తెలంగాణలో ప్రముఖ బిఆర్ఎస్ నేతలకు సంబందించిన ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో అక్రమంగా సీట్లను అమ్ముకొని రూ 12,000 కోట్ల మేరకు కుంభకోణంకు పాల్పడిన వ్యవహారం తాజాగా ఎన్‌ఫోర్సమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జరిపిన సోదాలలో వెలుగులోకి వచ్చింది. బుధవారం ఏక కాలంలో 16 ప్రాంతాల్లో 9 మెడికల్ కాలేజీలతో పాటు వాటి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు.
పీజీ సీట్లను బ్లాక్ చేసి కోట్లు వసూలు చేసి దందాలో భారీగా నగదు లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగిందనే అనుమానంతో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ మొత్తం వ్యవహారంలో రూ 12,000 కోట్ల మేరకు అక్రమ వసూళ్లు జరిపి, దారి మళ్లించిన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సోదాలలో పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తున్నది.
హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఖమ్మం, రంగారెడ్డి, నల్గొండ తదితర ప్రాంతాల్లోని వైద్య కళాశాలలతో పాటు నిర్వాహకుల కార్యాలయాలు,ఇళ్లల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించాయి. సీఆర్పీఎఫ్, ఆర్‌ఏఎఫ్ బలగాలు ఈడీ బృందాలకు రక్షణ కల్పించాయి.
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, బిఆర్ఎస్ ఎమ్యెల్సీ పట్నం మహేంద్ర రెడ్డిలతో పాటు బిఆర్ఎస్ ప్రముఖులు, కేసీఆర్ సన్నిహితులకు చెందిన మెడికల్ కాలేజీలలో ఈ కుంభకోణం జరిగినట్లు గుర్తించారు. ప్రైవేటు మెడికల్ కాలేజీల నిర్వాహకులు పీజీ సీట్లను ముందస్తు ప్రణాళిక ప్రకారం బ్లాక్ చేసి, తర్వాత వాటిని కావాల్సిన వారికి భారీ మొత్తానికి విక్రయించారని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయ అధికారులు గత ఏడాది ఏప్రిల్‌లో వరంగల్ కమిషనరేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీనిపై మట్టేవాడ పోలీసులు 129/2022 నంబరుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసుల సమాచారం ఆధారంగానే తాజాగా ఈడీ రంగంలోకి దిగింది. సీట్లు అమ్ముకున్న సొమ్ముతో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారనే కోణంలో దర్యాప్తు ఆరంభించింది.ఈ వ్యవహారంలో రూ.వందల కోట్లు చేతులు మారి ఉంటాయని అనుమానిస్తున్న ఈడీ.. ఆ సొమ్మును ఎక్కడికి మళ్లించారనే విషయంపై కూపీ లాగుతోంది.
హైదరాబాద్‌లో సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీ,ఎల్‌బి నగర్ కామినేని కాలేజీ,మేడ్చల్ మెడిసిటీ మెడికల్ కాలేజీ,జూబ్లిహిల్స్‌లోని ప్రతిమ సంస్థ కార్పొరేట్ కార్యాలయం, కరీంనగర్‌లోని ప్రతిమ మెడికల్ కాలేజీ, మహబూబ్‌నగర్‌లోని ఎస్‌వీఎస్ కాలేజీ, నల్గొండలోని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రి, ఖమ్మంలోని మమత, రంగారెడ్డిలోని పట్నం మహేందర్‌రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, సంగారెడ్డిలోని ఎంఎన్‌ఆర్ వైద్య కళాశాలల్లో ఈ సోదాలు జరిగాయి.
రాష్ట్రంలోని కొన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు, మెరిట్ విద్యార్థులు, దళారులతో కుమ్మక్కై పీజీ సీట్ల బ్లాకింగ్ దందాకు పాల్పడ్డాయనేది ప్రధాన ఆరోపణ. ఓ కళాశాలలో కన్వీనర్ కోటాలో పీజీ సీటు పొందిన విద్యార్థి, మరో కళాశాలలోనూ చివరి విడత కౌన్సెలింగ్ వరకు సీటు బ్లాక్ చేయడమే ఈ దందాలో కీలకంగా మారింది. కోరుకున్న కాలేజీలో కోరుకున్న సీటు వచ్చే వరకు బ్లాక్ చేసే అవకాశం మెరిట్ ర్యాంకర్లకు ఉంది.
చివరి వరకు ఆ సీటు బ్లాక్ అయి ఉండటంతో మిగిలిన విద్యార్థులు ఆ సీటు పొందే అవకాశం ఉండదు. అందులో విద్యార్ధి చేరకపోతే మిగిలిపోయే సీటును కళాశాల నిర్వాహకులు సొంతంగా భర్తీ చేసుకునే వెలుసుబాటు ఉంది. ఇలాంటి సీట్లకు పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేసి సీట్లను విక్రయించారని కొన్ని ప్రైవేటు కళాశాలలపై కాళోజీ వర్సిటీ ఆరోపించింది.
గత ఏడాది వరంగల్ లోనే 45 సీట్లు పక్కదారి పట్టినట్లు వర్సిటీ వర్గాల అంతర్గత విచారణలో తేలింది. తమ సొంత రాష్ట్రాల్లో కన్వీనర్ కోటాలో సీటు వచ్చే అవకాశమున్న విద్యార్థులతో కలిసి తెలంగాణలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో సీట్లను బ్లాక్ చేసినట్లు గుర్తించారు. ప్రవాస భారతీయులు, వైద్య సంస్థ కోటాను వారు ఎంచుకున్నారు.ఇప్పుడు అన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈ విధంగా ఎన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేసి, దారి మళ్లించారని విషయమై ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తున్నది.