కాంగ్రెస్ తో పాటు బీజేపీలోనూ కేసీఆర్ కోవర్టులను పెట్టుకుంటాడని బిజెపి ఎమ్యెల్యే, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తాజాగా చేసిన ఆరోపణ ఆ పార్టీలో రాజకీయ ప్రకంపనాలు సృష్టిస్తోంది. వాస్తవానికి కొద్దీ నెలల క్రితమే ఆయన ఈ ఆరోపణలు చేసినా, వారిని రాష్త్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొట్టిపారేసారు. తమ పార్టీలో అటువంటి కోవర్టులు ఎవ్వరూ లేరండి ఆయన సర్టిఫికెట్ ఇచ్చారు.
గత నెలలో పఠాన్ చెరువు మాజీ ఎమ్యెల్యే, బీజేపీ నేత నందీశ్వర్ గౌడ్ సహితం బీజేపీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతేకాదు, తాను ఒక జాబితాను పార్టీ అగ్రనేతలకు ఇచ్చానని, వారే బైటపడకపోతే తాను ఆ జాబితాను మీడియా ద్వారా విడుదల చేస్తానని కూడా ప్రకటించారు. కానీ ఆ తర్వాత ఏమైందో గాని ఆయన ఈ విషయమై మౌనంగా ఉంటున్నారు.
దున్నపోతుల్ని ట్రాలీలో ఎక్కిస్తూ తెలంగాణ బీజేపీ నాయకత్వానికి అలాంటి ట్రీట్మెంట‌్ అవసరం అంటూ బిజెపి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ట్వీట్లు చేసిన సందర్భంగా ఈటెల కోవర్టులు అంటూ చేసిన వాఖ్యలు కలకలం రేపుతున్నాయి. పైగా, బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్న ఈటెల రాజేందర్ ను దృష్టిలో ఉంచుకొనే ఆ ట్వీట్ చేసిన్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చారు.
ఇటువంటి వివాదాస్పదమైన ట్వీట్ ఇచ్చిన సాయంత్రమే నాగర్ కర్నూల్ లో జరిగిన బహిరంగసభలో బండి సంజయ్ తో కలసి పాల్గొంటూ సంజయ్ నాయకత్వంలో తెలంగాణాలో 85 సీట్లు గెలవబోతున్నామని జితేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. బిజెపి నేతలు అందరూ ప్రస్తావించే ప్రధాని మోదీ ఇమేజ్ తో గెలుస్తామని చెప్పకపోవడం గమనార్హం.
జితేందర్ రెడ్డి వ్యవహారంపై బీజేపీలో పలువురికి చాలాకాలంగా అనుమానాలు ఉంటున్నాయి. అందరూ బిజెపి నేతలపై తరచూ విమర్శలు గుప్పించే బిఆర్ఎస్ నేతలు ఎప్పుడూ ఆయనను టార్గెట్ చేయకపోవడం వారి దృష్టిని ఆకట్టుకొంటోంది. తెలంగాణాలో బిఆర్ఎస్ ను, కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు బిజెపి ఎటువంటి ఎత్తుగడ వేస్తున్నా ముందుగానే బిఆర్ఎస్ నాయకత్వానికి చేరుతుంది.
అందుకనే తెలంగాణ బీజేపీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నారని ఈ మధ్య బిజెపి అగ్రనాయకత్వం కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకనే ఉద్దేశ్యపూర్వకంగానే ఈటెల కోవర్టులు అంశాన్ని ప్రస్తావించారని పలువురు భావిస్తున్నారు.
“ఒకటి మాత్రం చెప్పగలను… బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఇవాళ పరిస్థితులను చూస్తే…. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులను పెట్టుకుంటాడు. భారతీయ జనతా పార్టీలో కూడా కేసీఆర్… కోవర్టులను పెట్టుకుంటాడు. పార్టీలు ముద్ద కాకుండా చూసే ప్రయత్నం చేస్తాడు. ఇంటి దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది” అని ఈటల హెచ్చరించారు.
ఇలా ఉండగా, జితేందర్ ట్వీట్ గురించి ప్రస్తావిస్తూ సున్నితంగా మందలించారు. ఆ ట్వీట్ ఏంటో, దానికి అర్థమేంటో జితేందర్ రెడ్డినే అడగాలని చెబుతూ వయసు, అనుభవం పెరిగిన కొద్దీ ప్రజా జీవితంలో ఉన్న వాళ్లు జాగ్రత్తగా ఉండాలని ఘాటుగా హితవు చెప్పారు. ఇతరుల గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించకూడదని మందలించారు. ఏది పడితే అది చేయడం మంచిది కాదని చెబుతూ ఎవరి స్వేచ్ఛ, గౌరవాన్ని తగ్గించకూడదని, ఈ విషయాన్ని బేసిక్‌గా గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.