దేశంలో ప్రజాదరణతో, ఎన్నికలకు అవసరమైన వనరుల సమీకరణలో ప్రధాని నరేంద్ర మోదీకి ఎదురొడ్డగల పార్టీ, నేత లేరనే ధీమాతో ఉంటూ వస్తున్న బీజేపీలో కర్ణాటక ఎన్నికల అనంతరం మొదటిసారి భయం కనిపిస్తుంది. 2024 ఎన్నికల్లో తిరుగులేదనుకొంటున్న సమయంలో ఓటమి భయం వెంటాడుతున్నట్లు స్పష్టం అవుతుంది.
ముఖ్యంగా పాట్నాలో 17 ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశమై వచ్చే ఎన్నికలలో సుమారు 450 సీట్లలో బిజెపిపై ఒకే అభ్యర్థిని నిలబెడతామని ప్రకటించడంతో ఆ పార్టీలో ఆందోళన కనిపిస్తుంది. అందుకనే గత వారం రోజులుగా అగ్రనాయకులు గంటల తరబడి భేటీలు జరుపుతూ పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రి వర్గంలో, పార్టీ నాయకత్వంలో పెను మార్పులు తీసుకు వచ్చేందుకు సమాయత్తం అవుతున్నారు.
ఈ సందర్భంగా `ఆపరేషన్ మహారాష్ట్ర’ చేపట్టి ఆదివారం ఎన్సీపీలో చీలిక తీసుకు వచ్చారు. ఆ పార్టీ నేత అజిత్ పవర్ ను ఉపముఖ్యమంత్రిగా చేయడంతో పాటు ఆ పార్టీకి చెందిన 8 మందిని మంత్రులుగా చేశారు. వారిలో చాలామంది అవినీతి కేసులు ఎదుర్కొంటున్న వారే కావడం గమనార్హం. కర్ణాటకలో అవినీతికి మారుపేరుగా నిలిచినా బిజెపి ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేసి తన ఇమేజ్ ను పోగొట్టుకున్న ప్రధాని మోదీ ఇక్కడ కూడా అదే పొరపాటు చేస్తున్నారు.
బిజెపికి కొత్తగా ఎక్కడా ఎంపిలను గెలిపించుకునే అవకాశాలు కనిపించడం లేదు. పైగా ప్రస్తుతం ఉన్న సీట్లలో సుమారు 75 సీట్లు కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ తర్వాత అత్యధికంగా 48 సీట్లు ఉన్న మహారాష్ట్రలో ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అక్కడ ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని కొనసాగనిచ్చి ఉంటె అంతర్గత కలహాలతో, ప్రజావ్యతిరేకతతో బిజెపి 40కు పైగా సీట్లు గెల్చుకో గలిగెడిది.
అయితే, శివసేన నుండి చీలి వచ్చిన ముఖ్యమంత్రి ఎకనాథ్ షిండే తనతో ఎమ్యెల్యేలను అయితే తీసుకు వచ్చారు గాని, ఓటర్లను తీసుకు రాలేకపోయారు. ఇప్పుడు ఉద్ధవ్ థాకరే పట్ల ప్రజలలో సానుభూతి పెరగడమే కాకూండా, బిజెపికి వ్యతిరేకంగా ఎన్సీపీ, కాంగ్రెస్ ఆయనకు కొండంత అండగా నిలబడ్డాయి. ఈ పరిస్థితులలో బిజెపి అక్కడ 10 నుండి 12కు మించి ఎంపీ సీట్లను గెలిచే అవకాశాలు కనిపించడం లేదు.
అందుకనే అజిత్ పవర్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వజూపి తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేశారు. ఆ విధంగా చేస్తే తాను బైటకు వెళ్లిపోతానని షిండే హెచ్చరించడంతో ఇప్పుడు ఉపముఖ్యమంత్రి పదవితో ఆకట్టుకున్నారు. వీరంతా మంత్రిపదవులకన్నా తమపై ఉన్న అవినీతి కేసుల నుండి బయటపడేందుకు బిజెపితో చేతులు కలిపినట్లు స్పష్టం అవుతుంది.
మొత్తానికి తమ రాజకీయ మనుగడకోసం మహారాష్ట్రాలో రెండేళ్లలో రెండు పార్టీలను కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలను ఉపయోగించి అడ్డంగా బిజెపి చీల్చినట్లయింది. 2022లో శివసేను, తాజాగా ఎన్సీపీని బీజేపీ చీల్చింది. అయితే చీలికలతో ఎమ్యెల్యేలను ఏదోవిధంగా తమవైపు తిప్పుకున్నా ఆ విధంగా ప్రజలను తమవైపు తిప్పుకోవడం అంత సులభం కాదని బిజెపి గ్రహించాలి.
అజిత్ పవార్ తిరుగుబాటు ఆయన వ్యక్తిగత నిర్ణయమని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. ఈ తిరుగుబాటును తమ పార్టీ ఆమోదించడం లేదని తేల్చి చెప్పారు.మహారాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా చేరిన కొంత మంది ఎన్సీపీ సహచరులను అవినీతి ఆరోపణల నుంచి ప్రధాని మోదీ తప్పించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఎద్దేవా చేశారు.
మరోవైపు ఎకనాథ్ షిండే తనదే శివసేన అన్నట్లుగా ఎన్సీపీపై హక్కు తమకే ఉందని ఎవరైనా క్లెయిమ్ చేసినా తనకు ఎలాంటి సమస్య లేదని శరద్ పవార్ తెలిపారు. ప్రజల వద్దకు వెళ్లి వారి మద్దతు కోరుతామని చెబుతూ ప్రజలు తమకు మద్దతిస్తారన్న నమ్మకం తనకు భరోసా వ్యక్తం చేశారు.
ఈ తిరుగుబాటును ప్రజలు సహించరని శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. కొందరు మహారాష్ట్ర రాజకీయాలను నాశనం చేసే పనిని చేపట్టారని, వారు ఎంచుకున్న మార్గంలోనే వారిని ముందుకు వెళ్లనివ్వాలని పరోక్షంగా అజిత్ పవార్, సీఎం షిండే, బిజెపి నుద్దేశించి ఎద్దేవా చేశారు. పార్టీలో నిలువునా చీలికలు సృష్టించే, ఇటువంటి సర్కస్ ఫీట్లను మహారాష్ట్ర ప్రజలు ఎక్కువ కాలం సహించరని ఆయన బిజెపిని హెచ్చరించారు.