బిజెపికి విజయశాంతి దూరం అవుతున్నారా!

Monday, January 20, 2025

గతంలో వాజపేయి ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీలో చేరి, ఒక వెలుగు వెలిగి, మహిళా మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా పార్టీ అగ్రనేతలకు సన్నిహితంగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయశాంతి ఇప్పుడు బీజేపీలో ఒంటరిగా భావిస్తున్నారు. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తనను జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా చేయడం మినహా ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని వాపోతున్నారు.

గతంలో పొరుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రచారంపై వినియోగించుకోగా, ఇప్పుడు తెలంగాణాలో సహితం తగు ప్రాధాన్యత ఇవ్వడం లేదని తీవ్ర అసంతృప్తిగా వ్యవహరిస్తున్నారు. పలు సార్లు తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంలేదని, తనను పక్కన పెడుతున్నారని సోషల్ మీడియా వేదికగా ఆమె వాపోయారు కూడా. ఈ మధ్యలో పార్టీ నిర్ణయాలను తరచూ ప్రశ్నిస్తుండటంతో పార్టీ వర్గాలలో కలకలం చెలరేగుతుంది.

ముఖ్యంగా బండి సంజయ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా తొలగించడం పట్ల ఆమె బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బన్నట్లు ఆమె వాపోయారు. ఒక దశలో ఈటెల రాజేందర్ కు కీలక పదవి ఇస్తున్నట్లు మీడియా కధనాలు రాగానే మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో జరిగిన ఒక విధమైన `నిరసన’ సమావేశంలో ఆమె కూడా ప్రముఖంగా పాల్గొన్నారు. బండి సంజయ్ ప్రోద్భలంతోనే ఈ సమావేశం జరిగిన్నటు అప్పట్లో వార్తలు వచ్చాయి.

తాజాగా, మణిపూర్ లో హింసాయుత ఘటనలపై ప్రధాని మోదీ నుండి బిజెపి నేతలంతా అమౌనం వహిస్తుండగా ఆమె సోషల్ మీడియా ద్వారా స్పందించడం సంచలనం కలిగిస్తున్నది. మణిపుర్‌లో జరుగుతున్న సంఘటనలు యావత్ దేశాన్ని త్రీవ్ర వేదనకు గురిచేస్తున్నాయని, సభ్యసమాజం సిగ్గుతో బాధపడుతుందంటూ ఆమె చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. మణిపూర్ లో బిజెపి ప్రభుత్వం ఉండటం గమనార్హం. 

మహిళ విషయంలోని నేరస్థులను ఉరి తీసి శిక్షించాలని డిమాండ్ కూడా ఆమె  చేశారు. అదే విధంగా బెంగాల్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్ ఇలా ఎక్కడైనా, ఎప్పుడైనా నేరస్థులు చేసే దుర్మార్గాలు హేయమైనవిగానే భావిస్తున్నానని.. తీవ్ర చర్యలు ఉండి తీరాలని విశ్వసిస్తున్నానని ఆమె  చెప్పుకొచ్చారు.

అంతకు ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న విజయశాంతి అందులో నుంచి మధ్యలోనే వెళ్లిపోవడం కలకలం రేపింది. పైగా, అందుకు కారణాన్ని కూడా బహిరంగంగానే సోషల్ మీడియా ద్వారా వెల్లడించడం మరింత వివాదంకు దారితీసింది. ఆ కార్యక్రమంలో  తెలంగాణ ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో ఖండించిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఉండటం వల్లే తాను మధ్యలోనే వచ్చినట్టుగా ఆమె స్పష్టం చేశారు. అలాంటి వ్యక్తులు ఎక్కడున్నా  తాను అక్కడ ఉండేందుకు అసౌకర్యంగా ఫీలవుతానంటూ తేల్చి చెప్పారు.

దీంతో విజయశాంతి స్వరం రోజురోజుకు మారుతోందని, బీజేపీలో కొనసాగడంపై అసహనానికి గురవుతున్నారని స్పష్టం అవుతుంది. పార్టీ మారే ఆలోచనలో ఉన్నారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. కాంగ్రెస్ నేతలు కొందరు ఆమెకు టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె కాంగ్రెస్ నుండే బీజేపీలో చేరడం గమనార్హం.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles