టీఆర్ఎస్ – బీజేపీల మధ్య ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచ్ఛన్న పోరాటం అగ్రనాయకుల కేంద్రంగా మారుతుంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ నేరుగా బిజెపి అగ్రనేత బి ఎల్ సంతోష్ ను నిందితునిగా పేర్కొనడం గమనిస్తే, ఆయనను అరెస్ట్ చేసేందుకు సహితం సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతున్నది.
సంతోష్ విచారణకు సహకరించడం లేదని, అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు గురువారం రాష్ట్ర హైకోర్టులో విన్నవించడం గమనార్హం. కొంతకాలంగా బీజేపీ- టీఆర్ఎస్ నేతలు పరస్పరం తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసుకొంటూ వస్తున్నా ఇప్పటి వరకు అగ్రనేతలను కేసులలో చేర్చే ప్రయత్నం చేయడం లేదు.
బండి సంజయ్ కుమార్ తెలంగాణ బిజెపి అధ్యక్ష పదవి చేపట్టినప్పటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత జైళ్లలో గడపాల్సిందే అంటూ చెబుతూ వస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు ఏజెన్సీలు పత్రాలు సిద్ధం చేస్తున్నాయని, తొందరలో అరెస్ట్ చేస్తారని చాలాకాలం చెబుతూ వచ్చారు. కానీ ఈ మధ్య ఏమైందో, ఆ మాట అనడం లేదు.
అయితే ఢిల్లీ మద్యం కుంభకోణం వెలుగులోకి వచ్చినప్పటి నుండి కవిత కేంద్రంగా రాష్ట్ర బీజేపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఆ కేసులో ఆమె అరెస్ట్ కావడం తధ్యం అంటూ ప్రకటనలు చేస్తున్నారు. అయితే ఇంతవరకు సీబీఐ, ఈడీ కనీసం ఆమెను విచారణకు కూడా ఆ ఆ కేసులో పిలవలేదు.
ఎమ్యెల్యేల కొనుగోలు వ్యవహారం మనుగోడు ఉపఎన్నికల ముందు వెలుగులోకి వచ్చినప్పుడు సహితం టిఆర్ఎస్ నేతలెవ్వరూ నేరుగా బిజెపి అగ్రనేతలపై విమర్శలు చేయలేదు. కేవలం అరెస్ట్ అయిన ముగ్గురి మొబైల్ కాల్స్ ఆధారంగా బిజెపి ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ కు విచారణకు రమ్మనమని మాత్రమే పిలిచారు.
నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టినప్పటి నుండి బిజెపి జాతీయ నాయకులు ఎవ్వరిని ఒక క్రిమినల్ కేసు విచారణలు పోలీసులు పిలిచినా దాఖలాలు లేవు. ఎమ్యెల్యేల కొనుగోలు వ్యవహారంతో తమకు సంబంధం లేదు అంటూనే రాష్ట్ర బిజెపి నేతలు రాష్ట్ర పోలీసులు కాకుండా, సిబిఐతో విచారణ జరిపించాలి అంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడం గమనిస్తే వారిలో నెలకొన్న కంగారు వెల్లడవుతుంది.
సంతోష్ ఆర్ఎస్ఎస్ ప్రచారక్, బిజెపి సంస్థాగత వ్యవహారాలు అన్ని ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. అంతటి కీలకమైన బిజెపి నేత ఇప్పటివరకు దేశంలో ఎక్కడా ఓ కేసులో నిందితుడిగా పేర్కొన్న ఉదంతం లేదు. దానితో సంతోష్ విచారణకు హాజరు కాకపోవడంతో, ఆయనను ఏ 4గా నిందితుడిగా పోలీసులు చేర్చడం గమనిస్తే నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తలపడటానికి సీఎం కేసీఆర్ సిద్ధపడుతున్నట్లు స్పష్టం అవుతుంది.
గత నెలలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభంకు వచ్చిన సందర్భంగా ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయంలో కేసీఆర్ `అవినీతి’, `కుటుంభ’ పాలన గురించి తీవ్ర విమర్శలు చేశారు. అదే రోజు ఉదయం విశాఖపట్నం బహిరంగ సభలో, సిబిఐ కేసులలో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో వేదిక పంచుకొంటూ, అవినీతి గురించి మాట మాత్రం కూడా ప్రస్తావించకపోవడం గమనార్హం.
బీఎల్ సంతో్‌షతోపాటు తుషార్ వల్లెపల్లి, కేరళ వైద్యుడు జగ్గు, న్యాయవాది శ్రీనివా్‌సను నిందితులుగా చేరుస్తూ ఏసీబీ ప్రత్యేక కోర్టులో పోలీసులు మెమో దాఖలు చేశారు. ఈ కేసులో బీఎల్ సంతో్‌షకు మరోసారి నోటీ్‌సలు జారీ చేసిన సిట్ శని వారం లేదా సోమవారం విచారణకు రావాలని పేర్కొంది. అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేక గడువు కోరుతూ లేఖ పంపుతారా అనేది తేలాల్సి ఉంది.
సంతో్‌షను విచారించాలని, అరెస్ట్ విషయంలో కోర్టు అనుమతి తీసుకోవాలని హైకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా బీఎల్ సంతో్‌షను నిందితుడిగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో సిట్ మెమో దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఈ కేసులో తుషార్, జగ్గుకు 41(ఏ) నోటీ్‌సలు జారీచేసినా ఇప్పటి వరకు వారు సిట్ విచారణకు రాలేదు. జగ్గుపై సిట్ ఏకంగా లుకౌట్ నోటీస్ జారీ చేసింది. ఇప్పుడు నిందితులుగా చేర్చింది.
ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ ప్రభుత్వం దూకుడుగా పోతుంటే, బీజేపీ నాయకత్వం మాత్రం ఆత్మరక్షణ చర్యలకు పరిమితం అవుతూ ఉండటం కనిపిస్తుంది. మరోవంక, కేంద్ర దర్యాప్తు సంస్థలు తెలంగాణ మంత్రులు, టిఆర్ఎస్ నేతలు లక్ష్యంగా సోదాలు జరుపుతున్నా వారెవ్వరూ బెదిరిపోతున్నట్లు కనిపించడం లేదు.
పైగా, రాజకీయ కుట్రలతోనే ఐటీ దాడులను బీజేపీ చేయిస్తున్నదని ఎదురు దాడికి దిగుతున్నరు. తనపై, తన కుటుంబ సభ్యులు, బంధువులపై జరుపుతున్న ఐటీ దాడులకు భయపడేది లేదని అంటూ మంత్రి మల్లారెడ్డి స్పష్టం చేయడం గమనార్హం.