోందని ఆయన ఆరోపించారు.
విశాఖపట్నంకు వచ్చిన అమిత్ షా అక్కడ ప్రజలు విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనను పట్టించుకోకపోవడం, విభజన హామీల ప్రకారం విశాఖలో రైల్వే జోన్ ఇప్పటివరకు ఏర్పాటు చేయకపోవడం గురించి ఏ పార్టీ కూడా ఆయనను నిలదీసే ధైర్యం చేయలేదు.