బిజెపి ఉచ్చులో చంద్రబాబు చిక్కుకుంటారా!

Saturday, October 5, 2024

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకునేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్న బీజేపీ ఎన్డీఏకు దూరమైన వారిని కూడా తిరిగి దగ్గర చేర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఒకప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉండి ఇప్పుడు దూరమైపోయిన పార్టీలతో రాయబారాలు ప్రారంభించింది. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాల ప్రారంభంకు ముందు ఈ నెల 18న బిజెపి జరుప దలచిన ఎన్డీఏ మిత్ర పక్షాల భేటీ ప్రాధాన్యత సంతరింప చేసుకుంది. 

ఎన్డీయేకి దూరమైన అకాలీదళ్, టిడిపిలను ఈ భేటీకి ఆహ్వానిస్తున్నట్టు గురువారం నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.  అయితే ఈ విషయమై బిజెపి గాని, ఆ రెండు పార్టీలు గాని ఇప్పటి వరకు స్పందించకపోయినా ఈ విషయమై రాజకీయ వర్గాలలో కొద్దిరోజులుగా చర్చలు జరుగుతున్నాయి. 

మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాలుగున్నరేళ్ల తర్వాత ఎన్డీఏ కూటమి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదివరలో ఎన్డీయే సమావేశాలను తరచూ జరుపుతూ, కీలకమైన అంశాలపై చర్చి వస్తుండేవారు. బీజేపీయేతర పార్టీల నుండి ఒకరు ఎన్డీయే కన్వీనర్ గా వ్యవహరిస్తుండేవారు.

వాజపేయి ప్రభుత్వ హయాంలో జార్జ్ ఫెర్నాండెస్ ఎన్డీయే కన్వీనర్. ఆయన ప్రభుత్వంకు ఎటువంటి ఆపద సంభవించినా పరిష్కారంకోసం ముందుండేవారు. ఆ తర్వాత నితీష్ కుమార్ కన్వీనర్ గా ఉన్నారు. అయితే మోదీ హయం నుండి ఎన్డీయే కు కన్వీనర్ అంటూ ఎవరూ లేరు. పార్లమెంట్ లో బిజెపికి సొంతంగా మెజారిటీ ఉండడంతో ఎన్డీయే భాగస్వామ్య పక్షాలను లెక్కచేయల్సిన అవసరం లేకపోయింది.

ఐతే, వచ్చే ఎన్నికలలో బిజెపికి సొంతంగా మెజారిటీ వచ్చే విషయమై అనుమానాలు కలుగుతూ ఉండడంతో తిరిగి ఎన్డీయేను బలోపేతం చేయడం గురించిన ప్రయత్నాలు ప్రారంభమైనట్లు స్పష్టం అవుతుంది. ఎన్డీయేలో బీజేపీ, శివసేన (ఏకనాథ్‌ షిండే వర్గం), రాష్ట్రీయ లోక్‌ జనశక్తి (చిరాగ్‌ పశ్వాన్‌ వర్గం), అన్నాడీఎంకే, అప్నాదళ్‌ (సోనెలాల్‌ ), నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (మేఘాలయ), నేషనల్‌ డెమోక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (నాగాలాండ్‌), ఆల్‌ జార్ఘండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ పార్టీ (జార్ఖండ్‌) తో పాటు పలు చిన్నా చితక పార్టీలున్నాయి.

బిహార్‌లో జితన్‌ రాం మాంఝీకి చెందిన హిందూస్థాన్‌ ఆవాం మోర్చా కూడా ఎన్డీయేలో చేరింది. అజిత్‌ పవార్‌ వర్గానికి చెందిన ఎన్‌సీపీ మహారాష్ట్రలో బీజేపీతో చేతులు కలిపింది. కర్ణాటకలో జనతాదళ్‌ (ఎస్‌) నేత దేవెగౌడ ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకోవడంతో ఆ పార్టీ ఎన్డీయేలో చేరే అవకాశాలు లేకపోలేదు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఎన్డీయే నుంచి తప్పుకొన్న అకాలీదళ్‌ను తిరిగి కూటమిలో చేర్చుకునేందుకు బీజేపీ తీవ్ర యత్నాలు చేసింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అకాలీదళ్‌ నేతలతో చర్చలు జరిపారు.

ఈ సందర్భంగా టిడిపి కూడా ఎన్డీయే భేటీకి హాజరవుతున్నట్లు గురువారం కధనాలు వెలువడ్డాయి. ముఖ్యంగా బిజెపికి సన్నిహితంగా ఉండే రిపబ్లిక్ టివిలో అటువంటి కధనం రావడంతో అందరి దృష్టి ఆకట్టుకొంటోంది. అయితే,  ఆ వార్తల్లో నిజం లేదని టీడీపీ స్పష్టం చేసింది. ఎన్డీఏ మిత్ర పక్షాల సమావేశం గురించి తమకు సమాచారం లేదని తెలిపింది.

ఈ భేటీకి తమకు ఎటువంటి ఆహ్వానం లేదని పేర్కొంటూ కూటమిలో చేరేముందు అనేక విషయాలపై రాజకీయ చర్చలు జరగాల్సి ఉందని టీడీపీ వర్గాలు తెలుపుతున్నాయి. ఏదీ లేకుండా సమావేశానికి హాజరు కావడం జరగదని టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇటీవలి కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఒకటి రెండుసార్లు ప్రధాని మోదీని, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను కలిసినా, ఎన్డీయేలో చేరేంత స్థాయిలో రాజకీయ పరిణామాలేవీ జరగలేదని తేల్చి చెబుతున్నారు. 

ఒక విధంగా టిడిపి విషయంలో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తున్నది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంకు అండగా నిలబడుతూ, క్రిమినల్ కేసుల నుండి రక్షణ కల్పించే విషయంతో పాటు రాష్త్ర ప్రభుత్వాన్ని ఆర్ధిక ఇబ్బందుల నుండి బయటపడేసేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం ముందుంటూ మరోవంక టిడిపితో పొత్తు అనడం వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగుగా కనిపిస్తుంది.

ఒక వంక టిడిపిని అణచివేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో చేతులు కలుపుతూ, మరోవంక ఆ పార్టీకి స్నేహహస్తం జాపడం ద్వారా ఏపీ ప్రజలను గందరగోళంకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నట్లవుతుంది. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మోదీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది. అందుకనే గత ఎన్నికలలో నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. విభజన హామీలు అమలు పరచకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నారనే ఆగ్రవేశాలు ప్రజలలో ఉన్నాయి.

తమపై నెలకొన్న ఆగ్రవేశాలను టిడిపి వైపు మళ్లించి పరోక్షంగా సీఎం జగన్ కు మేలు చేసే ఎత్తుగడగా పలువురు భావిస్తున్నారు. అదే సమయంలో మైనారిటీల ఓట్లు జగన్ నుండి చేజారిపోకుండా కట్టి చేసే వ్యూహంగా కూడా కనిపిస్తున్నది. జగన్ దౌర్జన్యాలా నుండి రక్షణ కోసం కేంద్రం వైపు చూస్తున్న టీడీపీ ఇప్పుడు బిజెపి ఉచ్చులో చిక్కుకొని ప్రమాదం ఉందా? అనే ప్రశ్న తలెత్తుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles