ఒక వంక వచ్చే ఎన్నికలలో విశాఖపట్నం నుండి లోక్ సభకు పోటీ చేస్తానని చెబుతూ, ఏదైనా పార్టీ మద్దతు ఇస్తే సరే, లేని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానంటున్న మాజీ సిబిఐ అధికారి జెడి లక్ష్మీనారాయణ మరోవంక రాజ్యసభ సీట్ కోసం బీజేపీతో బేరసారాలు జరుపుతున్నట్లు తెలిసింది.
ఇటీవల హైదరాబాద్ లో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో సమావేశమై ఈ విషయమై సుదీర్ఘంగా చర్చించినట్లు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో ఎటువంటి యంత్రాంగం లేకుండా విశాఖ నుండి ఏ విధంగా పోటీ చేస్తారని అడిగితే కొంతకాలంగా తరచూ విశాఖకు వెడుతున్నానని, అక్కడి సమస్యలపై దృష్టి సారిస్తున్నానని చెప్పారు.
పైగా, స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. ఎందుకంటె గత ఎన్నికలలో జనసేన అభ్యర్థిగా మూడో స్థానం మాత్రమే దక్కినా సుమారు మూడు లక్షల ఓట్లు వచ్చాయని, ఇప్పుడు గెలిచే ఓట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే ఆ ఓట్లన్నీ పవన్ కళ్యాణ్ పట్ల ఆకర్షణతో వచ్చిన జనసేన ఓట్లు అంటే ఒప్పుకోలేక పోతున్నారు.
బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తే ఏపీలో ఎక్కడ డిపాజిట్లు దక్కే అవకాశం లేకపోవడం, తెలంగాణాలో గెలిచే సీట్ ఇచ్చే పరిస్థితులు లేకపోవడంతో రాజ్యసభ సీట్ ఇస్తామని పార్టీ కేంద్ర నాయకత్వం హామీ ఇస్తే మూడు రాష్ట్రాలలో బిజెపి కోసం ప్రచారం చేస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చారట. తాను ఉద్యోగం చేసిన మహారాష్ట్రలో, నివాసం ఉంటున్న తెలంగాణాలో, గత ఎన్నికలలో పోటీ చేసిన ఏపీలో విస్తృతంగా ప్రచారం చేస్తానని, తన వల్ల బిజెపికి కొంతమేరకు ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
నిజంగా ఓటర్లపై అంతగా ప్రభావం చూపే అవకాశం ఉంటె ఏ పార్టీ కూడా ఆయనను చేర్చుకోవడం పట్ల ఎందుకనే ఆసక్తి చూపడం లేదనే ప్రశ్న తలెత్తుతుంది. జనసేనతో ఇక ఉపయోగం లేదని ఆయనే దూరంగా ఉంటున్నారు. టిడిపిలో చేరేందుకు స్వయంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. ఆ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలతో భేటీలు కూడా జరిపారు.
అదేవిధంగా బిజెపి రాష్త్ర, జాతీయ స్థాయి నాయకులతో అనేక పర్యాయాలు భేటీలు జరిపారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ను సహితం కలిశారు. కానీ వారెవ్వరూ ఆసక్తి చూపకపోవడంతో విసుగు చెంది స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఆయనకు చేర్చుకునేందుకు ఈ పార్టీలు వెనుకడుగు వేయడానికి ఆయన గొంతెమ్మ కోర్కెలే కారణం అని తెలుస్తున్నది.
టిడిపి నేతలు విశాఖ లోక్ సభ సీట్ ఇవ్వడానికి సుముఖంగా లేరు. ఆ ప్రాంతంలో ఒక అసెంబ్లీ సీట్ ఇవ్వడానికి ప్రతిపాదన చేశారు. ఎందుకంటె, గత ఎన్నికలలో కొద్దీ ఓట్లతో ఓటమి చెందిన నందమూరి బాలకృష్ణ అల్లుడు భరత్ బలమైన అభ్యర్థిగా ఇంకా రంగంలో ఉన్నారు.
ఇక బీజేపీ వారితో అయితే, ఎట్లాగూ గెలిచే అవకాశం లేకపోవడంతో తనకు ప్రతినెలా స్థిరమైన ఆదాయం ఉండేవిధంగా రాజ్యసభ సీట్ వంటి అధికారిక పదవి ఏదో ఒకటి ఇవ్వాలని మొదటి నుంచి పట్టుబడుతున్నారు. రాజకీయాలలో చేరి, తమ ప్రతిభ చూపితే, ప్రజలతో కలసి పనిచేయగలరని నిరూపిస్తే పార్టీలు సహితం తగువిధంగా ప్రాధాన్యత ఇస్తాయి. అవేమీ లేకుండా ముందుగానే షరతులు విధిస్తూ ఉండడంతో ఆయన ప్రయత్నాలు ఫలించడం లేదు.