బిజెపి, కాంగ్రెస్ లను షర్మిల ఒకే వేదికపైకి తేగలరా!

Wednesday, January 22, 2025

జాతీయ స్థాయిలో ప్రధాన రాజకీయ ప్రత్యర్ధులు ఎవరంటే బిజెపి, కాంగ్రెస్ అని అందరూ సమాధానం చెబుతారు. 2024 ఎన్నికల సంగ్రామం ఈ రెండు పార్టీలు కేంద్రంగా జరుగనున్నది. ఇటీవల కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనర్హత సాకుతో ప్రతిపక్షాలను ఆయన చుట్టూ సమీకరించడంలో కాంగ్రెస్ కొంత వరకు సఫలీకృతమైంది. 17 రాజకీయ పక్షాలు నేడు కాంగ్రెస్ నేతృత్వంలో బిజెపికి వ్యతిరేకంగా పోరాటానికి సమాయత్తమయ్యాయి.

తెలంగాణాలో సహితం ఈ రెండు పార్టీలు ప్రధాన రాజకీయ ప్రత్యర్ధులుగా ఉన్నాయి. ప్రజా వ్యతిరేకతతో కేసీఆర్ ప్రభుత్వం కొట్టుకు పోతే తామే అధికారంలోకి రావాలని పోటీ పడుతున్నాయి. ఒక వంక బిఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య పొత్తు సంకేతాలు వెలువడుతుండగా, మరోవంక కేసీఆర్ బిజెపిల మధ్య కాంగ్రెస్ ను అణచాలని రహస్య అవగాహనా ఉందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు.

ఇటువంటి సమయంలో పరీక్షాపత్రాల లీకేజి విషయంలో ఈ రెండు పార్టీలను కలసి ఒకే వేదికపైకి తీసుకు వచ్చి, ఉమ్మడి పోరాటం జరపాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బృహత్తర ప్రయత్నం చేపట్టారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ , టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లకు  ఆమె నేరుగా ఫోన్ చేసి ఈ విషయమై ప్రతిపాదన వారి ముందుంచారు.

వారిద్దరూ సానుకూలంగా స్పందించినట్లు చెబుతున్నా ఏమేరకు సఫలం అవుతుందో వేచి చూడవలసిందే. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర జరిపినా రాజకీయంగా తన ఉనికి చాటుకోగలగడం మినహా ఒక రాజకీయ శక్తిగా షర్మిల ఎదగలేక పోతున్నారు. అందుకనే తన రాజకీయ ఉనికిని పటిష్ఠపరచుకోవడం కోసం కీలక ప్రతిపక్షాలను తవైపు తిప్పుకొని ప్రయత్నం ఆమె చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతుంది.

నిరుద్యోగుల విషయంలో కలిసి పోరాడదామని ఇరువురు నేతలను షర్మిల కోరారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్ధామని చెప్పారు. ప్రగతి భవన్ మార్చ్ పిలుపు నిద్ధామని షర్మిల సూచించారు. సీఎం కేసీఆర్  మెడలు వంచాలి అంటే ప్రతిపక్షాలు ఏకం కావాలని ఆమె స్పష్టం చేశారు. కలిసి పోరాటం చేయకపోతే ప్రతిపక్షాలను రాష్ట్రంలో కేసీఆర్ బతకనియ్యడని షర్మిల హెచ్చరించారు.

ఇక షర్మిలకు మద్దతు తెలిపిన బండి సంజయ్ త్వరలో సమావేశమవుదామని తెలిపారు. అటు రేవంత్ కూడా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బదులిచ్చారు. షర్మిల మార్చి 31న టీఎస్ పీఎస్ సీ ముట్టడికి బయల్దేరగా ఆమెను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పేపర్ లీకేజీపై షర్మిల స్పందించారు. 

పేపర్ లీక్ కేసులో పెద్దవాళ్లను తప్పిస్తున్నారని, చిన్నవాళ్లను దోషులుగా చిత్రీకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఆందోళన అనగానే హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారని, తనకు లుకౌట్ నోటీసులు ఇచ్చారని షర్మిల తెలిపారు. లుకౌట్ నోటీసులు ఇవ్వడానికి తానేమన్నా క్రిమినల్‌నా? అంటూ షర్మిల ప్రశ్నించారు.

కాగా, గతంలో రేవంత్ రెడ్డిపై షర్మిల అనేక తీవ్ర విమర్శలు కురిపించారు. ఇటీవల రేవంత్ పాదయాత్రపై కూడా అనేక ఆరోపణలు చేశారు. రేవంత్ చేస్తున్నది పాదయాత్ర కాదని, కారు యాత్ర అంటూ విమర్శించారు. రేవంత్ నడవడం లేదని, ఆయన చేసేది పాదయాత్ర కాదంటూ ఆరోపించారు. పాదయాత్ర అంటే నడవాలని, కానీ రేవంత్ కారులో ప్రయాణిస్తున్నారంటూ షర్మిల ఎద్దేవా చేశారు.

అయితే, గతంలో రేవంత్ రెడ్డి, షర్మిల ప్రజా సమస్యలపై ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశాల్లో పలుమార్లు పాల్గొన్నారు. మరోవంక, పలు సందర్భాలలో షర్మిలకు బిజెపి మద్దతు ఇస్తున్నది. గతంలో షర్మిల పాదయాత్రను అడ్డుకుని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు ఏకంగా షర్మిలకు ప్రధాని మోదీ ఫోన్ చేసి పరామర్శించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles