బిజెపి నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్

Sunday, December 22, 2024

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో ప్రతిష్టాత్మకంగా జరిపిన పార్టీ 10వ ఆవిర్భావ సదస్సు సందర్భంగా 2024 ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన రాజకీయ వ్యూహాన్ని, ముఖ్యంగా రాజకీయ పొత్తుల గురించిన విధానాన్ని వెల్లడిస్తారని అందరూ ఎదురుచూశారు. కానీ, ఈ విషయమై స్పష్టత ఇవ్వలేకపోయినా బహుశా మొదటిసారిగా బీజేపీ నాయకత్వంపై తన అసంతృప్తిని, ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తపరిచారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు ఉంటుందని నేరుగా చెప్పనప్పటికీ, ఆ అవసరాన్ని బీజేపీ రాష్ట్ర నాయకత్వమే కల్పిస్తోందని అర్థం వచ్చేలా స్పష్టమైన సంకేతం ఇచ్చారు. బీజేపీ నుంచి రోడ్‌మ్యాప్‌ కోసం ఎదురు చూస్తున్నానని, అయితే రాష్ట్రస్థాయిలో కలిసి కార్యక్రమాలు చేయడానికి ఇక్కడి నాయకులే ముందుకు రావడంలేదని పవన్‌ కుండబద్దలు కొట్టిన్నట్లు బిజెపి నాయకుల ధోరణిని ఎండగట్టారు.

అనుకున్న ప్రణాళికను అమలు చేసి ఉంటే ఇప్పుడు టీడీపీతో అవసరంలేని స్థాయికి ఎదిగేవాళ్లమంటూ ఇప్పుడు తాను టిడిపి వైపు చూడడానికి బిజెపి నాయకత్వమే కారణం అని తేల్చి చెప్పారు. ఏపీలో లాంగ్‌ మార్చ్‌ పెడదామన్నానని పార్టీ బలోపేతమవుదామని చెప్పానని, అందుకు ఢిల్లీలో ఒప్పుకున్నారని సాయంత్రానికి అదేంలేదని అన్నారని అంటూ బిజెపి నాయకత్వం అనుసరిస్తున్న అవకాశవాద ధోరణులను బహిర్గతం చేశారు.

కలిసికట్టుగా కార్యక్రమాలు నడపకపోతే తానేం చేయాలని ప్రశ్నించారు. అమ్మ పెట్టదు… అడుక్కు తిననివ్వదు అన్నట్లుందని బిజెపి నాయకత్వంపై ఆగ్రవేశాలు వ్యక్తం చేశారు.  “మీరు చేయరు. నన్నూ చేయనివ్వరు. ఈ విషయాన్ని బీజేపీ జాతీయ స్థాయి నాయకత్వం దృష్టికి కూడా తెచ్చాను” అని వెల్లడించారు.

తాను అనుకున్నట్లుగా జరిగి ఉంటే… వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంలో తెలుగుదేశం అనేదే వచ్చేది కాదని అంటూటీడీపీ మీద తనకు  ప్రత్యేక ప్రేమ లేదని, చంద్రబాబు మీద ఆరాధనా భావం లేదని తేల్చి చెప్పారు. కానీ చంద్రబాబు మీద గౌరవముందని, ఆయన సమర్థుడని అదేసమయంలో పేర్కొనడం గమనార్హం.

టీడీపీతో పొత్తు… 20 సీట్లకే పవన్‌ పరిమితం… అంటూ వాట్సాప్‌లో వచ్చిన ప్రతి ఒక్కటీ నమ్మొద్దని పార్టీ అభిమానులకు సూచించారు. దేశానికి బలమైన నాయకుడు కావాలన్న ఉద్దేశంతోనే గతంలో మోదీ నేతృత్వంలోని బీజేపీకి మద్దతు ఇచ్చానని ఇప్పుడు కూడా అందుకోసమే టిడిపితో కలవక తప్పడంలేదని సంకేతం ఇచ్చారు.

మరోవంక, ప్రజల అండతో రాబోయే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.  పులివెందుల సహా అన్ని చోట్ల క్రియాశీల కార్యకర్తలు జనసేనకు అండగా ఉన్నారని చెబుతూ తెలుగు రాష్ట్రాల్లో 6 లక్షల క్రియాశీలక సభ్యత్వాలను సంపాదించుకున్నామని తెలిపారు. ఇదంతా ఆయన వైఖరిలో కొరవడిన స్పష్టతను వెల్లడిస్తుంది.

తెలంగాణలో 30వేల మంది కార్యకర్తలు ఉన్నారని చెప్పిన ఆయన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం పోటీచేయబోమని చెబుతున్నారు. ఎందుకంటె తన ఫోకస్ మొదటగా ఏపీ మాత్రమే అంటున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్ సభ ఎన్నికలతో పాటు జరుగుతూ ఉంటె తెలంగాణాలో లోక్ సభ ఎన్నికలలో ఏవిధంగా పోటీచేస్తారో అర్థంకాదు.

నమ్మకం కుదిరితే ఒంటరిగా పోటీ చేయడానికి కూడా జనసేన సిద్ధమేనని అంటారు. కానీ, ఎన్నికల్లో బలిపశువుగా మాత్రం జనసేన మిగిలిపోదని చెబుతారు. అంటే ఒంటరిగా పోటీచేయడం అంటే బలిపశువుగా మారటం అన్నట్లు అర్థం అవుతుంది. 2019లో మాదిరిగా సొంతంగా పోటీచేసే ధైర్యం లేదు. పొత్తులపై ఒక నిర్ణయం తీసుకొనే సాహసం చేయలేకపోతున్నారని స్పష్టం అవుతుంది.

విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన తర్వాతనే పవన్ కళ్యాణ్ లో ఇటువంటి గందరగోళ ధోరణులు వ్యక్తం అవుతున్నాయి. టిడిపితో పొత్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. బిజెపితో కలసి పోటీచేసే హ్యాంగ్ అసెంబ్లీ ఏర్పడి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడు… అంటూ ప్రధాని మోదీ ఆయనలో ఆశలు కల్పించినట్లు భావించవలసి వస్తుంది.

‘‘జనం సీఎం సీఎం అని నినాదాలు చేస్తున్నా … అంతా జనసేనకు అండగా ఉంటామని సంపూర్ణమైన నమ్మకం వచ్చి… క్షేత్రస్థాయిలో సమాచారం తెప్పించుకుని, అధ్యయనం చేసి, జనసేన గెలుస్తుందంటే ఒంటరిగా వెళ్లడానికి వెనుకాడను ’’అని చెప్పడం ద్వారా ఒంటరిగా పోటీచేసే రాజకీయంగా నిలదొక్కుకునే పరిస్థితులు లేవనే స్పష్టత ఉన్నట్టు వెల్లడి చేశారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles