బిజెపి నేత బిఎల్ సంతోష్ హైదరాబాద్ రాకపై ఆసక్తి 

Friday, October 18, 2024

బీజేపీ కీలక నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి బి ఎల్ సంతోష్ ఈ వారం 28, 29 తేదీలలో హైదరాబాద్ పర్యటనకు రావడం సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహిస్తోన్న దక్షిణ రాష్ట్రాల పార్లమెంట్ విస్తారక్ శిక్షణా తరగతుల్లో పాల్గొనేందుకు బీఎల్ సంతోష్ వస్తున్నారు. ఈ శిక్షణా తరగతులు హైదరాబాద్‌ నగర శివారులోని ఓ రిసార్టులో జరగనున్నాయి.

ఆయన బిజెపి సంస్థాగత కార్యక్రమాలకోసమే వస్తున్నా కేసీఆర్ ప్రభుత్వం దాఖలు చేసిన ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో ఆయన పేరు తెరపైకి వచ్చిన తర్వాత ఆయన మొదటిసారిగా నగరానికి రావడం ఆసక్తి కలిగిస్తున్నది. ఆయనను విచారణకు రమ్మనమని సిట్ నోటీసులు దాఖలు చేసినా ఆయన ఖాతరు చేయడం లేదు. హైకోర్టు నుండి ఆ నోటీసులపై స్టే తెచ్చుకున్నారు. 

మరోవంక, ఈ కేసులో ఆయనను నిందితుడిగా చేరుస్తూ సిట్ జారీచేసిన ఉత్తరువును ఏసీబీ కోర్టు కొట్టేసింది. అసలు సిట్ కు అటువంటి అధికారం లేదని స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో అధికారం చేపట్టాలని పట్టుదలగా ఉన్న బిజెపి  తమ అగ్రనేతను కేసీఆర్ ప్రభుత్వం ఈ విధంగా ఓ కేసులో ఇరికించడంతో తట్టుకోలేక పోతున్నది. 

మరోవంక, ఢిల్లీ మద్యం కేసులో కేసీఆర్ కుమార్తె కవిత పేరు తెరపైకి రావడం, ఆమెను ఇప్పటికే సీబీఐ విచారించగా, ఈడీ కూడా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. మరోవంక, బెంగళూరు డ్రగ్స్ కేసులో కేటీఆర్ కూడా దోషి అంటూ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ వెల్లడించడం రాజకీయంగా కలకలం రేపుతున్నది. 

ఇటువంటి పరిస్థితులలో హైదరాబాద్ కు వస్తున్న సంతోష్ ను సిట్  విచారించే ప్రయత్నం చేస్తుందా? సిట్ ఏ విధంగా వ్యవహరిస్తుందని ఆసక్తి చెలరేగుతుంది. సంతోష్ ను విచారించడానికి అనుమతి ఇవ్వమని సిట్ ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించింది. అయితే, హైకోర్టు సంతోష్ కు ఇచ్చిన స్టే ను పొడిగిస్తూ వస్తుంది. ఇదే సమయంలో ఎమ్యెల్యేల కొనుగోలు కేసులో ఫిర్యాదుదారుడైన తాండూరు ఎమ్యెల్యే పైలట్  రోహిత్ రెడ్డిని   ఇప్పటికే విచారించిన ఈడీ తాజాగా ఈ కేసులో నిందితుడైన నందకుమార్ ను సోమ, మంగళ వారాలలో విచారిస్తుంది.

ఈడీ ఈ కేసులో జోక్యం చేసుకోవడం ద్వారా సిట్ జరుపుతున్న విచారణను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ క్షేత్రంలో తెలంగాణాలో బిఆర్ఎస్, బిజెపి ఒక వంక ఆధిపత్యం కోసం పోరాటం చేసుకొంటుండగా; మరోవంక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు ప్రత్యర్థి రాజకీయ నాయకులపై వల విసిరేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles