ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ ప్రధాన రాజకీయ ప్రత్యర్ధులు. ఒకరిపై మరొకరు మండిపడుతూ ఉంటారు. కనీస ప్రజాస్వామ్య మర్యాదలు కూడా పాటించకుండా శత్రు దేశాల ప్రతినిధుల మాదిరిగా వ్యవహరిస్తుంటారు. కానీ వారిద్దరూ ఢిల్లీ వెళ్లేసరికి మౌనం పాటిస్తుంటారు. అక్కడ అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ముందు, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ వద్ద గులాంగిరి చేస్తుంటారు.
ఢిల్లీలో ప్రభుతాన్ని వ్యతిరేకిస్తే తమ లొసుగులు ఎక్కడ బైటపడతాయో, ఎక్కడపై కేంద్ర దర్యాప్తు సంస్థలు సవైరవిహారం చేస్తాయో అని భయపడుతూ ఉంటారు. ఏపీలో మాత్రం బహిరంగసభలలో ఒకరిపై మరొకరు సవాళ్ల మీద సవాళ్లు విసురుకొంటుంటారు. కానీ పార్లమెంట్ వద్దకు వెడితే ఇద్దరిది ఒకే బాట.
అందుకనే ఏపీలో 1 శాతం ఓట్లు కూడా లేని బిజెపికి ఢిల్లీలో ఇక్కడి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. రాష్త్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో వారి అభ్యర్థులకు వంద శాతం ఓట్లు ఈ రాష్ట్రం నుండి వచ్చాయి. బిజెపి సుదీర్ఘకాలంగా అధికారంలో ఉంటున్న రాష్ట్రాల నుండి కూడా అటువంటి మద్దతు లభించలేదు.
తాజాగా, ఈ రెండు పార్టీల ఢిల్లీ బానిసత్వం మరోసారి బైటపడింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రతిపక్షాలన్నీ ఒకటవుతుంటే రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి మాత్రం మోదీ సర్కార్ మెప్పు కోసం పరితపిస్తున్నాయి.
మణిపూర్ మారణకాండ నేపథ్యంలో కేంద్ర మంత్రిమండలిపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా..వైసిపి, టిడిపి రెండూ బిజెపి పంచనే నిల్చున్నాయి. శాంతిభద్రతలు కేంద్ర హోంశాఖ చూసుకుంటుందని, ప్రభుత్వంపై అవిశ్వాసం అనవసరమని వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి సరికొత్త భాష్యం చెప్పారు.
‘అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం ఏముంది? ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నాం’ అని ఆయన ప్రకటించారు. మణిపూర్ దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన అంశమని, ఇది పూర్తిగా కేంద్ర హోంశాఖ పరిధిలో ఉంటుందని చెప్పారు. ఇలాంటప్పుడు ఉభయ సభలను నిలిపివేయడం వల్ల ఉపయోగం లేదని విజయసాయిరెడ్డి ప్రతిపక్షాలపై విరుచుకు పడ్డారు.
మరోవైపు రాష్ట్రంలోని ప్రతిపక్ష టీడీపీ కూడా అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వలేదు. లోక్‌సభ స్పీకర్ అవిశ్వాస తీర్మానాకి మద్దతు ఇచ్చే సభ్యులను నిలబడమని కోరినప్పుడు సభలో ఉన్న ప్రతిపక్ష ఎంపిలంతా నిలబడ్డారు. బిఆర్‌ఎస్ ఎంపిలు కూడా తమ స్థానాల్లో నిలబడి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించారు.
అయితే సభలో ఉన్న టిడిపి ఎంపి గల్లా జయదేవ్ మాత్రం తీర్మానానికి మద్దతుగా నిలబడలేదు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని అధికార, ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వనట్లు స్పష్టం అయింది. ఏపీలో వారి దారులు వేరైనా ఢిల్లీలో మాత్రం ఒక్కటే అని మరోమారు వెల్లడైంది.