కర్ణాటక ఎన్నికల అనంతరం తెలంగాణాలో బిజెపి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పార్టీలో కొత్తగా చేరే వారెవరు లేకపోగా ఉన్నవారే ఎవరేమి అవుతారో తెలియని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పార్టీలో తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై అసమ్మతితో ఉంటూ వస్తున్న ఒకొక్క నాయకుడు బయటపడుతున్నారు.
కొద్దిరోజులుగా మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి వారు నేరుగా కేంద్ర నాయకత్వం వద్దకు వెళ్లి సంజయ్ నాయకత్వంలో రాష్ట్రంలో పార్టీ ఒక్క సీట్ కూడా గెల్చుకోలేదని స్పష్టం చేసి వచ్చారు. పైగా, కాంగ్రెస్ లో చేరమని తమపై వత్తిడులు కూడా ఉన్నాయని కూడా చెప్పి వచ్చారు.
ఇప్పుడు తాజాగా బిజెపి ఎమ్యెల్యే రఘునందన్ రావు సహితం అసమ్మతిగళం వినిపిస్తున్నట్లు తెలిసింది. ఆయన చాలాకాలంగా బండి సంజయ్ ధోరణి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. రెండు, మూడు నెలలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. గత ఆదివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డాను కలిశారు గాని, ఆయనతో పాటు నాగర్ కర్నూల్ లో జరిగిన బహిరంగసభకు హాజరు కాలేదు.
ఇప్పుడు నేరుగా పార్టీ కేంద్ర నాయకత్వంకు తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ లేఖ రాసినట్లు తెలుస్తోంది. బిఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్నటువంటి దుబ్బాక నియోజకవర్గం ఉపఎన్నికలో బిజెపికి ఎటువంటి బలం లేకయినా తాను గెలుపొందడంతోనే తెలంగాణాలో పార్టీకి జోష్ వచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈటెల రాజేందర్ బీజేపీలో చేరి, ఉపఎన్నికలో గెలుపొందడం, జిహెచ్ఎంసి ఎన్నికల్లో బిజెపి భారీ విజయం సాధించడం, ఇతర ప్రముఖ నేతలు పార్టీలో చేరడం అంతా తన గెలుపు నుండే ప్రారంభమైందని గుర్తు చేస్తున్నారు. అయితే, అలాంటి తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తన తరువాత వచ్చిన వాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్ వారిని పార్టీ పెద్దలు పిలిచి మాట్లాడుతున్నారని, కానీ తన విషయాన్ని మాత్రం నేతలెవరూ పట్టించుకోవడం లేదని ఆయన వాపోతున్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్ వంటి వారికి వై కేటగిరి భద్రత కల్పిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక అంశాలపై పోరాటం చేస్తున్న తనను మాత్రం పట్టించుకోవడం లేదనే అసహనం కూడా వ్యక్తం చేశారు.
తనకు తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఫ్లోర్ లీడర్ లేదా పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా అవకాశం ఇవ్వాలని కోరారు. ఇవి వీలుకాకపోతే తనకు జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించాలని ఆయన కోరుతున్నట్టు తెలుస్తున్నది. అయితే రఘునందన్ రావు లేఖపై బీజేపీ కేంద్ర నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. మరికొందరు తెలంగాణ బీజేపీ నేతలు సహితం వరుసగా బైటపడి అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.