విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.5వేల కోట్ల నిధుల సమీకరణ కోసం రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్(ఆర్‌ఐఎన్‌ఎల్) బిడ్దర్లు పిలవడం, మరోవంక తాము బీడ్ వేసి విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామని తెలంగాణ సీఎం కేసీఆర్ బయలుదేరడంతో తెలుగు రాష్ట్రాలలో బిజెపి ఆత్మరక్షణలో పదేపరిస్థితులు నెలకొంటున్నాయి. మొత్తం దక్షిణ భారత దేశంలోనే బీజేపీ పెట్టిన కొత్తలోనే మొదటిసారిగా సొంత బలంపై విశాఖ మేయర్ స్థానం గెలుచుకుంది.
ఉత్తరాంధ్రలో పట్టబరుల ఎమ్యెల్సీ సీటును పివి చలపతిరావు గతంలో రెండుసార్లు గెల్చుకోగా, ఆయన కుమారుడు పివిఎన్ మాధవ్ టీడీపీ మద్దతుతో ఒకసారి గెల్చుకున్నారు. విశాఖపట్నం నుండి ఇప్పటికి మూడు సార్లు బిజెపి అభ్యర్థులు ఎమ్యెల్యేలుగా ఎన్నికయ్యారు. ఒకసారి ఎంపీ సీట్ కూడా గెల్చుకొంది.
అంతటి బలమైన విశాఖ నుండి గత నెలలో జరిగిన పట్టభద్రుల ఎమ్యెల్సీ ఎన్నికలలో సిట్టింగ్ అభ్యర్థిగా మాధవ్ డిపాజిట్ కూడా పొందలేక పోవడం గమనిస్తే బిజెపి తీవ్రమైన ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు స్పష్టం అవుతుంది. అందుకు ప్రధాన కారణం విభజన హామీల మేరకు విశాఖ రైల్వే జోన్ ఏర్పర్చక పోవడంతో పాటు విశాఖ స్టీల్ ప్రైవేటుపరం చేయబోవడం.
ఇప్పుడు కార్మికులకు నష్టం లేనిరీతిలో కేంద్రం చర్యలు తీసుకుంటుందని చెబుతూ ఇప్పటి వరకు ఊరడిస్తూ వస్తున్న బీజేపీ ఇప్పుడు కేంద్రమే కనీసం రూ 5,000 కోట్ల నిధులు కూడా సమకూర్చకుండా ప్రైవేట్ వారికి హస్తగతం చేసేందుకు కుట్ర పూరితంగా వ్యవహరిస్తోందని బలమైన సందేశం ఇవ్వడంలో కేసీఆర్ విజయం సాధించినట్లు భావిస్తున్నారు.
ఈ విషయమై ఏపీకి చెందిన బిజెపి నేతలు సహితం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిపలేక, తమ మద్దతుదారులకు నచ్చచెప్పలేక తికమక పడుతున్నారు. పైగా విశాఖ స్టీల్ ఏపీ ప్రజలకు సెంటిమెంట్ గా మారడంతో వారిని ఏవిధంగా ఏమార్చాలో తెలియక దిక్కుతోచని స్థితిలో బిజెపి నేతలు చిక్కుకుంటున్నారు.
గతంలో స్టీలు ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులను ఏపీ బీజేపీ నేతలు అనునయించారు. ఇప్పుడు మరోసారి అదే అంశంపై ఎన్నికల వాతావరణం ఏర్పడుతున్న సమయంలో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కడం, స్టీలు ప్లాంట్ పరిరక్షణ సమితి ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడం బీజేపీ నేతలకు మింగుడుపడటం లేదు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టిడిపితో చేతులు కలపకుండా కట్టడి చేయడం ద్వారా, ప్రధాని నరేంద్ర మోదీకి గల ఛరిష్మాతో వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో బలమైన ప్రభావం చూపాలని ప్రయత్నాలు తరుణంలో విశాఖ స్టీలు ప్లాంట్ వ్యవహారం బీజేపీ దూకుడుకు అడ్డుకట్ట వేస్తోంది.
తెలంగాణలో బయ్యారంలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామన్న మాట తప్పి ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కు వెడతారా అంటూ బీజేపీ నేతలు బిఆర్ఎస్ ను దుమ్మెత్తిపోస్తూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలు ప్రజలను అంతగా ఆకట్టుకోవడం లేదు.
పైగా, ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ సరిగ్గా రెండేళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ లో మొత్తం 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణ జరుగుతోందని పార్లమెంట్ లో ఒక ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో రాష్త్ర ప్రభుత్వం ప్రమేయం ఉండబోదని అంటూ `పాపం అంతా బీజేపీదే’ అనే స్పష్టమైన సంకేతం ఇచ్చారు.