బిఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఎమ్మెల్యే అనర్హత తీర్పుపై స్టే ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై వనమా సుప్రీంను అశ్రయించగా పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. అలాగే హైకోర్టు తీర్పుపై స్టే విధిస్తూ, విచారణను 4 వారాలు వాయిదా వేసింది.
తప్పుడు అఫిడవిట్ సమర్పించిన కేసులో కొత్తగూడెం సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై తెలంగాణ హైకోర్టు ఇటీవల వేటు వేసింది. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించింది. ఈ మేరకు ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావును ప్రకటించింది.
తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని 2019 జనవరి నుంచి జలగం వెంకట్రావు న్యాయపోరాటం చేస్తున్నారు. వనమాపై వచ్చిన ఆరోపణలు నిజమేనని రుజువు కావడంతో సమీప ప్రత్యర్థిని విజేతగా ప్రకటించింది కోర్టు. వనమా వెంకటేశ్వరావు ఫారం 26లో భార్య ఆస్తి వివరాలు, స్థిరాస్థుల వివరాలను నామినేషన్ పత్రాల్లో పేర్కొనకపోవడంపై హైకోర్టులో జలగం వెంకట్రావ్ పిటిషన్ చేశారు.
ప్రజాప్రాతినిథ్య చట్టం నిబంధనల ప్రకారం వనమా వెంకటేశ్వరరావుపై ఐదేళ్ల అనర్హత కూడా వర్తిస్తుందని జలగం తరపు న్యాయవాది రమేష్ తెలిపారు. ఎన్నికల అఫిడవిట్‌లో పూర్తి వివరాలు వెల్లడించనుందుకు రూ. 5 లక్షల జరిమానా కూడా విధించినట్లు వివరించారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు ఆ తర్వాత టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
త్వరలో జరగనున్న ఎన్నికల్లో వనమా వెంకటేశ్వరరావు బీఆర్‌ఎస్ టికెట్ దక్కకపోవచ్చని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా కోర్టు అనర్హత వేటు పడటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పుడు అత్యున్నత ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే విధించడంతో పెద్ద ఊరట లభించినట్లయింది.
సుప్రీంకోర్టు స్టే సమాచారం అందగానే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు సోమవారం ఒక్క సారిగా భావోద్వేగానికి లోనయ్యారు. కొత్తగూడెం నియోజకవర్గ ప్రజల నుండి ఏ శక్తి తనను దూరం చేయలేదని కంటతడి పెట్టుకున్నారు. 40 ఏళ్లుగా కొత్తగూడెం ప్రజల కోసం తాను అహోరాత్రులు శ్రమించానని, వారు కూడా తనను గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నారని పెక్రోన్నారు.
బీసీ నేతనైన తనపై ఎన్నో కుట్రలు జరిగాయని, కష్టం వచ్చిన ప్రతి సారి నియోజక వర్గ ప్రజలు, అభిమానులు తనకు అండగా నిలిచారని అయన భావోద్వేగంతో కృతజ్ణతలు తెలిపారు. కొత్తగూడెం గడ్డపై, అక్కడి ప్రజల ఒడిలో ఆనందంగా తుదిశ్వాస వదులుతానని చెప్పారు.
ప్రజాస్వామ్యం మీద, -న్యాయస్థానాల మీద మొుదటి నుండి తాను సంపూర్ణ నమ్మకం కలిగి ఉన్నానని చెబుతూ ఈ రోజు తన నమ్మకం గెలిచిందని వనమా సంతోషం వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టులో వనమా వెంకటేశ్వరరావుకు ఊరట లభించడంతో ఆయన ఇంటి వద్దకు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. నినాదాలు చేస్తూ హంగామా చేశారు.