బిజెపిలో చేరేవారు లేరనే అమిత్ షా ఖమ్మం రావడంలేదా!

Monday, September 16, 2024

తెలంగాణ బీజేపీ గురువారం ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగసభ ద్వారా తెలంగాణ రాజకీయాలలో తీవ్ర కలకలం రేపనున్నామని, మొత్తం రాజకీయాలు బిజెపికి అనుకూలంగా మారనున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొద్దీ రోజులుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. అయితే, అకస్మాత్తుగా బిపర్‌జోయ్ తుపాన్ కారణంగా అమిత్ షా పర్యటన వాయిదా పడినట్లు సంజయ్ బుధవారం ప్రకటించారు.

తుఫాన్ గుజరాత్ తీరాన్ని గురువారం సాయంత్రం తాకనున్న దృష్ట్యా కేంద్ర హోమ్ మంత్రిగా సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు. అయితే కేంద్రం ఇటువంటి  సమయంలో కేవలం అవసరమైన సహకారం మాత్రమే అందిస్తుంది. తక్షణ సహాయ కార్యక్రమాలు చేపట్టవలసింది రాష్ట్ర ప్రభుత్వమే.

వాస్తవానికి ముందుగానే అమిత్ షా తన ఖమ్మం పర్యటనను వాయిదా వేసుకున్నారని, చివరకు ఏదో ఒక సాకు చెప్పారని ప్రచారం జరుగుతుంది. మరో 24 గంటల్లో కేంద్ర హోమ్ మంత్రి ప్రసంగించాల్సిన బహిరంగ సభకు సంబంధించి ఖమ్మంలో బుధవారం సాయంత్రం వరకు చెప్పుకోదగిన సన్నాహాలు జరగకపోవడానికి ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.

తెలంగాణ బీజేపీలో అదుపులేని అంతర్గత కుమ్ములాటలు, కర్ణాటక ఎన్నికల అనంతరం పార్టీ వైపు ఎవ్వరూ చూడకపోవడం, పైగా ఉన్నవారే ఎందరు మిగులుతారో చెప్పలేని పరిస్థితులు నెలకొనడం, అన్నింటికీ మించి ఖమ్మంలో భారీగా జనాభాను సమీకరించే సామర్థ్యం గల నేతలు బీజేపీలో లేకపోవడంతో అమిత్ షా పర్యటన వాయిదా పడినట్లు చెబుతున్నారు.

లక్షమందితో బహిరంగ సభను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, ఆశించిన స్థాయిలో జనాన్ని సమీకరించ లేమని స్థానిక నాయకత్వం చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఖమ్మంలో అమిత్ షా హాజరయ్యే సభకు జనం రాకపోతే పరువు పోతుందని భావించి పర్యటన రద్దు చేసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తైనా సభకు అవసరమైన జనాన్ని తీసుకురాలేమని జిల్లా నాయకులు చెప్పడంతోనే షా పర్యటన వాయిదా పడినట్లు చెబుతున్నారు.

ముఖ్యంగా, బిఆర్ఎస్ నుండి సస్పెండ్ అయినా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావులు తాము బీజేపీలో చేరబోమని స్పష్టం చేసినా, కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధపడుతున్నా ఖమ్మంలో భారీ బహిరంగసభ జరపడం ద్వారా వారిద్దరిని బిజెపిలోకి తీసుకొస్తామని అమిత్ షాకు బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఒకభిప్రాయం కలిగించారని తెలుస్తున్నది. అది అబద్దమని తెలియడంతో అమిత్ షా ఆగ్రహం చెందారని స్పష్టం అవుతుంది.

గత నెలలో చేవెళ్లలో జరిగిన బహిరంగసభలోనే వారిద్దరూ బీజేపీలో చేరబోతున్నారనే అభిప్రాయాన్ని అమిత్ షాకు వీరిద్దరూ కలిగించారు. వారిద్దరూ అటువైపు చూడకపోవడమే గాక, మరెవ్వరినీ ఆ సభలో బీజేపీలో చేర్పించిన పోవడంతో కేంద్ర హోమ్ మంత్రి అక్కడనే ఆగ్రహం వ్యక్తం చేశారని మీడియాలో వార్తలు వచ్చాయి. మునుగోడు ఉపఎన్నిక అనంతరం చెప్పుకోదగిన వారెవ్వరూ బీజేపీలో చేరకపోవడం గమనార్హం.

ఒక వంక కేసీఆర్ జిల్లాల పర్యటనలు, మరోవంక కాంగ్రెస్ అగ్రనాయకుల పర్యటనలకు భారీ సంఖ్యలో ప్రజలు వస్తుండగా బిజెపి అగ్రనేతల సభలు పేలవంగా జరగడం తప్పుడు సంకేతం ప్రజలకు పంపినట్లు అవుతుందని భావిస్తున్నారు. మరోవంక, బండి సంజయ్ – ఈటెల రాజేందర్ వర్గపోరు ముగిసే అవకాశాలు కనిపించడం లేదు.

సంజయ్ ను రాష్త్ర అధ్యక్షుడిగా తొలగిస్తున్నారని అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. అదేమీ లేదంటూ సంజయ్ కొట్టిపారేస్తూ, తానే పార్టీ బాస్ ని అని చెప్పుకోవడానికి 125 మందితో రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరించారు. అయితే ఈ కార్యవర్గంలో గతంలో కాంగ్రెస్, బిఆర్ఎస్ లలో కీలక పదవులలో ఉన్నవారిని ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా కార్యవర్గ సభ్యులుగా నియమించడంతో రచ్చ రచ్చగా మారింది.

తాజాగా, 25 మంది బిఆర్ఎస్ ఎమ్యెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని చెప్పుకోవడం ద్వారా సంజయ్ అధికార పక్షంలో ఏదో కలకలం రేపాలని చూసారు. అయితే, ఆయన ఇటువంటి మాటలు చాలారోజులుగా చెబుతూ వస్తున్నారు. ఎమ్యెల్యేలు రాకపోగా మాజీ ఎమ్యెల్యేలు సహితం ఎవ్వరూ బిజెపి వైపు చూడటం లేదు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles