బిజెపి అధిష్టానంనే దోషిగా నిలబెట్టిన సంజయ్, కోమటిరెడ్డి!

Sunday, December 22, 2024

ఎప్పుడు ఎన్నికలు జరిగినా అధికారంలోకి వస్తామనుకొంటున్న తెలంగాణాలో బిజెపి నాయకులు మూటలుగా విడిపోయి, పరస్పరం కలహాలతో కాపురం చేస్తుండటం గమనించిన బీజేపీ అధిష్టానం ఇష్టంలేక పోయినా గతంలో మూడు సార్లు అధ్యక్షునిగా పనిచేసిన కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డిని రాష్ట్ర అధ్యక్షునిగా నియమించింది. ఆయన సారధ్యంలో అందరూ కలిసి పనిచేస్తారని ఆశించిన పార్టీ నేతలకు నిరుత్సాహమే కలుగుతుంది.

కిషన్ రెడ్డి ముహూర్తం చూసుకొని శుక్రవారం పార్టీ కార్యాలయంతో తన ఛాంబర్ లో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నాయకుల ధోరణులు గమనిస్తే పార్టీలో కుమ్ములాటలు మరింత వ్యాపిస్తున్నట్లు స్పష్టమైంది. మొన్నటివరకు బండి సంజయ్ ఎక్కడున్నా ఆయన చుట్టూ ఉండే నేతలు ఇప్పుడు కనుమరుగయ్యారు. సంజయ్ హయాంలో పార్టీ కార్యాలయంపై దూరంగా ఉంటూ వస్తున్న నేతలు కిషన్ రెడ్డికి రెండు వైపులా ఉండటం కనిపించింది.

ఈ సందర్భంగా బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ప్రసంగాలు పరోక్షంగా పార్టీ అధిష్టానంపై తమ ఆక్రోశం వెళ్ళగట్టిన్నట్లుగా ఉన్నాయి. వారి ధోరణిని బహిరంగంగా వారు తప్పుపట్టడం బిజెపి నేతలకు విస్మయం కలిగించింది. తనను `చెప్పుడు మాటలు’ కారణంగానే పార్టీ పదవి నుండి తప్పించినట్లు సంజయ్ స్పష్టంగా చెప్పారు.

“దయచేసి ఫిర్యాదులు చేయటం, తప్పుడు ఫిర్యాదులు ఇవ్వటం బంద్ చేయండి. కనీసం కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పని చేయనివ్వండి. కిషన్ రెడ్జి నమ్మిన సిద్ధాంతం కోసం పని చేసిన నాయకుడు. ఆయనకు అన్ని బాధలు, బాధ్యతలు తెలుసు” అని చెప్పడం ద్వారా తనను అన్యాయంగా పదవి నుండి పార్టీ అధిష్టానం తొలగించిందని ఆక్రోశం వెళ్లగక్కిన్నట్లయింది.

`కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పనిచేయనీయండి’ అని చెప్పడం ద్వారా తన మనుషులను పక్కన పెడితే తాను మౌనంగా ఉండబోనని, తనను ఏ విధంగా ఫిర్యాదులతో వేధించారా అట్లాగే చేస్తాం అంటూ ఓ విధమైన హెచ్చరిక కూడా చేసినట్లయిందని పరిశీలకులు భావిస్తున్నారు.

మరోవంక, కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకారానికి మాజీ మంత్రి చంద్రశేఖర్, మాజీ ఎంఎల్‌ఎ ఏనుగు రవీందర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి దూరంగా ఉన్నారు. వీరంతా బిజెపి అధిష్టానం తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వారు పార్టీలో కొనసాగే విషయంపైనా తర్జనభర్జన పడుతున్నారని, త్వరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది.

వారి అసంతృప్తులను గమనించి, ఈటెల రాజేందర్ స్వయంగా కలిసి నచ్చచెప్పినా ఫలితం లేకపోయిన్నట్లు వారు గైరాజరు కావడం వెల్లడి చేస్తుంది. బండి సంజయ్ ను మార్చడం కార్యకర్తలకు తప్పుడు సంకేతం ఇచ్చిన్నట్లయిందంటూ బహిరంగంగా తన అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ ఎంపీ విజయశాంతి మొక్కుబడిగా వచ్చి వెళ్లిపోయారు. అందుకు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ఉండటం కారణంగా ఆమె చెబుతున్నా అది కుంటి సాకు అని మాత్రమే అని వెల్లడి అవుతుంది.

ఇక బండి సంజయ్ ను మార్చడంతో తనకు కన్నీరు వచ్చిన్నట్లు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి చెప్పడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకనే ఈటెల రాజేందర్ తో కలసి వెళ్లి అమిత్ షాను కలిసి, సంజయ్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లడం వృద్దా ప్రయాస అన్నట్లు చెప్పి రావడం బహిరంగ రహస్యమే.

పైగా, ఈ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కవితను అరెస్ట్ చేయకుండా కేసీఆర్ కు అమ్ముడు పోయింది అన్నట్లు మాట్లాడటం నేరుగా కేంద్ర హోమ్ మంత్రిని విమర్శించడమే. బీజేపీ కార్యాలయంలోనే ఆ విధంగా మాట్లాడారంటే కాంగ్రెస్ లోకి తిరిగి వెళ్లేందుకు చూస్తున్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోందన్న ప్రశ్న తలెత్తుతుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles