ఏపీలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికలను ఎదుర్కోవడం గురించి మిత్రపక్షమైన బీజేపీ నుండి నిర్దిష్టమైన యాక్షన్ ప్లాన్ లేదా ప్రణాళిక కోసం దీర్ఘకాలంగా ఎదురు చూసి విసుగు చెందుతారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదారి తాను చూసుకునేందుకు సిద్దమయ్యారా? అకస్మాత్తుగా శనివారం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి సమాలోచనలు జరపడం ఆసక్తి కలిగిస్తోంది.
ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించడమే అజెండాగా ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన మొదటి నుండి స్పష్టం చేస్తున్నారు. అందుకోసం టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడిగా పోటీచేయాలని ఏడాదికి పైగా స్పష్టమైన ప్రతిపాదనలు ముందుంచారు. కొద్దికాలం క్రితం ఢిల్లీకి వెళ్లి, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డాను కూడా కలిసి ఈ ప్రతిపాదన చేశారు.
అయితే బిజెపి వ్యూహాత్మకంగా ఈ ప్రతిపాదనపై ఎటూ తేల్చకుండా, కేవలం పవన్ కళ్యాణ్ ను టిడిపితో కలవకుండా అడ్డుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది. `బిజెపి యాక్షన్ ప్లాన్ ఇవ్వక పోతే పవన్ ఇవ్వొచ్చు గదా’ అంటూ మొన్నీమధ్య ఏపీ బిజెపి ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ పేర్కొనడం గమనిస్తే ఈ విషయమై బిజెపి అసలు సీరియస్ గా లేదని స్పష్టం అవుతుంది.
మరోవంక, తిరిగి బిజెపితో చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు నాయుడు సహితం పలు రకాలుగా సంకేతాలు పంపుతున్నారు. తాజాగా రిపబ్లిక్ వరల్డ్ సదస్సులో మాట్లాడుతూ ప్రధాని మోదీ అభివృద్ధి ఎజెండాకు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టంగా ప్రకటించారు. తమ మధ్య విధానపరమైన విబేధాలు ఎప్పుడూ స్పష్టం చేశారు.
అయితే, బిజెపి అక్రమ ఆస్తుల కేసులలో ఇరుక్కున్న జగన్ వంటి `బలహీనుడైన’ సీఎం కొనసాగాలని కోరుకుంటున్నట్లు పలువురు ఆ పార్టీ నేతల ధోరణి స్పష్టం చేస్తున్నది. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ కావడం కీలక పరిణామంగా కనిపిస్తున్నది.
వీరిద్దరూ ఏ విషయమై చర్చించారో చెప్పక పోయినప్పటికీ ఏపీలోని రాజకీయ పరిస్థితుల గురించి, వచ్చే ఎన్నికల దృష్ట్యా అనుసరించ వలసిన వ్యూహం గురించే చర్చించినట్లు స్పష్టం అవుతుంది. ఈ సందర్భంగా బిజెపి వైఖరి కూడా చర్చకు వచ్చి ఉండే అవకాశం ఉంది. అందుకనే బిజెపి సానుకూలంగా స్పందించే వరకు ఎదురు చూడకుండా, తమ రెండు పార్టీలు ఉమ్మడిగా వ్యూహం రూపొందించుకోవాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.
జేపీ నడ్డాతో భేటీ అయిన తరువాత ఒక విధంగా ఉమ్మడి వ్యూహంపై పవన్ కళ్యాణ్ మౌనం వహిస్తున్నారు. పైగా, పొత్తులపై ఎవరూ మాట్లాడవద్దని సొంత పార్టీ నేతలను ఆదేశించారు. ఒకవేళ కొందరు బిజెపి నేతలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా స్పందించవద్దని స్పష్టం చేశారు. ఎదేమైనా పొత్తుల విషయంలో మేలు చేసే నిర్ణయం ఉంటుందని గతంలోనే పవన్ స్పష్టంగా పేర్కొనడం గమనార్హం.
బిజెపి కోసం ఎదురు చూడకుండా రెండు పార్టీల పొత్తుల విషయం, ముఖ్యంగా జనసేన పోటీ చేయాలనుకుంటున్న స్థానాల గురించి ముందుగా ఒక స్పష్టత ఏర్పర్చుకోవాలనే అంశం టిడిపి, జనసేన వర్గాలలో కొంతకాలంగా చర్చకు వస్తున్నది. ఈ విషయమై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రాధమికంగా చర్చించారా? తెలియవలసి ఉంది.
ఏదేమైనా తమ ప్రమేయం లేకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ జరపడం ఒక విధంగా బీజేపీ నాయకత్వంకు షాక్ ఇచ్చిన్నట్లే కాగలదు. పైగా, మీరు కలసి రాకపోయినా మేము ముందుకు వెడతామని పరోక్షంగా హెచ్చరించినట్లయింది.